Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-జై షా వ్యాఖ్యలపై పీసీబీ సీరియస్
- అత్యవసర సమావేశానికి డిమాండ్
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)లో కేంద్ర మంత్రి అమిత్ షా తనయుడు జై షా చిచ్చు పెట్టాడు. 2023 ఆసియా కప్ ఆతిథ్య వేదిక మార్పు తథ్యమని దుండుకు వ్యాఖ్యలు చేసిన జై షా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆగ్రహానికి గురయ్యాడు. బీసీసీఐ కార్యదర్శిగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన జై షా.. ఇతర ఆఫీస్ బేరర్లతో కలిసి మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటీగా మాట్లాడాడు. ఈ సందర్భంగా జై షా ఏకపక్ష వ్యాఖ్యలతో ఆసియా క్రికెట్లో ముసలం మొదలైంది!.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
జై షా వ్యాఖ్యల అర్థం
2023 ఆసియా కప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. 2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు భారత్ వేదిక కానుంది. వన్డే వరల్డ్‌కప్ ముంగిట ఆసియా కప్ షెడ్యూల్ చేశారు. సుమారు పదేండ్లుగా భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షిక క్రికెట్ ఆడటం లేదు. సరిహద్దు ఉద్రిక్తల నడుమ, ఇరు దేశాల ప్రభుత్వాలు ద్వైపాక్షిక క్రికెట్ పర్యటనలకు అనుమతులు ఇవ్వటం లేదు. దీంతో కొంతకాలంగా ఆసియా కప్‌లు తటస్థ వేదిక యుఏఈలో నిర్వహిస్తున్నారు. గత రెండు ఆసియా కప్‌లకు సైతం యుఏఈ వేదికగా నిలిచింది. దీంతో పాకిస్థాన్‌లో జరిగే 2023 ఆసియా కప్‌లో భారత్ ప్రాతినిథ్యంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు జై షా వివాదం రేగేలా స్పందించాడు!. 'పాకిస్థాన్ పర్యటనకు భారత్ వెళ్లదు. గతంలోనూ, పాకిస్థాన్ జట్టు భారత్‌కు.. భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లలేదు. 2023 ఆసియా కప్ అందుకు భిన్నం కాదు. పాకిస్థాన్‌కు భారత్ వెళ్లబోదు, దీంతో వేదికను తటస్థ వేదికకు మార్పు చేయాల్సిందే. ఈ మాట నేను ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా చెబుతున్నాను' అని జై షా అన్నాడు.
పీసీబీ స్పందన ఏంటీ?
బీసీసీఐ కార్యదర్శి, ఏసీసీ అధ్యక్షుడు జై షా వ్యాఖ్యల పట్ల పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్రంగా మండిపడింది. 2023 ఆసియా కప్ ఆతిథ్య వేదికగా పాకిస్థాన్ నిలువగా.. ఏకపక్షంగా జై షా వేదిక మార్పుపై వ్యాఖ్యలు ఎలా చేస్తారని పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. '2023 ఆసియా కప్ ఆతిథ్య హక్కులను పాకిస్థాన్‌కు కేటాయించినప్పుడు ఆసియా క్రికెట్ కౌన్సిల్ సభ్యులు అందరూ హర్షం వ్యక్తం చేశారు. వేదికను పాకిస్థాన్ నుంచి తటస్థ వేదిక మార్పు చేయటంపై అటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశంలో గానీ, ఇటు ఆతిథ్య పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో ఎటువంటి సంప్రదింపులు, చర్చలు జరుపలేదు. ఇలా ఏకపక్షంగా వేదిక మార్పుపై వ్యాఖ్యలు చేయటం తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ వ్యాఖ్యల ప్రభావం గురించి ఎటువంటి ఆలోచన, అవగాహన లేకుండా జై షా మాట్లాడారు. దీనిపై చర్చించేందుకు అత్యవసరంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సమావేశం నిర్వహించాలి' అని పీసీబీ ఘాటుగా స్పందించింది.
పరస్పర బారుకాట్?
ఐసీసీ ఈవెంట్ల విషయంలో భారత్, పాకిస్థాన్‌లు మెతక వైఖరితో ఉంటున్నాయి. అదే, ఆసియా కప్ అంశంలో కఠినంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ఆసియా కప్‌ను ఏకంగా నాలుగు సార్లు యుఏఈ వేదికగా నిర్వహించాల్సి వచ్చింది. ఐసీసీ 2016 టీ20 ప్రపంచకప్‌కు భారత్ వేదికగా నిలిచింది. అప్పుడు సైతం చివరి నిమిషం వరకు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి గ్రీన్ సిగల్ లభించలేదు. ఐసీసీ ఈవెంట్లకు బహిష్కరిస్తే.. ఆ ప్రభావం ఐసీసీ ఆదాయం వాటాపై పడుతుందనే భయం ఇరు దేశాలకు ఉంది. దీంతో ఐసీసీ ఈవెంట్లలో పాల్గొనమనే సాహసం చేయలేదు. కానీ ఇప్పుడు 2023 ఆసియా కప్‌కు భారత జట్టు పాకిస్థాన్‌కు రాకపోతే.. 2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌లో ఆడేందుకు భారత్‌కు సైతం రాబోమనే వైఖరి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీసుకోనున్నట్టు సమాచారం. అయితే, ఆసియా కప్ కోసం పాకిస్థాన్‌లో పర్యటించేందుకు ఇతర ఆసియా దేశాలు సైతం నిరాకరించేలా చేయటం బీసీసీఐకి పెద్ద విషయం కాదు. అప్పుడు, ఏకంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) సభ్యత్వం వదులుకునేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సిద్ధంగా ఉంటుంది. దీంతో, ఈ అంశాన్ని సున్నితంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.