Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రామీణ ప్రాంతాలపై ఫోకస్
- మౌళిక వసతుల కల్పనపై దృష్టి
- శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్
రాష్ట్రాన్ని క్రీడా హబ్ గా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రతిభ, పట్టుదల, క్రమశిక్షణ గల క్రీడాకారులకు రాష్ట్రంలో కొదవ లేదు, పాఠశాల స్థాయిలోనే గుర్తించి.. మెరుగైన శిక్షణతో అద్భుతాలు సష్టించనున్నామని అన్నారు. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్, సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో వాలీబాల్ అకాడమీ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని సైక్లింగ్ వెలోడ్రమ్, గచ్చిబౌలిలోని శాట్స్ షుటింగ్ రేంజ్, కరీంనగర్, ఆదిలాబాద్‌లోని స్పోర్ట్స్ స్కూల్స్ ద్వారా ప్రతిభావంతులైన పేద క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం ఉచిత శిక్షణ, వసతి సదుపాయం కల్పిస్తోందని తెలిపారు. సమీప భవిష్యత్ లో తెలంగాణ నుంచి పీటీ ఉషా, కరణం మల్లీశ్వరీ, నీరజ్ చోప్రా, నిఖత్ జరీన్ వంటి క్రీడాకారులు ఉద్భవిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ క్రీడా ప్రాంగణాలు :
ప్రతిభావంతులైన వర్ధమాన క్రీడాకారులను గ్రామీణ స్థాయి నుంచి వెలికి తీసేందుకు ప్రతి గ్రామ పంచాయతీలోనూ తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. రాష్ట్రంలోని బాల బాలికలు, యువతకు ఫిట్నెస్ పై అవగాహన కల్పించేందుకు క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. ఒక్కో క్రీడా ప్రాంగణం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.5 లక్షలు కేటాయించింది. ఇప్పటికే చాలా క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి వచ్చాయని వెంకటేశ్వరెడ్డి తెలిపారు.
గజ్వేల్ స్పోర్ట్స్ విలేజ్ :
'హైదరాబాద్ వంటి మహా నగరంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులకు కూడా అధునాతన క్రీడా మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గజ్వేల్ స్పోర్ట్స్ విలేజ్ ఆలోచనకు అంకురార్పణ పడింది. ఇందుకోసం ఇప్పటికే మంత్రి హరీశ్ రావు సహకారంతో 20 ఎకరాల స్థలం కూడా కేటాయించారు. ఈ స్పోర్ట్స్ విలేజ్ నిర్మాణం కోసం రూ.50 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఫుట్ బాల్, హాకీ, రెజ్లింగ్, అథ్లెటిక్స్ తో సహా 18కి పైగా క్రీడాంశాలకు తగ్గట్టుగా ఈ స్టేడియాన్ని నిర్మిస్తున్నామని వెంకటేశ్వర్ రెడ్డి చెప్పారు.
అల్లీపురంలో ఇండోర్ స్టేడియం :
మహబూబ్ నగర్ జిల్లా దేవరక్రద నియోజకవర్గం, సీసీ కుంట మండలం అల్లీపురంలో దాదాపు రూ.1.59 కోట్ల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో మినీ ఇండోర్ స్టేడియం నిర్మాణం జరిగింది. ఉడెన్ ఫ్లోర్ల్ గల నాలుగు బ్యాడ్మింటన్ కోర్టులు, 2 టేబుల్ టెన్నిస్ బోర్డులు, సింథటిక్ కబడ్డీ కోర్టు, చెస్, జిమ్నాస్టిక్స్ తో పాటు బాస్కెట్ బాల్, వాలీబాల్ కోర్టును ఏర్పాటు చేశాం. రాజ్యసభ సభ్యులు జొగినపల్లి సంతోష్ కుమార్, స్థానిక ఎంపీ ఎం.శ్రీనివాస్ రెడ్డి సహకారంతో త్వరలో రూ.50 లక్షల వ్యయంతో బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్, జిమ్ హాల్స్ ను ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు.
కార్పొరేట్ సంస్థల సహకారంతో :
హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు ఒక్కో క్రీడను దత్తత తీసుకుంటే రాష్ట్రంలో క్రీడా రంగాన్ని మరింత అభివద్ధి చేసేందుకు ఆస్కారం ఉంటుంది. నూతన స్పోర్ట్స్ పాలసీ అమల్లోకి వచ్చాక హరియాణా, ఒడిశా రాష్ట్రాలను అధిగమించి తెలంగాణ దేశ క్రీడా రంగంలో అగ్రభాగన నిలుస్తుందని అల్లీపురం ఆశాభావం వ్యక్తం చేశారు.