Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచ కప్ జట్టులో విరాట్ కోహ్లికి చోటు అవసరమా? విలక్షణ షాట్లతో బౌండరీల మోత మోగించే బ్యాటర్లు ఉండగా.. సంప్రదాయ షాట్లతో సంప్రదాయ ఇన్నింగ్స్ ఆడే కోహ్లి భారత టీ20 తుది జట్టులో నిలువగలడా? అసలు ఆధునిక టీ20 క్రికెట్‌కు విరాట్ కోహ్లి సరిపోతాడా? ఇలా.. అనేక ప్రశ్నలు. విశ్లేషకులు, మీడియా, ఓ వర్గం అభిమానులు.. ఇలా అందరూ విరాట్ కోహ్లి స్థానాన్ని ప్రశ్నించివారే. ఐసీసీ టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక అవగలడా? అని ప్రశ్నించిన వారు సైతం ఉన్నారు. అయితే, అటువంటి వారికే కాదు, తన సామర్థ్యంపై అనుమానాలు ఉన్నవారందరికీ విరాట్ కోహ్లి మెల్బోర్న్లో 90 వేల మంది అభిమానుల నడుమ, అత్యంత ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లో బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. అసలు టీ20 క్రికెట్‌కు సరిపోడని అనుకున్న విరాట్ కోహ్లి.. టీ20 ఫార్మాట్లో అత్యుత్తమ ఇన్నింగ్స్, అత్యుత్తమ షాట్లు ఆడేశాడు!. ' విరాట్ కోహ్లి ఆటను ఎన్నో ఏండ్లుగా చూస్తున్నాను. కానీ ఎన్నడూ అతడి కండ్లలో నీళ్లు చూడలేదు. కానీ ఇప్పుడు అది చూశాను' అని ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లే అన్నారు. ఈ మాటలు చాలు.. ఆదివారం మెల్బోర్న్లో విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ అతడికి ఎంత ప్రత్యేకమో!
విరాట్ కోహ్లి మెల్బోర్న్లో పాకిస్థాన్‌పై సైతం సంప్రదాయ శైలిలోనే ఇన్నింగ్స్ మొదలెట్టాడు. క్రీజులోకి వచ్చే సమయానికి బ్యాటర్లపై విపరీత ఒత్తిడి నెలకొంది. హరీశ్ రవూప్, నషీం షాలకు తోడు షహీన్ షా అఫ్రిది పేస్, స్వింగ్‌తో విజృంభిస్తున్నారు. రాహుల్‌తో పాటే రోహిత్ సైతం డగౌట్‌కు చేరుకున్నాడు. భీకర ఫామ్‌లో ఉన్న సూర్య సైతం కాడి వదిలేశాడు. ఈ పరిస్థితుల్లో విరాట్ కోహ్లి ఒక్కడే భారత జట్టు భారం, బాధ్యత తీసుకున్నాడు. పది ఓవర్ల అనంతరం భారత్ 45/4తో ఉండగా.. విరాట్ కోహ్లి 21 బంతుల్లో 12 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అక్కడ్నుంచి నెమ్మదిగా ఒక్కో పరుగూ, ఒక్కో ఓవర్ నుంచి వేగం పెంచుతూ వెళ్లిన విరాట్ కోహ్లి కెరీర్ అత్యుత్తమ ఇన్నింగ్స్ నమోదు చేశాడు. నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 43 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లి.. ఆ తర్వాత అసలు ఆట ఆడాడు. మరో ఎండ్‌లో విధ్వంసకారుడు, బిగ్ హిట్టర్ హార్దిక్ పాండ్య తడబడుతుండగా.. విరాట్ కోహ్లి మాత్రం పాక్ ప్రధాన పేసర్లపై పంజా విసిరాడు. వరుసగా షహీన్ షా, హరీశ్ రవూఫ్‌లను చితక్కొట్టాడు. షహీన్ ఓవర్లో ఫోర్లతో మ్యాజిక్ చేసిన కోహ్లి.. రవూఫ్‌పై మ్యాజికల్ సిక్సర్లతో అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు!. అర్థ సెంచరీ అనంతరం పది బంతుల్లోనే 32 పరుగులు పిండుకున్న విరాట్ కోహ్లి.. అసాధ్యంగా కనిపించిన విజయాన్ని సుసాధ్యం చేశాడు. మెల్బోర్న్ ఇన్నింగ్స్‌తో ప్రపంచ క్రికెట్ ప్రియులను మంత్రముగ్ధులను చేసిన కోహ్లి.. ఎట్టకేలకు కింగ్ ఈజ్ బ్యాక్ అనిపించాడు.