Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, పాక్ సూపర్ ఢ నేడు
- మెగా మ్యాచ్‌కు వర్షం ముప్పు
- మధ్యాహ్నాం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
అత్యుత్తమ బ్యాటింగ్ బృందం ఓ వైపు. అత్యుత్తమ పేస్ బృందం మరోవైపు. విలక్షణ షాట్లతో స్టేడియం నలుమూలలా బంతిని బాదగల సమర్థులు ఓ వైపు. నాణ్యమైన్ పేస్‌తో పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను గతిని మార్చటంలో సిద్ధహస్తులు మరోవైపు. భారత బ్యాటర్లు, పాక్ పేసర్ల నడుమ సాగుతున్న సూపర్ సమరానికి లక్ష సీట్ల సామర్థ్యం కలిగిన మెల్బోర్న్ మైదానం వేదిక. ఐసీసీ టీ20 ప్రపంచకప్ సూపర్12ను దాయాదులు ముఖాముఖి మ్యాచ్‌తో మొదలెట్టేందుకు సిద్ధమయ్యాయి. భారత్, పాకిస్థాన్ సూపర్12 సమరం నేడు.
నవతెలంగాణ-మెల్బోర్న్
సూర్య సమేత విధ్వంసం!
భారత బ్యాటింగ్ లైనప్‌లో విధ్వంసకర బ్యాటర్లకు కొదవలేదు. బిగ్ హిట్టింగ్‌లో ఎవరికీ వారే అగ్రగణ్యులు!. అయినా, పొట్టి ఫార్మాట్లో ప్రస్తుతం మేటీ బ్యాటర్, హిట్టర్ సూర్యకుమార్ యాదవ్. 360 డిగ్రీల్లో ఎక్కడైనా, ఎవరిపైనానైనా బౌండరీలు బాదటం సూర్య ప్రత్యేకత. నేడు పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో సూర్యకుమార్ భారత్‌కు ఎక్స్ ఫ్యాక్టర్. సూర్యకుమార్ ఇన్నింగ్స్‌పైనే విజయావకాశాలు అధికంగా ఆధారపడి ఉన్నాయి. ఎదుర్కొన్న తక్కువ బంతుల్లో, వీలైనన్ని పరుగులు పిండుకునే సూర్యకుమార్‌కు.. టాప్-3 త్రయం రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి ఎటువంటి పునాది వేస్తారనేది ఆసక్తికరం. పవర్‌ప్లేలో పాక్ పేసర్లను ఎదుర్కొనేందుకు రోహిత్ శర్మ గట్టిగానే సిద్దమయ్యాడు. సూర్యకు ముందు రోహిత్.. సూర్య తర్వాత హార్దిక్ అంచనాలను అందుకుంటే పాక్ బౌలర్లకు మెల్బోర్న్లో చుక్కలు కనిపించటం ఖాయం!. బ్యాటింగ్ లైనప్ కూర్పులో రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్‌లలో ఎవరు తుది జట్టులో నిలుస్తారనేది చూడాలి. ఇక బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్‌లతో కలిసి మహ్మద్ షమి పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. డెత్ ఓవర్లలో బౌలింగ్ సమస్యను అర్షదీప్ సింగ్, మహ్మద్ షమి ద్వయం అధిగమించేందుకు ఎదురుచూస్తోంది. స్పిన్ కాంబినేషన్‌పై సైతం పీటముడి తేలాల్సి ఉంది. అశ్విన్, చాహల్, అక్షర్ పటేల్‌లో ఇద్దరు తుది జట్టులో నిలువనున్నారు. అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్‌గా కొనసాగనున్నా.. పాక్ బ్యాటింగ్ లైనప్ దృష్ట్యా చాహల్, అశ్విన్‌లలో ఒకరు చోటు సాధించనున్నారు.
షహీన్ షాతో కొండంత బలం!
షహీన్ షా అఫ్రిది గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చాడు. షహీన్ షా రాకతో పాకిస్థాన్ జట్టులో సరికొత్త ఉత్సాహం. నెట్స్‌లో ఫుల్ స్వింగ్‌తో బంతులేస్తోన్న అఫ్రిది నేడు భారత్‌పై మరో బ్లాస్టర్ కోసం ఎదురుచూస్తున్నాడు. 2021 టీ20 ప్రపంచకప్ గ్రూప్ దశ మ్యాచ్‌లో భారత్‌పై షహీన్ షా అఫ్రిది సంచలన స్పెల్‌తో అదరగొట్టాడు. షహీన్ షా ఫోబియా భారత టాప్ ఆర్డర్లో ఇప్పటికీ ఉంది. పవర్‌ప్లేలో షహీన్ షా అఫ్రిది సంధించే 12 బంతుల స్పెల్ పాక్‌కు అత్యంత కీలకం కానుంది. మ్యాచ్ గమనాన్ని ఆ రెండు ఓవర్ల స్పెల్ నిర్దేశించే అవకాశాలు కొట్టిపారేయలేం. నషీం షా, హారీశ్ రవూఫ్‌లు షహీన్‌తో కలిసి పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్‌లు స్పిన్నర్లుగా తుది జట్టులో ఉండనున్నారు. బ్యాటింగ్ పరంగా, పాకిస్థాన్‌కు బలం టాప్ ఆర్డర్. మహ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజామ్‌లకు భారత్‌పై మంచి రికార్డుంది. ఫకర్ జమాన్ అందుబాటులో లేకపోవటం ఆ జట్టుకు గట్టి దెబ్బే. షాన్ మసూద్, ఇఫ్తీకార్ అహ్మద్, హైదర్ అలీలతో కూడిన మిడిల్ ఆర్డర్‌పై జట్టు మేనేజ్‌మెంట్‌కే పెద్దగా నమ్మకం లేదు. దీంతో టాప్ ఆర్డర్ పరుగులపైనే ఆ జట్టు అధికంగా ఆధారపడుతోంది.
ఇక వ్యూహాత్మకమే !
ఐసీసీ ఈవెంట్లలో భారత్, పాకిస్థాన్ ఏకపక్ష మ్యాచుల శకానికి తెరపడినట్టే!. పాకిస్థాన్ జట్టు బలంగా ప్రతిఘటించటంతో ఇటీవల ఆసియా కప్‌లో రెండు మ్యాచులు సైతం ఆఖరు ఓవర్ థ్రిల్లర్‌కు దారితీశాయి. నేడు, మెల్‌బోర్న్‌లోనూ సూపర్12 సమరం అదే తరహాలోనే సాగనుందని చెప్పవచ్చు. ఓ మ్యాచ్‌లో రవీంద్ర జడే జాను బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేసి పాక్‌కు భారత్‌కు మాస్టర్ స్ట్రోక్ ఇవ్వగా.. సూపర్4 మ్యాచ్‌లో మహ్మద్ నవాజ్‌ను అదే తరహాలో ముందు పంపంచి పాకిస్థాన్ రివర్స్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. ఇరు జట్ల మధ్య విజయావకాశాలు వ్యూహాత్మక ఎత్తుగడ లపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. నేటి మ్యాచ్‌లోనూ ఇరు జట్ల మేనేజ్మెంట్లు కొత్తగా ఆలోచనలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
పిచ్, వాతావరణం
మెల్బోర్న్లో నేడు వర్ష సూచనలు స్పష్టంగా ఉన్నాయి. మ్యాచ్‌కు ముందు రోజు ఉదయం నుంచి రాత్రి వరకు భిన్న వాతావరణ పరిస్థితులు కనిపించాయి. నేడు సైతం అదే తరహాలో ఉండే అవకాశం ఉంది. వరుణుడు అంతరాయం కలిగించినా, మ్యాచ్ తుడిచిపెట్టుకుపోయే ప్రమాదమైతే లేదు. కుదించిన ఓవర్ల మ్యాచ్ అయినా కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక మెల్బోర్న్లో టాస్కు పెద్ద ప్రాధాన్యత లేదు. తొలుత బ్యాటింగ్ చేసినా, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసినా విజయావకాశాలు 50-50 శాతంగానే ఉన్నాయి. బౌండరీ పరిధి ఎక్కువ ఉన్న వైపు బ్యాటర్లను ఆడించేందుకు బౌలర్లు హార్డ్ లెంగ్త్‌లతో ప్రయోగించనున్నారు. టాస్కు ప్రాధాన్యత లేకపోయినా.. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునేందుకు మొగ్గుచూపనుంది.
తుది జట్లు (అంచనా)
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, మహ్మద్ షమి, యుజ్వెంద్ర చాహల్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్.
పాకిస్థాన్ : మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), బాబర్ ఆజామ్ (కెప్టెన్), షాన్ మసూద్, హైదర్ అలీ, ఇఫ్తీకార్ అహ్మద్, అసిఫ్ అలీ, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, నషీం షా, షహీన్ షా అఫ్రిది, హరీశ్ రవూఫ్.