Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తుది జట్టు కూర్పు ఆసక్తికరం
- నెట్స్‌లో చెమటోడ్చిన రోహిత్‌సేన
నవతెలంగాణ-మెల్బోర్న్
2007 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను అందుకున్న టీమ్ ఇండియా.. 15 ఏండ్లుగా ఆ కప్పును మరోసారి అందుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. అయినా, పొట్టి ప్రపంచకప్ అందని ద్రాక్షలాగే ఉండిపోయింది. అత్యుత్తమ జట్టు అందుబాటులో ఉన్నప్పటికీ.. విరాట్ కోహ్లి నాయకత్వ వైఫల్యంతోనే ఐసీసీ టైటిల్ దక్కలేదనే విమర్శ ఓ వర్గంలో ఉండిపోయింది. ఇప్పుడు ఐపీఎల్ విజయవంతమైన సారథి రోహిత్ శర్మకు పగ్గాలు అందివ్వటంతో.. ఐసీసీ టైటిల్ కొట్టాలనే కాంక్ష ఎక్కువైంది. గతంలో మాదిరి స్టార్ క్రికెటర్లు రవీంద్ర జడేజా, జశ్‌ప్రీత్ బుమ్రా ఇప్పుడు అందుబాటులో లేరు. అందుబాటులో ఉన్న జట్టుతోనే కప్పు కల నెరవేర్చుకునేందుకు భారత్ రంగం సిద్ధం చేసుకుంది. అక్టోబర్ 23న పొరుగు దేశం పాకిస్థాన్‌తో పోరుతో భారత్ టైటిల్ రేసును మొదలుపెట్టనుంది. పాక్‌తో సూపర్12 సమరానికి తుది జట్టుపై భారత్ కసరత్తులు చేస్తోంది.
ఇద్దరిలో ఎవరు? : మెల్బోర్న్ పెద్ద మైదానం. బౌండరీ పరిధి ఎక్కువ. మణికట్టు స్పిన్నర్ యుజ్వెంద్ర చాహల్ తొలి స్పిన్నర్‌గా తుది జట్టులో నిలువనున్నాడు. బౌలింగ్ ఆల్‌రౌండర్ కోటాలో రెండో స్పిన్నర్ బెర్త్ రేసులో అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు. గత ఏడాది కాలంగా భారత జట్టులో ఆటగాళ్లు మారుతూనే ఉన్నారు. దీంతో పాక్‌తో మ్యాచ్‌కు తుది జట్టు బెర్త్‌లపై సందిగ్థత కొనసాగుతోంది. అక్షర్ పటేల్ ఇటీవల అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పరుగులు పొదుపుతో పాటు వికెట్ల వేటలో దూసుకెళ్లాడు. అశ్విన్ ఎకానమీతో మెప్పించినా, వికెట్ల వేటలో వెనుకంజ వేశాడు. కానీ పాకిస్థాన్ టాప్ ఆర్డర్లో ముగ్గురు ఎడమ చేతి వాటం బ్యాటర్లు ఉన్నారు. ఎడమ చేతి వాటం బ్యాటర్లకు లెఫ్టార్మ్ స్పిన్నర్‌ను ప్రయోగించటం కష్టం. దీంతో అశ్విన్ రేసులోకి వస్తున్నాడు. జడేజా గాయంతో దూరం కావటంతో.. ఈ సందిగ్థత భారత్‌కు వచ్చింది. ఇక మూడో పేసర్‌గా మహ్మద్ షమి తుది జట్టులో నిలువటం లాంఛనమే. భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, మహ్మద్ షమిలతో కూడిన పేస్ విభాగం పాకిస్థాన్ బ్యాటర్ల సవాల్‌కు సిద్ధం కానుంది.
చెమటోడ్చిన రోహిత్ : పాకిస్థాన్‌తో పోరుకు కెప్టెన్ రోహిత్ శర్మ కఠోరంగా సాధన చేస్తున్నాడు. శుక్రవారం ప్రాక్టీస్ సెషన్‌కు సీనియర్ ఆటగాళ్లు దూరంగా ఉన్నప్పటికీ.. రోహిత్ శర్మ రెండు సెషన్ల పాటు నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. పాక్ పేసర్ షహీన్ షా అఫ్రిదిని ఎదుర్కొనేందుకు శ్రీలంక నెట్ బౌలింగ్ నిపుణుడు బంతులు విసరగా ఎదుర్కొన్నాడు. బ్యాట్‌ను అడ్డంగా ఊపుతూ పుల్ షాట్లు ఆడటంలో రోహిత్ దిట్ట. కానీ షహీన్‌కు పవర్‌ప్లేలోనే చెక్ పెట్టేందుకు రోహిత్ ఆ షాట్లను ఆడటం లేదు. ఆరంభంలో షహీన్ జోరుకు బ్రేక్‌కు వేసే బాధ్యతను నాయకుడిగా తీసుకున్న రోహిత్.. అందుకు తగినట్టు ప్రాక్టీస్ చేశాడు. తన ప్రాక్టీస్ సెషన్ ముగిసినా.. చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి ఇతర ఆటగాళ్ల ప్రాక్టీస్‌ను దగ్గరుండి చూశాడు.