Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీసీఐ విప్లవాత్మక నిర్ణయం
ముంబయి : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. మహిళల క్రికెట్ అభివృద్దిలో భాగంగా ఇటీవల మహిళల ఐపీఎల్‌ను ప్రకటించిన బీసీసీఐ.. తాజాగా మెన్స్ క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులు చెల్లించేందుకు నిశ్చయించింది. గురువారం సమావేశమైన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నిర్ణయం ప్రకారం మహిళా క్రికెటర్లు సైతం టెస్టు మ్యాచ్‌కు రూ.15 లక్షలు, వన్డే మ్యాచ్‌కు రూ.6 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ.3 లక్షల మ్యాచ్ ఫీజు అందుకోనున్నారు. ప్రస్తుతం భారత మహిళా క్రికెటర్లు వన్డే, టీ20 మ్యాచ్ ఫీజు రూపంలో రూ. లక్ష అందుకుంటున్నారు. టెస్టు మ్యాచ్‌కు రూ.2.5 లక్షలు దక్కించుకుంటున్నారు. ఇక నుంచి బీసీసీఐ మెన్స్ క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులు చెల్లించనుంది. ఈ నిర్ణయంతో భారత క్రికెట్లో లింగ వివక్షను రూపుమాపేందుకు తొలి అడుగు వేసినట్టు అయ్యింది. బీసీసీఐ నిర్ణయాన్ని భారత దిగ్గజ క్రికెటర్ మథాలీరాజ్ ప్రశంసించారు. మహిళల ఐపీఎల్, ఇప్పుడు మెన్స్ క్రికెటర్లతో సమానంగా మ్యాచ్ ఫీజులు చారిత్రక నిర్ణయంగా మిథాలీ ట్వీట్ చేసింది. మెన్స్ క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు మ్యాచ్ ఫీజులు చెల్లించేందుకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తొలుత చారిత్రక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా బీసీసీఐ సైతం అదే బాటలో నడువటంతో ప్రపంచ క్రికెట్ బోర్డులు సైతం ఈ ఫార్ములా పాటించేందుకు అవకాశం ఏర్పడింది.