Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సన్నాహాక సవాల్లో రోహిత్‌సేన అనుకోని విజయం అందుకుంది!. ఆసియా కప్‌లో వరుసగా స్కోర్లను కాపాడుకోవటంలో విఫలమైన టీమ్ ఇండియా.. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌లో ఆ బలహీనత నుంచి బయటపడుతున్నట్టు బలమైన సంకేతమే ఇచ్చింది. బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన మహ్మద్ షమి (3/4) చివరి ఓవర్లో చివరి నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టి.. సంచలన ప్రదర్శన చేశాడు. 187 పరుగుల ఛేదనలో 180 పరుగులకే కుప్పకూలిన ఆస్ట్రేలియా 6 పరుగు తేడాతో పరాజయం పాలైంది. అక్టోబర్ 19న మరో వార్మప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది.
- ఆసీస్‌పై భారత్ గెలుపు
- రాణించిన రాహుల్, సూర్య
- ఛేదనలో ఫించ్ పోరాటం వృథా
నవతెలంగాణ-బ్రిస్బేన్ :చివరి ఓవర్. ఆరు బంతుల్లో 11 పరుగులు అవసరం. చేతిలో నాలుగు వికెట్లు. ఆస్ట్రేలియాపై ఎటువంటి ఒత్తిడి లేదు. ఈ పరిస్థితుల్లో చివరి ఓవర్ టాస్క్‌ను మహ్మద్ షమికి అందించాడు కెప్టెన్ రోహిత్ శర్మ. తొలి రెండు బంతుల్లో ఆసీస్ నాలుగు పరుగులు సాధించింది. దీంతో కంగారూల గెలుపు లాంఛనమే అనిపించింది. ఇక్కడే మ్యాజిక్ మొదలెట్టాడు మహ్మద్ షమి. యార్కర్ల వర్షం కురిపించిన షమి.. వరుస బంతుల్లో వికెట్లు పడగొట్టాడు. నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 180 పరుగులకే కుప్పకూలింది. 6 పరుగుల తేడాతో టీమ్ ఇండియా అద్వితీయ విజయం నమోదు చేసింది. ఛేదనలో కెప్టెన్ అరోన్ ఫించ్ (76, 54 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), మిచెల్ మార్ష్ (35, 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ (2/20) రాణించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేసింది. ఓపెనర్ కెఎల్ రాహుల్ (57, 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (50, 33 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీలు నమోదు చేశారు.
షమి సూపర్ షో : 187 పరుగుల ఛేదనలో ఆస్ట్రేలియా ఆరంభం నుంచీ ధనాధన్ జోరు చూపించింది. కెప్టెన్ అరోన్ ఫించ్ (76, 54 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీతో కదం తొక్కాడు. మిచెల్ మార్ష్ (35. 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు మెరుపు ఆరంభాన్ని అందించాడు. స్టీవ్ స్మిత్ (11), మార్కస్ స్టోయినిస్ (7), టిమ్ డెవిడ్ (5), జోశ్ ఇంగ్లిశ్ (1) విఫలమైనా.. గ్లెన్ మాక్స్వెల్ (23, 16 బంతుల్లో 4 ఫోర్లు) దూకుడుగా ఆడాడు. ఛేదనలో సాఫీగా సాగుతున్న ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌కు తొలుత విరాట్ కోహ్లి కండ్లుచెదిరే ఫీల్డింగ్‌తో భారత్‌ను రేసులోకి తీసుకొచ్చాడు. టిమ్ డెవిడ్‌ను మెరుపు వేగంతో రనౌట్ చేసిన కోహ్లి... పాట్ కమిన్స్‌ను బౌండరీ లైన్ వద్ద క్యాచౌట్ చేశాడు. దీంతో మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఐదు బంతుల్లో 9 పరుగులే ఇచ్చిన అర్షదీప్.. చివరి బంతికి ఎడ్జ్ కావటంతో 13 పరుగుల ఓవర్ వేశాడు. ఇక ఇన్నింగ్స్‌లో ఒక్క ఓవర్ సైతం వేయని షమి.. నేరుగా చివరి ఓవర్‌కు రంగంలోకి దిగాడు. చివరి నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టి భారత్‌కు ఊహించని విజయాన్ని కట్టబెట్టాడు!. 20 ఓవర్లలో 180 పరుగులకే ఆసీస్ కుప్పకూలింది. భారత బౌలర్లలో స్పిన్నర్ అశ్విన్ (0/28) పొదుపుగా బౌలింగ్ చేసినా, వికెట్లు కూల్చలేదు.
రాహుల్, సూర్య జోరు : తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ కెఎల్ రాహుల్ (57, 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (15, 14 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ఓ ఎండ్‌లో నెమ్మదిగా ఆడగా.. రాహుల్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. వేగంగా అర్థ సెంచరీ పూర్తి చేసిన రాహుల్.. తొలి వికెట్‌కు 78 పరుగులు జోడించాడు. విరాట్ కోహ్లి (19, 13 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ఎక్కువసేపు వికెట్ కాపాడుకోలేదు. సూర్యకుమార్ యాదవ్ (50, 33 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) సూపర్ ఫామ్ కొనసాగించాడు. ఆరు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 32 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరి జోరుతో భారత్ భారీ స్కోరు సాధించింది. దినేశ్ కార్తీక్ (20, 14 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) రాణించాడు. హార్దిక్ పాండ్య (2) నిరాశపరిచాడు. రిషబ్ పంత్‌కు బ్యాటింగ్ అవకాశం దక్కలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో కేన్ రిచర్డ్సన్ (4/30) నాలుగు వికెట్లు పడగొట్టాడు.
స్కోరు వివరాలు :
భారత్ ఇన్నింగ్స్ : కెఎల్ రాహుల్ (సి) ఆగర్ (బి) మాక్స్వెల్ 57, రోహిత్ శర్మ (సి) మాక్స్వెల్ (బి) ఆగర్ 15, విరాట్ కోహ్లి (సి) మార్ష్ (బి) స్టార్క్ 19, సూర్యకుమార్ (సి,బి) కేన్ రిచర్డ్సన్ 50, హార్దిక్ పాండ్య (సి) టిమ్ డెవిడ్ (బి) కేన్ రిచర్డ్సన్ 2, దినేశ్ కార్తీక్ (సి) మాక్స్వెల్ (బి) కేన్ రిచర్డ్సన్ 20, అక్షర్ పటేల్ నాటౌట్ 6, అశ్విన్ (సి) మాక్స్వెల్ (బి) కేన్ రిచర్డ్సన్ 6, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం : (20 ఓవర్లలో 7 వికెట్లకు) 186.
వికెట్ల పతనం : 1-78, 2-80, 3-122, 4-127, 5-155, 6-180, 7-186.
బౌలింగ్ : మిచెల్ స్టార్క్ 3-0-20-1, కేన్ రిచర్డ్సన్ 4-0-30-4, పాట్ కమిన్స్ 3-0-33-0, మాక్స్వెల్ 3-0-28-1, ఆస్టన్ ఆగర్ 4-0-36-1, టిమ్ డెవిడ్ 1-0-7-0.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ : మిచెల్ మార్ష్ (బి) భువనేశ్వర్ కుమార్ 35, అరోన్ ఫించ్ (బి) హర్షల్ పటేల్ 76, స్టీవ్ స్మిత్ (బి) చాహల్ 11, మాక్స్వెల్ (సి) కార్తీక్ (బి) భువనేశ్వర్ 23, మార్కస్ స్టోయినిస్ (సి) కోహ్లి (బి) అర్షదీప్ సింగ్ 7, టిమ్ డెవిడ్ రనౌట్ (కోహ్లి) 5, జోశ్ ఇంగ్లిశ్ (బి) షమి 1, పాట్ కమిన్స్ (సి) కోహ్లి (బి) షమి 7, ఆగర్ రనౌట్ (కార్తీక్/షమి) 0, మిచెల్ స్టార్క్ నాటౌట్ 0, కేన్ రిచర్డ్సన్ (బి) షమి 0, ఎక్స్‌ట్రాలు : 15, మొత్తం : (10 ఓవర్లలో ఆలౌట్) 180.
వికెట్ల పతనం : 1-41, 2-97, 3-145, 4-159, 5-171, 6-171, 7-180, 8-180, 9-180, 10-180.
బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ 3-0-20-2, అర్షదీప్ సింగ్ 3-0-34-1, హార్దిక్ పాండ్య 3-0-29-0, హర్షల్ పటేల్ 3-0-30-1, రవిచంద్రన్ అశ్విన్ 4-0-28-0, యుజ్వెంద్ర చాహల్ 3-0-28-1, మహ్మద్ షమి 1-0-4-3.