Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛేదనలో కోహ్లి అసమాన ప్రదర్శన
- పాక్‌పై భారత్ ఉద్విగ విజయం
- 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్
లక్ష్యం 160 పరుగులు. పవర్‌ప్లేలో ముగిసేలోపే 31/4. పదునైన పాకిస్థాన్ పేస్ బౌలింగ్‌పై ఇక ఛేదన అసాధ్యమే అనిపించింది. కానీ ఓ భాగస్వామ్యం భారత్‌ను రేసులో నిలిపింది. చివర్లో 8 బంతుల్లో 28 పరుగులు చేయాల్సి వచ్చింది. మళ్లీ మ్యాచ్ చేజారిందనే అనిపించింది. కానీ, ఓ అసాధ్యుడు ఈ లక్ష్యాన్ని పూరించాడు. ఛేదనలో 53 బంతుల్లో అజేయంగా 82 పరుగులు పిండుకున్నాడు. ఓ ఎండ్‌లో అసమాన షాట్లతో విరుచుకుపడ్డాడు. షహీన్ షా, రవూఫ్, నవాజ్‌లపై వీర విహారం చేశాడు. పాకిస్థాన్‌పై 4 వికెట్ల తేడాతో తరాల పాటు గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు. అతడే సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి. పొరుగు దేశం పాకిస్థాన్‌పై విజయంతో టైటిల్ రేసును మొదలెట్టిన టీమ్ ఇండియా.. ఐసీసీ టీ20 ప్రపంచకప్ సూపర్12లో బోణీ కొట్టింది.
నవతెలంగాణ-మెల్బోర్న్
మెల్బోర్న్లో విరాట పర్వం. ఛేదనలో మొనగాడు 90 వేల మంది అభిమానుల నడుమ ప్రపంచ క్రికెట్ కండ్లుచెదిరే ఇన్నింగ్స్‌తో విశ్వరూపం చూపించాడు. విరాట్ కోహ్లి (82 నాటౌట్, 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో కదం తొక్కటంతో టీ20 ప్రపంచకప్ సూపర్12 గ్రూప్-2లో పాకిస్థాన్‌పై భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హార్దిక్ పాండ్య (40, 37 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) సమయోచిత ఇన్నింగ్స్‌తో రాణించాడు. కెఎల్ రాహుల్ (4), రోహిత్ శర్మ (4), సూర్యకుమార్ యాదవ్ (15) నిరాశపరిచారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. మసూద్ షా (52 నాటౌట్, 42 బంతుల్లో 5 ఫోర్లు), ఇఫ్తీకార్ అహ్మద్ (51, 34 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో పాకిస్థాన్‌కు మెరుగైన స్కోరు అందించారు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ (3/32), హార్దిక్ పాండ్య (3/30) మూడేసి వికెట్లు పడగొట్టారు. ఛేదనలో అసమాన ఇన్నింగ్స్‌తో చెలరేగిన విరాట్ కోహ్లి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.
ఆరంభం అందోళన : 160 పరుగుల లక్ష్యం. టాప్ ఆర్డర్‌పైనే భారీగా ఆశలు. కెఎల్ రాహుల్ (4), రోహిత్ శర్మ (4), సూర్యకుమార్ యాదవ్ (15) ఆరంభంలోనే వికెట్ చేజార్చుకున్నారు. 31 పరుగులకే టాప్ ఆర్డర్లో నాలుగు వికెట్లు పతనం. పాక్ పేసర్లు నషీం షా, హరీశ్ రవూఫ్‌లు భారత్‌ను పీకల్లోతు ఒత్తిడిలోకి నెట్టారు. పాక్ బౌలింగ్ బలం దృష్ట్యా.. ఈ దశలో పాకిస్థాన్ మ్యాచ్‌ను గుప్పిట్లో నిలుపుకుంది.
మిడిల్లో ఆశలు : కఠిన పరిస్థితుల్లో విరాట్ కోహ్లి (82), హార్దిక్ పాండ్య (40)లు ఐదో వికెట్‌కు 113 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. పది ఓవర్ల వరకు నిదానంగా ఆడిన ఈ జోడీ.. ఆ తర్వాత ఇన్నింగ్స్‌లో వేగం పెంచింది. స్పిన్నర్ మహ్మద్ నవాజ్ ఓవర్లో హార్దిక్ రెండు సిక్సర్లు, కోహ్లి ఓ సిక్సర్ బాదటంతో ఇన్నింగ్స్‌కు వేగం తోడైంది. 17 ఓవర్లలో భారత్ 112/4తో ఆశల పల్లకిలో నిలిచింది.
డెత్‌లో.. సంచలనం : నరాలు తెగె ఉత్కంఠ అనే మాటకు సంపూర్ణ అర్థం ఇచ్చిన ఓవర్లు ఇవి. చివరి 18 బంతుల్లో 48 పరుగులు చేయాల్సిన దశలో విరాట్ కోహ్లి అసమాన పోరాటం ఇక్కడ ఆవిష్కితమైంది. పాక్ ప్రధాన పేసర్ షహీన్ షా అఫ్రిది వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో మూడు ఫోర్లు సహా 17 పరుగులు పిండుకున్న విరాట్ కోహ్లి.. మ్యాచ్‌ను భారత్‌వైపు టర్న్ చేశాడు. దీంతో సమీకరణం 12 బంతుల్లో 31 పరుగులకు వచ్చింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో తొలి నాలుగు బంతుల్లో బౌండరీ రాలేదు. హార్దిక్ పాండ్య బౌండరీ బాదుడులో లెక్క తప్పాడు. దీంతో ఒత్తిడి భారత్‌పై పడింది. కానీ రెండు బంతులను కండ్లుచెదిరే రీతిలో సిక్సర్లుగా మలిచిన విరాట్ కోహ్లి.. మ్యాచ్‌ను మళ్లీ భారత్‌వైపు తీసుకొచ్చాడు. రవూఫ్‌పై లాంగ్‌ఆన్‌లో, ఫైన్‌లెగ్‌లో క్లాసిక్ సిక్సర్లు సంధించాడు. ఈ రెండు సిక్సర్లతో మెల్బోర్న్ స్టేడియం దద్దరిల్లింది. 8 బంతుల్లో 28 పరుగుల నుంచి 6 బంతుల్లో 16 పరుగులకు సమీకరణం దిగొచ్చింది. ఇక చివర్లో చిన్న పాటి డ్రామానే నడిచింది. తొలి బంతికి పాండ్య వికెట్ కోల్పోగా..రెండో బంతికి కార్తీక్ సింగిల్ తీశాడు. మూడో బంతికి కోహ్లి పరుగులు తీశాడు. దీంతో 3 బంతుల్లో 13 పరుగులు అవసరం అయ్యాయి. ఫుల్‌టాస్‌గా పడిన నాల్గో బంతిని కోహ్లి సిక్సర్‌గా మలచగా.. ఆ బంతిని అంపైర్ నో బాల్‌గా ప్రకటించాడు. దీంతో భారత్ 7 పరుగులు సాధించింది. ఆ తర్వాతి బంతి వైడ్ కావటంతో భారత్ పని మరింత సులువైంది. ఫ్రీ హిట్ బాల్‌కు కోహ్లి బౌల్డ్ కాగా.. రూల్స్ దృష్టిలో ఉంచుకుని కోహ్లి వికెట్ల నడుమ మూడు పరుగులు సాధించాడు. పాక్ కెప్టెన్ అభ్యంతరం తెలిపినా, ప్రయోజనం లేకపోయింది. ఇక ఇన్నింగ్స్ ఐదో బంతికి దినేశ్ కార్తీక్ అవుట్ కాగా.. మళ్లీ ఉత్కంఠకు తెరలేచింది. తర్వాతి బ్యాటర్ అశ్విన్ వస్తూనే వైడ్ బాల్‌ను వదిలేయటంతో స్కోర్లు సమమయ్యాయి. చివరి బంతిని స్కూప్ షాట్‌తో మిడ్ ఆఫ్‌లో ఆడిన అశ్విన్.. భారత్‌కు అత్యంత ఉద్విగ విజయాన్ని పూర్తి చేశాడు.
స్కోరు వివరాలు :
పాకిస్థాన్ ఇన్నింగ్స్ : మహ్మద్ రిజ్వాన్ (సి) భువనేశ్వర్ కుమార్ (బి) అర్షదీప్ సింగ్ 4, బాబర్ ఆజామ్ (ఎల్బీ) అర్షదీప్ సింగ్ 0, మసూద్ షా నాటౌట్ 52, ఇఫ్తీకార్ అహ్మద్ (బి) మహ్మద్ షమి 51, షాదాబ్ ఖాన్ (సి) సూర్యకుమార్ యాదవ్ (బి) హార్దిక్ పాండ్య 5, హైదర్ అలీ (సి) సూర్యకుమార్ యాదవ్ (బి) హార్దిక్ పాండ్య 2, మహ్మద్ నవాజ్ (సి) దినేశ్ కార్తీక్ (బి) హార్దిక్ పాండ్య 9, అసిఫ్ అలీ (సి) దినేశ్ కార్తీక్ (బి) అర్షదీప్ సింగ్ 2, షహీన్ షా అఫ్రిది (సి,బి) భువనేశ్వర్ కుమార్ 16, హరీశ్ రవూఫ్ నాటౌట్ 6, ఎక్స్‌ట్రాలు : 12, మొత్తం : (20 ఓవర్లలో 8 వికెట్లకు) 159.
వికెట్ల పతనం : 1-1, 2-15, 3-91, 4-96, 5-98, 6-115, 7-120, 8-151.
బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ 4-0-22-1, అర్షదీప్ సింగ్ 4-0-32-3, మహ్మద్ షమి 4-0-25-1, హార్దిక్ పాండ్య 4-0-30-3, రవిచంద్రన్ అశ్విన్ 3-0-23-0, అక్షర్ పటేల్ 1-0-21-0.
భారత్ ఇన్నింగ్స్ : కెఎల్ రాహుల్ (బి) నషీం షా 4, రోహిత్ శర్మ (సి) ఇఫ్తీకార్ అహ్మద్ (బి) హరీశ్ రవూఫ్ 4, విరాట్ కోహ్లి నాటౌట్ 82, సూర్యకుమార్ యాదవ్ (సి) మహ్మద్ రిజ్వాన్ (బి) హరీశ్ రవూఫ్ 15, అక్షర్ పటేల్ రనౌట్ 2, హార్దిక్ పాండ్య (సి) బాబర్ ఆజామ్ (బి) మహ్మద్ నవాజ్ 40, దినేశ్ కార్తీక్ (స్టంప్డ్) మహ్మద్ రిజ్వాన్ 1, రవిచంద్రన్ అశ్విన్ నాటౌట్ 1, మొత్తం : (20 ఓవర్లలో 6 వికెట్లకు) 160.
వికెట్ల పతనం : 1-7, 2-10, 3-26, 4-31, 5-144, 6-158.
బౌలింగ్ : షహీన్ షా అఫ్రిది 4-0-34-0, నషీం షా 4-0-23-1, హరీశ్ రవూఫ్ 4-0-36-2, షాదాబ్ ఖాన్ 4-0-21-0, మహ్మద్ నవాజ్ 4-0-42-2.
నమ్మశక్యం కాని వాతావరణమిది. నిజాయితీగా చెబుతున్నా.. నా దగ్గర మాటల్లేవు. ఇది ఎలా జరిగిందో ఇంకా తెలియటం లేదు. మనం ఆఖరు వరకు క్రీజులో నిలుస్తామని హార్దిక్ చెబుతూనే ఉన్నాడు. షహీన్ పెవిలియన్ ఎండ్ నుంచి బౌలింగ్ చేసినప్పుడు.. అతడిపై దాడి చేయమని హార్దిక్ చెప్పాడు. నవాజ్‌కు ఓ ఓవర్ మిగిలి ఉండటంతో రవూఫ్‌పై ఎదురుదాడితో అతడిపై ఒత్తిడి పెంచాం. ఆ రెండు సిక్సర్లు అలా కొట్టేశాను. లాంగ్‌ఆన్‌లో సిక్సర్ నేనూ ఊహించలేదు. ఇప్పటివరకు మొహాలిలో 52 బంతుల్లో 82 పరుగులే నా ఉత్తమ ప్రదర్శన అని చెప్పేవాడిని. ఇప్పుడు 53 బంతుల్లో 82 పరుగులు. ఈ రెండు ఇన్నింగ్స్‌లు ప్రత్యేకమే. నేను ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న సమయంలో మీరందరూ (అభిమానులు) దన్నుగా నిలిచారు. అందరికీ ధన్యవాదాలు'
- విరాట్ కోహ్లి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్