Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవంబర్ 15 లోగా జాబితా ఇవ్వాలి!
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) హంగామాకు అప్పుడే తెరలేవనుంది. ఈ ఏడాది డిసెంబర్లో బెంగళూర్ వేదికగా ఆటగాళ్ల మినీ వేలం నిర్వహించనుండగా.. నవంబర్ 15 లోగా ప్రాంఛైజీలు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితాను సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు పది ఐపీఎల్ ప్రాంఛైజీలకు బీసీసీఐ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. మినీ వేలం వేదిక ఖరారు చేసినా.. ఇంకా తేదిపై బోర్డు నిర్ణయం తీసుకోలేదు. డిసెంబర్ మూడో వారంలో ఆటగాళ్ల మినీ వేలం నిర్వహించేందుకు అవకాశం మెండుగా కనిపిస్తోంది. గత ఏడాది రెండు కొత్త ప్రాంఛైజీల రాకతో మెగా వేలం నిర్వహించారు. కానీ ఈ ఏడాది ఆ తరహాలో వేలం ఉండబోదు. ఇప్పటికే తమతో ఒప్పందం చేసుకున్న క్రికెటర్లను అట్టిపెట్టుకునే, వదులుకునే అధికారం, స్వేచ్ఛ ప్రాంఛైజీలకు ఉంటుంది. ప్రాంఛైజీతో పొసగని ఆటగాళ్లు, ఆటగాళ్ల ప్రదర్శనతో సంతృప్తిగా లేని ప్రాంఛైజీలు బంధం తెంచుకునేందుకు ఇది సమయం. అయితే, మినీ వేలంలో ప్రతి ప్రాంఛైజీకి మరో రూ. 5 కోట్లను ఖర్చు చేసే అవకాశం బోర్డు కల్పించనుంది. నిరుడు జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో మిగిలిన డబ్బుతో కలిపి అదనంగా రూ. 5 కోట్లను వినియోగించుకునేందుకు ప్రాంఛైజీలకు వీలుంటుంది. దీంతో వేలంలో ప్రాంఛైజీలకు అందుబాటులో ఉన్న మొత్తం రూ. 95 కోట్లకు చేరనుంది. గత ఏడాది వేలంలో పంజాబ్ కింగ్స్ అత్యధికంగా రూ.3.45 కోట్లను మిగిల్చుకుంది. లక్నో సూపర్జెయింట్స్ పూర్తిగా వాటాను వాడుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ రూ.2.95 కోట్లు, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ రూ.1.55 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ రూ. 0.95 కోట్లు, కోల్కత నైట్రైడర్స్ రూ.0.45 కోట్లు, గుజరాత్ టైటాన్స్ రూ.0.15 కోట్లు, ముంబయి ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ రూ.0.10 కోట్లు కలిగి ఉన్నాయి. గత సీజన్లో గాయాల కారణంగా కొన్ని ప్రాంఛైజీలు కొందరు క్రికెటర్ల స్థానంలో ఇతర ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నాయి. ఇప్పుడు ఇద్దరిలో ఒకరిని కానీ, ఇద్దరినీ కాని అట్టిపెట్టుకునే, లేదంటే ఇద్దరినీ వదులుకునే అవకాశం సైతం ఉంది. ఈ మేరకు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల జాబితా సమర్పించేందుకు నవంబర్ 15ను గడువుగా బీసీసీఐ విధించింది.