Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీసీసీఐలో ఎన్నికల క్రతువు ముగిసింది. కేంద్ర మంత్రి అమిత్ షా తనయుడు జై షా అత్యంత కీలక పదవి 'కార్యదర్శి'గా మళ్లీ బాధ్యతలు చేపట్టగా.. బీసీసీఐ అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ రోజర్ బిన్ని ఎన్నికయ్యాడు. బీసీసీఐ వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) మంగళవారం ముంబయి వేదికగా జరుగగా, ఏజీఎంలో రానున్న మూడేండ్లకు ఆఫీస్ బేరర్లను ఎన్నుకున్నారు. ఐదుగురు ఆఫీస్ బేరర్లు, అపెక్స్ కౌన్సిల్ ప్రతినిధి సహా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు ఇద్దరు ప్రతినిధులను ఏజీఎం ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
- ముగిసిన బీసీసీఐ ఏజీఎం, ఎన్నికలు
- బీసీసీఐ కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్ని
- మహిళల ఐపీఎల్‌కు ఆమోద ముద్ర
నవతెలంగాణ-ముంబయి :ఇటీవల భారత స్టార్ క్రికెటర్లు వరుసగా గాయాల పాలవుతున్నారు. కీలక టోర్నీలకు కీలక ఆటగాళ్ల సేవలను కోల్పోవటం టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బగా నిలుస్తోంది. తాజాగా 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలు గాయాలతో దూరమయ్యారు. కీలక ఆటగాళ్లు నిలకడగా గాయాలకు గురవుతూ, మెగా ఈవెంట్లలో భారత అవకాశాలను ప్రభావితం చేస్తున్నారు. ప్రస్తుతం టీమ్ ఇండియాకు గాయాల బెడదే అతిపెద్ద సమస్యగా తయారైంది. గాయాల బెడదకు గల కారణాలను మూలాల నుంచి తెలుసుకునేందుకు, గాయాల మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు బీసీసీఐ నూతన అధ్యక్షుడు రోజర్ బిన్ని తెలిపారు. ముంబయిలో మంగళవారం జరిగిన బోర్డు ఏజీఎంలో ఇతర ఆఫీస్ బేరర్లతో పాటు అధ్యక్షుడిగా ఏకగీవ్రంగా ఎన్నికైన రోజర్ బిన్ని.. ఈ సందర్భంగా గాయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నట్టు పేర్కొన్నారు.
పిచ్‌లకు జీవం! : 'క్రికెటర్లు గాయాల బారిన పడకుండా ఏం చేయగలమో ఆ దిశగా ప్రయత్నాలు చేపడుతాం. ఆటగాళ్లు తరచుగా గాయాలకు గురవటం ఆందోళనకరం. అందుకు గల కారణాలను మూలాల నుంచి తెలుసుకుని, గాయాల బారిన పడే అవకాశాలను తగ్గించేందుకు అవసరమైన చర్యలు చేపడుతాం. బెంగళూర్‌లోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో బోర్డుకు అత్యుత్తమ వైద్య బృందం అందుబాటులో ఉంది. వారి సేవలు వినియోగించుకుని, గాయాలకు గురయ్యే అవకాశాలను తగ్గించగలిగేందుకు చూస్తాం. ఇక దేశవాళీ క్రికెట్ సర్క్యూట్లో పిచ్‌లపై జీవం ఉంచాల్సిన అవసరం ఉంది. విదేశీ పర్యటనల్లో ప్రత్యేకించి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌కు వెళ్లినప్పుడు మన క్రికెటర్లు అక్కడి పిచ్, పరిస్థితులకు అలవాటు పడేందుకు ఇబ్బందులు పడకూడదు. అందుకు మన దగ్గర దేశవాళీ పిచ్‌ల్లోనే విప్లవాత్మక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది' అని రోజర్ బిన్ని వ్యాఖ్యానించాడు.
బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మూడో క్రికెటర్‌గా రోజర్ బిన్ని నిలిచాడు. విజయనగరం మహరాజ, సౌరవ్ గంగూలీలు భారత కెప్టెన్లుగా, బీసీసీఐ అధ్యక్షులుగా సేవలు అందించారు. తాజాగా ఆ జాబితాలో 1983 ప్రపంచకప్ విజేత జట్టులోని సభ్యుడు రోజర్ బిన్ని చేరిపోయాడు. అత్యంత పవర్ఫుల్, కీలక పదవి కార్యదర్శిగా జై షా ఎన్నిక కాగా.. ఉపాధ్యక్ష పదవిని రాజీవ్ శుక్లా నిలుపుకున్నాడు. సంయుక్త కార్యదర్శిగా దేవజిత్ సైకియ, కోశాధికారిగా ఆశీష్ షేలార్ ఎన్నికయ్యారు. జనరల్ బాడీ నుంచి అపెక్స్ కౌన్సిల్ ప్రతినిధిగా ఎంకెజె మజుందార్, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు అరుణ్ కుమార్ ధుమాల్, అవిషేక్ దాల్మియాలు నామినేట్ అయ్యారు. 2021-22 ఆర్థిక సంవత్సరం ఆడిట్ నివేదికలను, 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు 91వ బీసీసీఐ ఏజీఎం ఆమోద ముద్ర వేసింది. ఇక వచ్చే ఏడాది నుంచి మహిళల ఐపీఎల్ నిర్వహణకు సైతం ఏజీఎం పచ్చజెండా ఊపింది.
నో ప్రెస్ మీట్ : బీసీసీఐ వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నూతన ఆఫీస్ బేరర్లు మాట్లాడటం ఆనవాయితీగా వస్తోంది. మంగళవారం సైతం బిన్ని, షా టీమ్ మీడియాతో సమావేశమవుతుందని తొలుత సమాచారం ఇచ్చారు. కానీ, ఆ తర్వాత మీడియా ప్రతినిథుల ఫోన్లను తీసుకుని.. పెన్ను, పేపర్ ఇచ్చి ఇన్ఫార్మల్ సమావేశం నిర్వహించారు. ఇప్పటికే సెలక్షన్ కమిటీ సమావేశం అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లను ఎత్తివేసిన బీసీసీఐ.. తాజాగా ఏజీఎం అనంతరం సమావేశాన్ని సైతం నామమాత్రం చేయటం గమనార్హం.