Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూజిలాండ్‌తో భారత్ ఢ నేడు
- ఐసీసీ టీ20 ప్రపంచకప్ వార్మప్
బ్రిస్బేన్ (ఆస్ట్రేలియా) :2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్. స్వదేశంలో రెండు ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లు. పెర్త్‌లో వెస్టర్న్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో రెండు ప్రాక్టీస్ మ్యాచులు. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో తొలి వార్మప్ పోరు. ఆసియా కప్ ఓటమి అనంతరం జరిగిన ఈ అన్ని సిరీస్‌లు, మ్యాచుల్లో టీమ్ ఇండియా వైఫల్యాలను అధిగమించేందుకు చక్కగా వినియోగించుకుంది. పొట్టి ప్రపంచకప్ రేసులోకి అడుగుపెట్టేందుకు, ఫైనల్ రిహార్సల్‌కు సిద్ధమైంది టీమ్ ఇండియా. దీర్ఘకాలంగా వేధిస్తోన్న డెత్ ఓవర్ల బౌలింగ్‌ను ఆస్ట్రేలియాతో తొలి వార్మప్‌లో పరిష్కరించుకున్నట్టే కనిపించిన రోహిత్ సేన.. నేడు న్యూజిలాండ్‌తో రెండో, చివరి వార్మప్ మ్యాచ్‌లో తలపడేందుకు సిద్ధమైంది. బ్రిస్బేన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ రెండో వార్మప్ మ్యాచ్ నేడు. మధ్యాహ్నాం 1.30 గంటల నుంచి వార్మప్ సమరం డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.
ఆ ఇద్దరు మెరిసేనా? : ప్రపంచకప్ సూపర్ 12 సమరానికి ముందు భారత జట్టు అన్ని విభాగాల్లోనూ మెరుగ్గానే కనిపిస్తోంది. ఆఖరు నిమిషంలో ప్రపంచకప్ జట్టులోకి వచ్చిన మహ్మద్ షమి.. ఆస్ట్రేలియాపై చివరి ఓవర్‌తో అభిమానులకు, జట్టు మేనేజ్మెంట్కు నూతన ఉత్సాహాన్ని ఇచ్చాడు.
సంచలన బౌలింగ్‌తో యార్కర్ల వర్షం కురిపించాడు. అర్షదీప్ సింగ్ తోడుగా మహ్మద్ షమి డెత్ ఓవర్లను పంచుకుంటాడనే నమ్మకం జట్టులో ఏర్పడింది. స్పిన్నర్లు అశ్విన్, చాహల్, అక్షర్ పటేల్ వికెట్లు పడగొట్టే కోణాలపై ఫోకస్ చేయాల్సి ఉంది. బ్యాటింగ్ లైనప్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలు ఫామ్‌లోకి రావాల్సి ఉంది. ఆసీస్‌తో వార్మప్‌లో, వాకా ఎలెవన్‌తో ప్రాక్టీస్ గేమ్స్‌లో ఈ ఇద్దరు అంచనాలను అందుకోలేదు. అక్టోబర్ 23న పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు ఈ ఇద్దరు పరుగుల వేటలో దూసుకురావటం కీలకం. న్యూజిలాండ్ శిబిరంలో నాణ్యమైన ప్రపంచ శ్రేణి పేసర్లు ఉన్నారు. పదునైన పేస్, బౌన్స్‌ను రోహిత్, కోహ్లిలు ఎదుర్కొని పరుగుల వరద పారిస్తారేమో చూడాలి. కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్‌లు ఆరంభం నుంచీ ధనాధన్ షోలోకి ప్రవేశించేందుకు ఎదురు చూస్తున్నారు. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు నేడు అవకాశం లభించవచ్చు. వికెట్ కీపర్‌గా, బ్యాటర్‌గా పంత్ నేడు రంగంలోకి దిగేందుకు వీలుంది.
నిలువరిస్తారా? : ఆసియా కప్‌లో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్టు అలవోక విజయాలు నమోదు చేయగా.. ఆస్ట్రేలియాలో టీ20 వరల్డ్‌కప్‌కు ముందు, తొలి రౌండ్ పోటీల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు విజయాలు సాధిస్తోంది. ఆస్ట్రేలియాపై 186 పరుగులను సైతం భారత్ అద్వితీయ రీతిలో కాపాడుకుంది.
నేడు కివీస్‌పైనా బౌలర్లు పరీక్ష ఎదుర్కొనున్నారు. మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్‌లు బంతితో మెరుస్తారేమో చూడాలి. న్యూజిలాండ్ శిబిరంలో సంప్రదాయ బ్యాటర్లకు తోడు విలక్షణ షాట్లతో విజృంభించే బ్యాటర్లు ఉన్నారు. కొత్త బంతితో, డెత్ ఓవర్లలో న్యూజిలాండ్ బ్యాటర్లను ఏ మేరకు నిలువరిస్తారనేది ఆసక్తికరం.
భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), అర్షదీప్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వెంద్ర చాహల్, దీపక్ హుడా, దినేశ్ కార్తీక్, విరాట్ కోహ్లి, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, సూర్యకుమార్ యాదవ్.
న్యూజిలాండ్ జట్టు : కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైకెల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్మాన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గుసన్, మార్టిన్ గప్టిల్, ఆడం మిల్నె, డార్లీ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్, ఇశ్ సోధి, టిమ్ సౌథీ.