Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెదర్లాండ్స్‌తో రోహిత్‌సేన ఢ నేడు
- డచ్ జట్టు ముంగిట అతిపెద్ద సవాల్
నవతెలంగాణ-సిడ్నీ
విరాట్..విరాట్..విరాట్! :
పొరుగు దేశం పాకిస్థాన్‌తో హై ఓల్టేజ్ మ్యాచ్‌లో విజయం అనంతరం టీమ్ ఇండియా ఆత్మవిశ్వాసం ఆకాశానికి చేరుకుంది. ఇప్పుడు సూపర్12 గ్రూప్ దశలో రెండో మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. టీమ్ ఇండియా స్పష్టమైన ఫేవరేట్‌గా సిడ్నీలో బరిలోకి దిగుతున్నా.. ప్రపంచకప్ ప్రత్యర్థిని అంత తేలిగ్గా తీసుకునేందుకు రోహిత్ శర్మ బృందం ఏమాత్రం సుమఖంగా లేదు. ఇక, నెదర్లాండ్ జీవితకాల అతిపెద్ద సవాల్‌కు సిద్ధమవుతోంది. భారత్‌కు పోటీ ఇవ్వాలనే తపనతో ఉన్న నెదర్లాండ్స్‌తో ఆ దిశగా నిలబడగలదా? నేడు సిడ్నీలో భారత్‌కు ఎదురుంటుందా?!
ఐసీసీ టీ20 ప్రపంచకప్ కోసం భారత్ ఆస్ట్రేలియాకు వచ్చినప్పుడు విరాట్ కోహ్లిపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. సహజశైలిలో కొన్ని కీలక ఇన్నింగ్స్‌లు ఆడతాడని అంచనా వేశారు. కానీ పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఆశలు స్థితి నుంచి అసమాన ప్రదర్శనతో విరాట్ కోహ్లి చెలరేగాడు. ఆసియా కప్‌లో అఫ్గనిస్థాన్‌పై శతకంతో విరాట్ కోహ్లి శతక దాహం తీర్చుకున్నప్పటికీ.. వరల్డ్‌కప్‌లో పాక్‌పై అసలు సిసలైన కమ్‌బ్యాక్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఫోకస్ పూర్తిగా విరాట్ కోహ్లిపైనే పడింది. సంప్రదాయ బ్యాటర్ నుంచి విధ్వంసకుడిగా విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ రూపాంతరం చెందిన తీరు అమోఘం. ఇక సిడ్నీలో విరాట్ కోహ్లికి తిరుగులేని రికార్డుంది. పొట్టి ఫార్మాట్లో కోహ్లి ఇక్కడ దండిగా పరుగులు సాధించాడు. నేడు పసికూన నెదర్లాండ్స్‌పై విరాట్ కోహ్లి మరో మ్యాజికల్ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు.
ఇక బ్యాటింగ్ విభాగం పరంగా.. కెప్టెన్ రోహిత్ శర్మ ప్రదర్శన ఆందోళనకరం. నాయకుడిగా రోహిత్ శర్మ ప్రశంసలు అందుకున్నప్పటికీ.. బ్యాటర్‌గా పూర్తిగా విఫలమవుతున్నాడు. గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో పేలవంగా ఆడాడు. టాప్ ఆర్డర్లో రోహిత్ శర్మ ఫామ్ భారత్‌కు కీలకం. దక్షిణాఫ్రికాతో కీలక మ్యాచ్‌కు ముందైనా.. రోహిత్ బ్యాట్‌తో జోరందుకోవాల్సిన అవసరం ఉంది. కెఎల్ రాహల్, సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌లో ఉన్నారు. నేడు నెదర్లాండ్స్‌పై ఈ ఇద్దరు ధనాధన్ ఇన్నింగ్స్‌లు నమోదు చేసేందుకు ఎదురుచూస్తున్నారు. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు అవకాశం కల్పించే సూచనలు ఉన్నాయి. దినేశ్ కార్తీక్ సైతం పాక్‌తో మ్యాచ్‌లో రెండు బంతులే ఆడాడు. అతడిని కొనసాగిస్తారా? లేదా పంత్‌కు అవకాశం ఇస్తారా అనేది చూడాలి. బౌలింగ్ విభాగంలో చాహల్‌ను తుది జట్టులో చేర్చటం హాట్ టాపిక్‌గా మారింది. అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌లు జట్టులో సమతుల్యత కోసం చోటు నిలుపుకునే అవకాశం ఉంది. మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్‌లు పేస్ విభాగం బాధ్యతలు పంచుకోనున్నారు.
డచ్ పోరాట ఆరాటం!
టీ20 ప్రపంచకప్ అర్హత టోర్నీ, పొట్టి ప్రపంచకప్ తొలి రౌండ్లో మెరుగైన ప్రదర్శన చేసిన నెదర్లాండ్స్.. సూపర్12 దశకు చేరుకుంది. గ్రూప్-2లో భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా వంటి పెద్ద జట్లతో పోటీ పడే అవకాశం నెదర్లాండ్స్ దక్కించుకుంది. ప్రపంచ అత్యుత్తమ జట్టు భారత్‌తో తలపడేందుకు డచ్ జట్టు ఆసక్తిగా ఉంది. ప్రపంచ క్రికెట్ స్టార్స్‌తో కలిసి ఆడేందుకు ఆ జట్టు ఎంతగానో ఎదురుచూస్తోంది. అయితే, గతంలో ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ వంటి జట్టుకు షాక్ ఇచ్చిన నెదర్లాండ్స్‌ను తేలిగ్గా తీసుకునేందుకు భారత్ ఎంతమాత్రం సిద్దంగా లేదు. ప్రపంచకప్ ప్రత్యర్థిగా నెదర్లాండ్స్‌కు గౌరవం ఇస్తూనే.. భారీ విజయంపై కన్నేయనుంది. ఇక నెదర్లాండ్స్ మాత్రం ఆటను ఆస్వాదిస్తూ.. సాధ్యమైనంత మేరకు పోటీ ఇవ్వాలని భావిస్తోంది. డచ్ జట్టు బ్యాటింగ్ భారం అంతా మాక్స్ ఓబెడ్ మోస్తున్నాడు. అతడికి కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ సహా బాస్ డీలెడె, విక్రమజిత్ సింగ్, ఏకర్మ్యాన్, టాప్ కూపర్ల నుంచి సహకారం లభిస్తే మంచి స్కోరు సాధించేందుకు మెరుగైన అవకాశాలు ఉంటాయి. బౌలింగ్ విభాగంలో పాల్ వాన్ మీకరెన్ ప్రత్యేక ప్రదర్శన కోసం చూస్తున్నాడు. క్లాసెన్, ఫ్రింగ్లె సైతం కీలకం కానున్నారు. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విజయానికి కొద్ది దూరంలో నిలిచిన నెదర్లాండ్స్ నేడు అదే స్ఫూర్తితో భారత్‌తో మ్యాచ్‌కు బరిలోకి దిగనుంది.
పిచ్, వాతావరణం : వరల్డ్‌కప్ సూపర్12 ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఇక్కడ 200 పరుగులు చేసింది. సిడ్నీలో సహజంగానే పరుగుల వరద పారుతుంది. నేడు భారత్, నెదర్లాండ్స్ మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లు నమోదు కానున్నాయి. సిడ్నీలో గురువారం వర్ష సూచనలు ఉన్నాయి. మ్యాచ్‌కు ముందు రోజు వాతావరణం బాగానే ఉంది. నేడు చిరుజల్లులతో కూడిన ఆటంకం కలిగినా.. మ్యాచ్‌కు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా)
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, మహ్మద్ షమి, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్.
నెదర్లాండ్స్ : మాక్స్ ఓబెడ్, విక్రమజిత్ సింగ్, బాస్ డె లీడా, కొలిన్ ఏకర్మ్యాన్, టామ్ కూపర్, స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్, వికెట్ కీపర్), టిమ్ ప్రింగ్లె, టిమ్ వాన్‌డర్ గగ్‌టెన్, ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మీకరెన్, షరిజ్ అహ్మద్.