Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేసులోకి దిగనున్న టీమ్ ఇండియా
- ఆసీస్‌తో వార్మప్ పోరు నేడు
నవతెలంగాణ-బ్రిస్బేన్
ఐసీసీ టీ20 ప్రపంచకప్. అక్టోబర్ 16న తొలి రౌండ్ పోరు షురూ అయినా, అసలు సిసలు సమరానికి అక్టోబర్ 22 నుంచి తెరలేవనుంది. సూపర్ 12 సూపర్ సమరానికి చేరుకునేందుకు తొలి రౌండ్లో ఎనిమిది జట్లు పోటీపడుతుండగా.. మెగా వార్‌కు అస్త్రాలు సిద్ధం చేసుకుని పరీక్షించుకునేందుకు మరో ఎనిమిది జట్లు సిద్ధమవుతున్నాయి. 2007లో తొలిసారి టీ20 ప్రపంచకప్ ముద్దాడి.. 15 ఏండ్లుగా పొట్టి కప్పు కోసం తపిస్తోన్న టీమ్ ఇండియా నేడు తొలి తొలి సన్నాహాక పరీక్షకు రంగం సిద్ధం చేసుకుంది. డిఫెండింగ్ చాంపియన్, ఆతిథ్య ఆస్ట్రేలియాతో నేడు భారత్ తొలి వార్మప్ మ్యాచ్‌లో తలపడనుంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ ఉదయం 8.30 గంటలకు ఆరంభం అవుతుంది.
రియల్ రిహార్సల్ : ఆస్ట్రేలియాకు చేరుకోగానే.. భారత జట్టు ఇప్పటికే రెండు ప్రాక్టీస్ మ్యాచులు ఆడేసింది. వెస్టర్న్ ఆస్ట్రేలియా క్రికెట్ సంఘం (వాకా) ఎలెవన్‌తో తొలి మ్యాచ్‌లో గెలుపొందగా.. రెండో మ్యాచ్‌లో పరాజయం పాలైంది. కానీ రెండో మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రంగంలోకి దిగలేదు. దీంతో ఆ మ్యాచ్‌ను రిజర్వ్ ఆటగాళ్ల బలం పరీక్షించేందు కోసమే అని భావించవచ్చు. ఇక నేడు ఆస్ట్రేలియాతో వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్ అందుకు భిన్నం. ఇక్కడ ప్రయోగాలకు అవకాశం లేనే లేదు. ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా అనుసరించే ప్రణాళికలను దాదాపుగా ఇక్కడ అమలు చేయనున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌లలో పూర్తి స్థాయి బృందాలను బరిలోకి దింపనున్నారు. టాప్ ఆర్డర్లో రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లిలు నాణ్యమైన పేస్‌ను కొత్త బంతితో ఎదుర్కొవటం తొలి సవాల్. మిడిల్ ఆర్డర్లో సూర్యకుమార్ యాదవ్ భారత్‌కు అత్యంత కీలకంగా మారాడు. హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్‌లు బ్యాట్‌తో మెరవాల్సిన అవసరం ఉంది. బంతితో బుమ్రా లేని లోటును మహ్మద్ షమి ఏ మేరకు పూడ్చగలడో నేడు తేలనుంది. అర్షదీప్ సింగ్‌తో కలిసి షమి డెత్ ఓవర్లలో బంతిని పంచుకుంటాడా? లేదంటే పవర్‌ప్లేలో భువనేశ్వర్ కుమార్‌తో కలిసి ప్రత్యర్థుల భరతం పడతాడా? అనేది తేలాల్సి ఉంది. స్పిన్నర్లు అక్షర్ పటేల్, యుజ్వెంద్ర చాహల్‌లు ఇక్కడి పిచ్‌లపై లైన్, లెంగ్త్‌లను సరి చూసుకోవాల్సి ఉంది. అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్ నైపుణ్యాలకు సైతం నేడు వార్మప్ మ్యాచ్‌లో సవాల్ ఎదురు కానుంది. యువ బ్యాటర్ రిషబ్ పంత్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం దక్కనుందని చెప్పవచ్చు.
ఆసీస్ సైతం..! : ఆతిథ్య ఆస్ట్రేలియాకు సైతం ఇది కీలక సమరమే. స్వదేశంలో ఆసీస్‌పై సిరీస్ విజయం సాధించిన భారత్.. వరల్డ్‌కప్ ముంగిట మానసికంగా పైచేయి సాధించింది. అయితే, ఆ జట్టులో డెవిడ్ వార్నర్, మిచెల్ స్టార్క్, మిచెల్ మార్ష్ అందుబాటులో లేరు. పూర్తి స్థాయి జట్టుతో రంగంలోకి దిగుతున్న ఆస్ట్రేలియా.. వార్మప్‌లోనే భయమెరుగని క్రికెట్‌కు కొత్త నిర్వచనం ఇచ్చేందుకు సన్నద్ధం అవుతోంది. కెప్టెన్ అరోన్ ఫించ్ ఆడుతున్న ఏకైక ఫార్మాట్ టీ20లు. నాయకుడిగా టాప్ ఆర్డర్లో ధనాధన్ ఇన్నింగ్స్‌లు నమోదు చేసి జట్టును నడిపించాలని అతడి ఆలోచన. డెవిడ్ వార్నర్ వరుసగా భారీ స్కోర్లు నమోదు చేస్తున్నాడు. ఆరంభంలో ఈ ఇద్దరిని అదుపు చేయటం భారత బౌలర్లకు సవాల్‌గా నిలువనుంది. బౌలింగ్ విభాగంలోనూ ఆస్ట్రేలియా పటిష్టంగా కనిపిస్తోంది.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), అర్షదీప్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వెంద్ర చాహల్, దీపక్ హుడా, దినేశ్ కార్తీక్, విరాట్ కోహ్లి, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, సూర్యకుమార్ యాదవ్.
ఆస్ట్రేలియా జట్టు: అరోన్ ఫించ్ (కెప్టెన్), పాట్ కమిన్స్ (వైస్ కెప్టెన్), అష్టన్ ఆగర్, టిమ్ డెవిడ్, జోశ్ హజిల్‌వుడ్, జోశ్ ఇంగ్లిశ్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, కేన్ రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (వికెట్ కీపర్),డెవిడ్ వార్నర్, ఆడం జంపా.