Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియా 89 పరుగులతో గెలుపు
- ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2022
సిడ్నీ (ఆస్ట్రేలియా) : డిఫెండింగ్ చాంపియన్‌కు షాక్. 2011 నుంచి సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో ఓటమెరుగని కంగారూలు.. ఐసీసీ టీ20 ప్రపంచకప్ సూపర్12 ఆరంభ మ్యాచ్‌లో చేతులెత్తేశారు. బ్యాట్‌తో, బంతితో అదరగొట్టిన న్యూజిలాండ్ సూపర్12లో ఘనంగా బోణీ కొట్టింది. 201 పరుగుల ఛేదనలో ఆస్ట్రేలియా 111 పరుగులకే కుప్పకూలింది. 89 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లోనే నెట్‌రన్‌రేట్‌ను భారీగా పెంచుకుంది. గ్రూప్-1 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 200 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే (92 నాటౌట్, 58 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో చెలరేగాడు. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ (42, 16 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధనాధన్ ఆరంభాన్ని అందించాడు. కెఎ్టన్ కేన్ విలియమ్సన్ (23, 23 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) స్ట్రయిక్రొటేషన్కు ప్రాధాన్యత ఇవ్వగా.. జేమ్స్ నీషమ్ (26 నాటౌట్, 13 బంతుల్లో 2 సిక్స్‌లు) ధనాధన్ ముగింపు అందించాడు.
ఇక ఛేదనలో ఆస్ట్రేలియాను టిమ్ సౌథీ (3/6) వణికించాడు. డెవిడ్ వార్నర్ (5), మిచెల్ మార్ష్ (16)లను ఆరంభంలోనే అవుట్ చేసిన సౌథీ.. పరుగుల నియంత్రణ పాటించాడు. ఓ ఎండ్‌లో సౌథీ ఒత్తిడి పెంచగా.. మరో ఎండ్ నుంచి సైతం వికెట్ల వేట జోరుగా సాగింది. కెప్టెన్ అరోన్ ఫించ్ (13), మార్కస్ స్టోయినిస్ (7), టిమ్ డెవిడ్ (11)లను స్పిన్నర్ శాంట్నర్ వెనక్కి పంపించాడు. దీంతో 68 పరుగులకే ఆసీస్ ఐదు వికెట్లు కోల్పోయింది. గ్లెన్ మాక్స్వెల్ (28), పాట్ కమిన్స్ (21) ఓటమి అంతరం కుదించేందుకు ప్రయత్నించారు. 17.1 ఓవర్లలో 111 పరుగులకే ఆస్ట్రేలియా కుప్పకూలింది. 89 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. 2011 తర్వాత ఆసీస్‌ను ఆస్ట్రేలియా గడ్డపై ఓడించింది. డెవాన్ కాన్వే 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.
సంక్షిప్త స్కోర్లు :
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : 200/3 (డెవాన్ కాన్వే 92, ఫిన్ అలెన్ 42, హజిల్‌వుడ్ 2/41, జంపా 1/39)
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ : 111/10 (మాక్స్వెల్ 28, కమిన్స్ 21, టిమ్ సౌథీ 3/6, మిచెల్ శాంట్నర్ 3/31)