Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రికెటర్ల కోసం డ్రాఫ్ట్ పద్దతి
- మహిళల ఐపీఎల్ వేలం ప్రక్రియ
నవతెలంగాణ-ముంబయి
మహిళల ఇండియన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూఐపీఎల్) తొలి సీజన్‌కు బీసీసీఐ 91వ వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) ఆమోద ముద్ర వేయగా.. వచ్చే ఏడాది మార్చిలో అమ్మాయిల ఐపీఎల్‌కు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మహిళల ఐపీఎల్ ప్రాంఛైజీల వేలం, క్రికెటర్ల వేలం సహా షెడ్యూల్, వేదికలపై ఇప్పటికే పలు ప్రతిపాదనలు బోర్డు పరిశీలనలో ఉన్నాయి. ప్రాంఛైజీలను నగరాల ప్రాతిపదికన, జోన్ల వారీగా కేటాయించటంపై బీసీసీఐ ఆఫీస్ బేరర్లు, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ మేరకు ఆ అధికారాలను దకలు పరుస్తూ బీసీసీఐ ఏజీఏం తీర్మానించింది. 2023 మార్చిలో మహిళల ఐపీఎల్ తొలి సీజన్ జరుగనుండగా.. ఈ ఏడాది ఆఖర్లోనే ప్రాంఛైజీల వేలం, వచ్చే ఏడాది ఆరంభంలో క్రికెటర్ల వేలం ప్రక్రియ పూర్తి చేసేందుకు బీసీసీఐ రంగం సిద్ధం చేస్తోంది.
ప్రాంఛైజీలకు ఓపెన్ బిడ్డింగ్ : మహిళల ఐపీఎల్ ప్రాంఛైజీలను కొనుగోలు చేసేందుకు ఐపీఎల్ ప్రాంఛైజీ యాజమాన్యాలు ఆసక్తి చూపుతున్నాయి. తొలి సీజన్లో ఐదు జట్లతో ఐపీఎల్‌కు బోర్డు ప్రణాళిక రచించింది. బోర్డు వర్గాల సమాచారం ప్రకారం, సుమారు ఆరు ఐపీఎల్ ప్రాంఛైజీలు మహిళ ఐపీఎల్ ప్రాంఛైజీల పట్ల ఆసక్తి చూపించాయి. అయితే, ఐపీఎల్ ప్రాంఛైజీ యాజమాన్యాలకు మహిళల ఐపీఎల్ జట్ల కోనుగోలు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వటం లేదు. తొలుత, ఐపీఎల్ ప్రాంఛైజీలకు అవకాశం కల్పించి.. ఆ తర్వాతే ఇతర బిడ్డర్లకు చాన్స్ ఇవ్వాలని బోర్డు ఆలోచన చేసింది. కానీ, మహిళల ఐపీఎల్ ప్రాంఛైజీలను అప్పనంగా ఐపీఎల్ ప్రాంఛైజీలకు ఇవ్వటంపై బోర్డులో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఐదు ప్రాంఛైజీల కోసం ఓపెన్ బిడ్డింగ్ నిర్వహించనున్నారు. ఈ ఓపెన్ బిడ్డింగ్‌లో ఇతర సంస్థలతో పాటు ఐపీఎల్ ప్రాంఛైజీలు సైతం పోటీపడాల్సిందే.
డ్రాఫ్ట్ పద్దతిలో క్రికెటర్లు! : మెన్స్ ఐపీఎల్లో ఆటగాళ్ల వేలం ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మహిళల ఐపీఎల్‌కు సైతం అటువంటి వేలం ప్రక్రియనే అనుసరిస్తారని తొలుత అందరూ భావించారు. కానీ, బీసీసీఐ వినూత్నంగా కొత్త పద్దతిలో క్రికెటర్లను కొనుగోలు చేసేందుకు శ్రీకారం చుట్టనుంది. తొలి సీజన్లో ఆర్థిక అవాంతరాలు, బడ్జెట్ భారం ప్రాంఛైజీలు, ఆపై బోర్డుపై పడకుండా చూసేందుకు ఈ మేరకు కొత్త పద్దతులు ప్రవేశపెడుతుందని చెప్పవచ్చు. డ్రాఫ్ట్ పద్దతిలో ప్రతి ప్రాంఛైజీ తమకు అవసరమైన క్రికెటర్లను ఎంచుకునే అవకాశం ఇవ్వనున్నారు. రౌండ్ల వారీగా (వికెట్ కీపర్లు, ఆల్‌రౌండర్లు, బ్యాటర్లు, పేసర్లు, స్పిన్నర్లు) క్రికెటర్ల జాబితా నుంచి ప్రాంఛైజీలు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ పద్దతిలో ప్రతి క్రికెటర్‌ను కొనుగోలు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. ఒకే క్రికెటర్‌ను ఎక్కువ మంది ఎంచుకుంటే.. అప్పుడు బిడ్డింగ్ పెడతారు. భారత క్రికెట్లో సుమారు 60 మంది క్రికెటర్లను బీసీసీఐ యంత్రాంగం ఇప్పటికే వేలం కోసం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ప్రతి ప్రాంఛైజీలో 18 మంది ప్లేయర్లు ఉండాలి. తుది జట్టులో ఐదుగురు విదేశీ క్రికెటర్లను ఆడించవచ్చు. అందులో నలుగురు ఐసీసీ శాశ్వత సభ్య దేశాలకు చెందిన, ఓ క్రికెటర్ అసోసియేట్ సభ్య దేశానికి చెందిన వారై ఉండాలి. వేలంలో గరిష్టంగా ఆరుగురు విదేశీ ప్లేయర్లను ప్రాంఛైజీలు ఎంపిక చేసుకోవచ్చు.
నగరాలు?జోన్లు? : మహిళల ఐపీఎల్ తొలి సీజన్లో 20-22 మ్యాచులు నిర్వహించే అవకాశం ఉంది. ఐదు జట్లతో కూడిన లీగ్‌ను ఏకకాలంలో ఐదు నగరాల్లో నిర్వహించటం సాధ్యపడదు. దీంతో ప్రతి సీజన్‌ను రెండు నగరాల్లో నిర్వహించనున్నారు. రొటేషన్ పద్దతిలో ఆతిథ్య నగరాలను ఎంపిక చేస్తారు. అయితే మెన్స్ ఐపీఎల్ తరహాలో నగరాలకు ప్రాంఛైజీలకు కేటాయించాలా? లేదా జోన్ల వారీగా అందివ్వాలా? అనే అంశం ఇంకా తేలలేదు. అహ్మదాబాద్, ముంబయి, ఢిల్లీ, బెంగళూర్, చెన్నై, కోల్‌కత నగరాలు రేసులో ముందున్నాయి. ఇక జోన్ల వారీగా నార్త్ జోన్ (ధర్మశాల, జమ్మూ), సౌత్ జోన్ (కోచి, వైజాగ్), సెంట్రల్ జోన్ (ఇండోర్, నాగ్‌పూర్, రారుపూర్), ఈస్ట్ జోన్ (రాంచీ, కటక్), నార్త్ఈస్ట్ (గువహటి), వెస్ట్ జోన్ (పుణె, రాజ్‌కోట్)లతో జాబితా రూపొందించారు. హైబ్రిడ్ మోడల్లో నిర్వహించే అవకాశాలను సైతం తోసిపుచ్చలేం. బీసీసీఐ ఆఫీస్ బేరర్లు, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ అంశంలో ఓ నిర్ణయం తీసుకున్న అనంతరం మహిళల ఐపీఎల్ ప్రాంఛైజీల వేలం, క్రికెటర్ల వేలం ప్రక్రియ ముందుకు సాగుతుందని చెప్పవచ్చు.