Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐసీసీ టీ20 ప్రపంచకప్ సూపర్ 12 గ్రూప్-1 సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. టైటిల్ ఫేవరేట్, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా తొలి మ్యాచ్‌లోనే దారుణ పరాజయం మూటగట్టుకుంది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆస్ట్రేలియాను ఆసీస్ గడ్డపై ఓడించిన న్యూజిలాండ్ గట్టి బోణీ కొట్టింది. అఫ్గనిస్థాన్‌తో మ్యాచ్ వర్షం కారణంగా చోటుచేసుకోలేదు. దీంతో ఆఫ్గాన్‌తో న్యూజిలాండ్ పాయింట్లను పంచుకుంది. ప్రస్తుతం 2 మ్యాచుల్లో 3 పాయింట్లతో న్యూజిలాండ్ గ్రూప్-1 అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఐర్లాండ్‌తో మ్యాచ్‌ను డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో అనూహ్యంగా చేజార్చుకున్న ఇంగ్లాండ్.. తాజాగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో పాయింట్లను పంచుకుంది. తొలి మ్యాచ్‌లో అఫ్గనిస్థాన్‌పై భారీ విజయంతో ఇంగ్లాండ్ ఖాతాలో 3 పాయింట్లు చేరాయి. మూడు మ్యాచుల్లో మూడు పాయింట్లతో గ్రూప్-1లో ఇంగ్లాండ్ రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్‌పై విజయం, అఫ్గనిస్థాన్‌తో మ్యాచ్ వర్షార్పణంతో ఐర్లాండ్ ఖాతాలో సైతం మూడు పాయింట్లు ఉన్నాయి. గ్రూప్-1లో ఐర్లాండ్ మూడో స్థానంలో నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా సైతం మూడు మ్యాచుల్లో మూడు పాయింట్లతో నాల్గో స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంకపై గెలుపొందిన ఆస్ట్రేలియా.. ఇంగ్లాండ్‌తో మ్యాచ్ పాయింట్లను పంచుకుంది. న్యూజిలాండ్ సెమీఫైనల్స్‌కు చేరుకునే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. గ్రూప్-1లో రెండో బెర్త్ కోసం ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య గట్టి పోటీ ఉంది. ఇంగ్లాండ్ చివరి రెండు మ్యాచుల్లో న్యూజిలాండ్, శ్రీలంకలతో తలపడనుంది. చివరి రెండు మ్యాచుల్లో ఐర్లాండ్, అఫ్గనిస్థాన్లతో ఆస్ట్రేలియా ఆడనుంది. ఇంగ్లాండ్,ఆస్ట్రేలియాలు చివరి రెండు మ్యాచుల్లో విజయాలు సాధించినా.. ఏడు పాయింట్లే దక్కించుకుంటారు. నెట్ రనరేట్లో ఇంగ్లాండ్ మెరుగ్గా ఉంది. ఆస్ట్రేలియాకు విజయంతో నెట్ రన్‌రేట్‌ను భారీగా పెంచుకోవటం సైతం కీలకం కానుంది.