Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండుసార్లు చాంపియన్ నిష్క్రమణ
- సూపర్12కు ఐర్లాండ్, జింబాబ్వే
హౌబర్ట్ (ఆస్ట్రేలియా) : 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్ సంచనలంతో మొదలైంది. 2012, 2016 టీ20 ప్రపంచకప్ చాంపియన్ వెస్టిండీస్ పొట్టి ప్రపంచకప్ రేసు నుంచి నిష్క్రమించింది. తొలి రౌండ్ పోరులో చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిన కరీబియన్లు.. 2022 టీ20 ప్రపంచకప్ సూపర్12 (ప్రధాన టోర్నీ)కు దూరమయ్యారు. మరోవైపు గ్రూప్-బిలో స్కాట్లాండ్పై విజయం సాధించిన జింబాబ్వే సూపర్12కు అర్హత సాధించింది. సూపర్12 దశలో గ్రూప్-1లో ఐర్లాండ్ ఆడనుండగా.. గ్రూప్-బిలో జింబాబ్వే పోటీపడనుంది.
ఔరా..ఐర్లాండ్! : చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో వెస్టిండీస్ అన్ని విభాగాల్లో విఫలమైంది. ఐర్లాండ్‌పై తొలుత బ్యాటింగ్ చేసి మెరుగైన స్కోరు సాధించలేదు. బ్రాండన్ కింగ్ (62 నాటౌట్, 48 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్థ సెంచరీ సాధించినా.. జట్టుకు మంచి స్కోరు అందించలేదు. టాప్ ఆర్డర్లో మేయర్స్ (1), లూయిస్ (13) సహా కెప్టెన్ నికోలస్ పూరన్ (13) విఫలమయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో గారెత్ డెలానీ (3/16) విండీస్ బ్యాటర్ల దూకుడుకు ముకుతాడు వేశాడు. ఐర్లాండ్ బౌలర్లు సమిష్టిగా మెరవటంతో 20 ఓవర్లలో 5 వికెట్లకు వెస్టిండీస్ 146 పరుగులే చేసింది. ఛేదనలో ఐర్లాండ్ బ్యాటర్లు చెలరేగారు. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (66 నాటౌట్, 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), లోర్కాన్ టక్కర్ (45 నాటౌట్, 35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) అదరగొట్టారు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు అజేయంగా 77 పరుగులు జోడించారు. 17.3 ఓవర్లలోనే ఐర్లాండ్‌ను సూపర్12 దశకు చేర్చారు. మరో ఓపెనర్ ఆండీ బల్బిర్నె (37, 23 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. గారెత్ డెలానీ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
భళా.. జింబాబ్వే : మరో నాకౌట్ తరహా పోరులో స్కాట్లాండ్పై జింబాబ్వే ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 132 పరుగులు చేసింది. ఓపెనర్ జార్జ్ మున్సె (54, 51 బంతుల్లో 7 ఫోర్లు) అర్థ సెంచరీ సాధించాడు. మిగతా బ్యాటర్లు జోన్స్ (4), క్రాస్ (1), రిచీ (13), మైకల్ (12) విఫలమయ్యారు. మెక్లాయిడ్ (25) ఫర్వాలేదనిపించాడు. జింబాబ్వే బౌలర్లు చతారా, రిచర్డ్‌లు రెండేసి వికెట్లతో రాణించి స్కాట్లాండ్ను కట్టడి చేశారు. స్వల్ప లక్ష్యాన్ని జింబాబ్వే 18.3 ఓవర్లలోనే ఊదేసింది. క్రెయిగ్ ఎర్విన్ (58, 54 బంతుల్లో 6 ఫోర్లు), సికందర్ రజా (40, 23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరవటంతో జింబాబ్వే ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. సికందర్ రజా 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. తొలి రౌండ్లో గ్రూప్-ఏ నుంచి శ్రీలంక, నెదర్లాండ్స్ సూపర్12 దశకు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.