Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ20 నిపుణుడి చేరిక లాంఛనమే
- బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ
ముంబయి : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెలక్షన్ కమిటీ విప్లవాత్మక మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు టెస్టు క్రికెట్ అనుభవం గడించిన వారికి మాత్రమే సెలక్షన్ కమిటీ ఎంపికకు ప్రాధాన్యత ఎక్కువగా లభించేది. మారిన పరిస్థితుల్లో, ఆధునిక క్రికెట్ అవసరాలకు తగినట్టు సెలక్షన్ కమిటీని సైతం మార్చేందుకు బోర్డు రంగం సిద్ధం చేసింది. టీ20 క్రికెట్ స్పెషలిస్ట్ సెలక్షన్ కమిటీలో తప్పనిసరిగా ఉండేందుకు బోర్డు నిబంధనలు మార్పు చేయనుంది. టీ20 క్రికెట్ అనుభవం, ఐపీఎల్ అనుభవం, లేదా ఈ ఫార్మాట్లో శిక్షణ అనుభవం ఉన్నవారికి సెలక్షన్ కమిటీలో తీసుకోనున్నారు. బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీని క్రికెట్ సలహా సంఘం (సీఏసీ) ఎంపిక చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం సీనియర్ సెలక్షన్ కమిటీలో ఇద్దరు సభ్యులు పదవీ కాలం ముగించుకున్నారు. సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ రానున్న కమిటీలో చీఫ్ సెలక్టర్‌గా ఉంటారా? లేదా సభ్యుడిగా ఉంటారా? అనేది తేలాల్సి ఉంది. త్వరలోనే బీసీసీఐ సీఏసీ నియమించనుంది. క్రికెట్ సలహా సంఘం ఈ మేరకు సెలక్షన్ కమిటీ ఎంపికకు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశాలను సమీక్ష చేయనుంది. నిజానికి టెస్టు క్రికెట్ అనుభవాన్ని పక్కనపెట్టడం జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ సిఫారసులకు వ్యతిరేకం. సెలక్షన్ కమిటీ సభ్యులకు ఉండాల్సిన అర్హతపై సీఏసీ సమీక్షించనుంది. చీఫ్ సెలక్టర్‌గా అత్యధిక టెస్టులు ఆడిన వ్యక్తి కొనసాగుతారు. కేవలం టీ20, వన్డే క్రికెట్ ఆడిన మాజీ ఆటగాళ్లకు అర్హత లభించనుంది. ఐపీఎల్ కోచింగ్ అనుభవం ప్రత్యేక అర్హత కానుంది. ప్రస్తుతం సెలక్షన్ కమిటీలో నలుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. ఈ సంఖ్యను ఐదుగురు సభ్యులకు పెంచటంపై సీఏసీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.