Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్‌లో 2023 వరల్డ్‌కప్‌పై ఠాకూర్
- పాక్ పర్యటనపై హౌం శాఖదే నిర్ణయం
- కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ వ్యాఖ్యలు
నవతెలంగాణ-న్యూఢిల్లీ
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)లో రేగిన చిచ్చును చల్లార్చే ప్రయత్నం చేశారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్. 2023 ఆసియా కప్ కోసం పాకిస్థాన్‌లో భారత జట్టు పర్యటించదని బీసీసీఐ కార్యదర్శి, ఏసీసీ అధ్యక్షుడు జై షా ఇటీవల దుందుడుకు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జై షా అనుభవ రాహిత్యంతో చేసిన వ్యాఖ్యలు భారత్, పాకిస్థాన్ క్రికెట సంబంధాలపై మరింత ప్రతికూల ప్రభావం చూపించాయి. దీనితో పాటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నుంచి పాకిస్థాన్ వైదొలిగే పరిస్థితులకు జై షా వ్యాఖ్యలు ఆజ్యం పోశాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ ఈ అంశంలో జోక్యం చేసుకున్నారు.
హౌం శాఖదే నిర్ణయం : '2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన అన్ని జట్లు భారత్‌కు వస్తాయి. అన్ని జట్లకు భారత్ స్వాగతం పలుకుతోంది. ఎన్నోసార్లు పాకిస్థాన్ జట్టు భారత్‌లో పర్యటించి, క్రికెట్ ఆడింది. ఏదేని జట్టు వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొనేది లేదని చెప్పే స్థానంలో భారత్ లేదు. నిజానికి ఎవరు అలా చేయడానికి కారణం ఉండదు. వరల్డ్‌కప్ కోసం అన్ని జట్లు వచ్చి, పోటీపడతాయని ఆశిస్తున్నాను. 2023 ఆసియా కప్ కోసం భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లటం అనేది హౌం మంత్రిత్వ శాఖ తీసుకోవాల్సిన నిర్ణయం. ఓవరాల్‌గా క్రికెటర్ల భద్రత ముఖ్యమైన అంశమని' అని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
మా చేతుల్లో లేదు : ఇదిలా ఉండగా, బీసీసీఐ నూతన అధ్యక్షుడు రోజర్ బిన్నీ సైతం ఈ అంశంలో స్పందించారు. 'పాకిస్థాన్ పర్యటనకు వెళ్లాలా? వద్దా? అనేది బీసీసీఐ తీసుకునే నిర్ణయం కాదు. ఏ పర్యటనకు అయినా ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. పాకిస్థాన్ పర్యటనకు సైతం బోర్డు నుంచి ప్రతిపాదనలు ఉంటాయి. ప్రభుత్వం నుంచి అనుమతులు లభించగానే.. భారత జట్టు అక్కడికి వెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతాయి. ఈ విషయంలో బోర్డు సొంతంగా నిర్ణయం తీసుకోవడానికి లేదని' రోజర్ బిన్నీ ఓ సమావేశంలో పేర్కొన్నాడు.
సుమారుగా దశాబ్దానికి పైగా భారత్, పాకిస్థాన్‌లు ద్వైపాక్షిక క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాయి. ఐసీసీ ఈవెంట్లతో పాటు ఏసీసీ టోర్నీ ఆసియా కప్‌లో ఇరు జట్లు ముఖాముఖి పోటీపడుతున్నాయి. అయితే, 2023 ఆసియా కప్‌కు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. పాకిస్థాన్‌లో భద్రతా కారణాల రీత్యా ఈ దశాబ్ద కాలంలో ఏ జట్టు అక్కడికి వెళ్లలేదు. ఇప్పుడిప్పుడే పాకిస్థాన్‌లో అంతర్జాతీయ క్రికెట్ తిరిగి ఆరంభమైంది. గతంలో ఐసీసీలో బిగ్-3 ఫార్ములా సమయంలో పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లపై బీసీసీఐ నుంచి పీసీబీకి హామీ లభించింది. ఆ హామీ నిలబెట్టుకోలేదనే కారణంగా పీసీబీ ఏకంగా బీసీసీఐని స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ కోర్టుకు లాగింది, అయినా ఫలితం దక్కలేదు. పాకిస్థాన్‌లో భారత జట్టు పర్యటనపై గతంలో బీసీసీఐ ఆఫీస్ బేరర్లు ఎవరూ నేరుగా వ్యాఖ్యలు చేయలేదు. ప్రభుత్వ అనుమతి లభిస్తే వెళ్తామనే చెప్పేవారు. కానీ జై షా ఏకంగా ఏసీసీ అధ్యక్ష హౌదాలో భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లదు, దీంతో ఆసియాకప్‌ను తటస్థ వేదికకు మార్చకతప్పదని చెప్పి వివాదానికి తెరతీశారు.