Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసియా కప్ వేదిక మారుతుంది
- ఏసీసీ అధ్యక్షుడు జై షా స్పష్టీకరణ
ముంబయి : 2023 ఆసియా కప్ కోసం భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించబోదని బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు జై షా స్పష్టం చేశారు. వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్‌కు ముందు ఆసియా కప్‌ను నిర్వహించనున్నారు. బీసీసీఐ ఎఫ్టీపీలో సైతం ఆసియా కప్‌కు పాకిస్థాన్ వెళ్లేందుకు షెడ్యూల్ చేశారు. మంగళవారం ముంబయిలో బీసీసీఐ 91వ ఏజీఎం అనంతరం నూతనంగా ఎన్నికైన బోర్డు ఆఫీస్ బేరర్లతో కలిసి కార్యదర్శి జై షా మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. '2023 ఆసియా కప్ తటస్థ వేదికపై జరుగుతుంది. ఏసీసీ అధ్యక్షుడిగా చెబుతున్నాను, భారత జట్టు ఆసియా కప్ కోసం పాకిస్థాన్‌కు వెళ్లదు. పాకిస్థాన్ సైతం భారత్‌కు రాదు. గతంలో సైతం ఆసియా కప్‌ను తటస్థ వేదికపై నిర్వహించారు' అని జై షా తెలిపారు. 2023 ఆసియా కప్ కోసం టీమ్ ఇండియా పాకిస్థా న్కు వెళ్లకపోతే..
2023 వన్డే వరల్డ్‌కప్ కోసం పాకిస్థాన్ సైతం భారత్‌కు రానని పట్టుపడితే పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయో చెప్పటం కష్టమే. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ఐసీసీ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇదే సమయంలో 2025 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి సైతం పాకిస్థాన్ ఆతిథ్యం వహించాల్సి ఉంది. 2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు పాకిస్థాన్ బెట్టుచేస్తే... 2025 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని సైతం పాకిస్థాన్ నుంచి తరలించాలని బీసీసీఐ డిమాండ్ చేసే అవకాశం మెండుగానే ఉంది. పాకిస్థాన్‌లో పర్యటించటంపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో కట్టుబడి ఉండేందుకు ఏజీఎం సభ్యులు అంగీకరించినట్టు రాజీశ్ శుక్లా తెలిపాడు. అయితే, పాకిస్థాన్ పర్యటనకు ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టు వెళ్లేదే లేదని కార్యదర్శి జై షా కుండబద్దలు కొట్టడం గమనార్హం.