Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మ్యాచ్ రద్దు
- అఫ్గనిస్థాన్, ఐర్లాండ్ పోరు సైతం..
- సంక్షిష్టంగా గ్రూప్-1 సమీకరణాలు
ఐసీసీ టీ20 ప్రపంచకప్ పోరు. సూపర్12లో గ్రూప్ దశ నుంచి సెమీఫైనల్స్‌కు చేరుకోవం అంత సులువు కాదు. గ్రూప్ దశ నుంచే నిష్క్రమించకుండా ఉండేందుకు ప్రతి మ్యాచ్‌లో పాయింట్లు అత్యంత విలువైనవే. అందుకే, ప్రపంచకప్‌లో ప్రతి సమరం రసవత్తరమే. సెమీఫైనల్స్ రేసులో నిలిచిన జట్ల భవితవ్యం మ్యాచ్ ఫలితాలు నిర్దేశించాలి కానీ, వరుసగా వర్షం కారణంగా రద్దుగా ముగుస్తున్న మ్యాచ్‌లు ఎంత మాత్రం కాదు. 2022 ప్రపంచకప్‌లో వర్షం ప్రభావిత మ్యాచ్‌ల సంఖ్య రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. తాజాగా, శుక్రవారం మెల్బోర్న్లో రెండు మ్యాచులు వర్షార్పణం అయ్యాయి.
నవతెలంగాణ-మెల్బోర్న్
పొట్టి ప్రపంచకప్‌తో వరుణుడు ఓ ఆట ఆడుకుంటున్నాడు!. సూపర్ 12 గ్రూప్-2లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే మ్యాచ్‌ను తుడిచిపెట్టేసిన వరుణుడు.. తాజగా గ్రూప్-1పై విరుచుకుపడ్డాడు. ఒకే రోజు రెండు కీలక మ్యాచులను తుడిచిపెట్టేశాడు. చిరకాల ప్రత్యర్థులు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మ్యాచ్‌తో పాటు.. అఫ్గనిస్థాన్, ఐర్లాండ్ మ్యాచ్ సైతం వర్షం కారణంగా రద్దుగా ముగిశాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లు చెరో పాయింటు ఖాతాలో వేసుకోగా.. అఫ్గనిస్థాన్, ఐర్లాండ్‌లు సైతం పాయింట్లను సమంగా పంచుకున్నాయి.
నిరాశపర్చినా.. సరైన నిర్ణయమే! : వర్షం కారణంగా మ్యాచ్‌ను రద్దు చేయడాన్ని ఇంగ్లాండ్ కెప్టెన్ జోశ్ బట్లర్ సమర్థించాడు. ఇప్పటికే ఐర్లాండ్‌తో మ్యాచ్ మధ్యలో వర్షం ఆటంకం కలిగించింది. ఆ తర్వాత మ్యాచ్ సాగని పరిస్థితుల్లో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఫలితాన్ని తేల్చగా.. ఇంగ్లాండ్‌కు అనూహ్య పరాజయం తప్పలేదు. తాజాగా ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్‌కు సైతం వరుణుడు ఆటంకం కలిగించాడు. దీంతో ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ నుంచి ఒక్క పాయింట్‌తోనే సరిపెట్టుకుంది. 'మెల్బోర్న్ అవుట్ ఫీల్డ్‌పై అంపైర్లు అభ్యంతరాలు ఉన్నాయి. అవుట్‌ఫీల్డ్ చాలా తడిగా ఉంది. 30 గజాల సర్కిల్ లోపల సైతం కొన్ని చోట్ల ప్రమాదకరంగా ఉంది. అందరం క్రికెట్ ఆడాలనే అనుకున్నాం. కానీ ఆడేందుకు పిచ్ పరిస్థితులు అంత సురక్షితంగా లేవు. బౌలింగ్ చేసిన ప్రతి బౌలర్ ఆ పరిస్థితులపై ఫిర్యాదు చేసేవాడు. ఆటగాళ్ల భద్రత అత్యంత ప్రధానం. బౌలర్ల కోణంలో చూస్తే.. అది ఇంగ్లాండ్ బౌలర్లయినా, ఆస్ట్రేలియా బౌలర్లయినా.. పరిస్థితులు అనుకూలంగా లేవు. పరిస్థితులకు అనుగుణంగా అంపైర్లు సరైన నిర్ణయమే తీసుకున్నారు' అని ఇంగ్లాండ్ కెప్టెన్ జోశ్ బట్లర్ వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది ఈ సమయంలో ఆస్ట్రేలియాలో వాతావరణం ఎలా ఉంటుందో చెప్పడానికి నేను వాతావరణ నిపుణుడిని కాదు. అందరం పూర్తి మ్యాచులు ఆడాలనే అనుకుంటున్నాం. మనం ఆడే ఆట ఓపెన్ ఎయిర్‌లో, సహజంగానే ఇతర అంశాలు ప్రభావం చూపిస్తాయి. కానీ ఇప్పుడు దురదృష్టశావత్తు మాకు ఇంకో రెండు మ్యాచులే మిగిలి ఉన్నాయి. ఆ రెండు మ్యాచుల్లోనైనా వర్షం ప్రభావం ఉండకూడదని అనుకుంటాం. కానీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా.. ఇది ఉండనే ఉంటుంది. ఈ రోజు కచ్చితంగా ఆడాలని ఎవరి నుంచి ఒత్తిడి లేదు. కామన్సెన్స్ పైచేయి సాధించింది. మ్యాచ్ రద్దు కావటం నిరాశ కలిగించింది. కానీ పరిస్థితులు తగినట్టుగా లేవు. ఇది సరైన నిర్ణయమేనని బట్లర్ తెలిపాడు.
'మెల్బోర్న్ స్టేడియంలో నేను చూసినంత వరకు.. ఇదే అత్యంత తడిగా కనిపించటం. బౌలర్లు రనప్ ఏరియాలు అసలు బాగోలేవు. ఇక 30 గజాల సర్కిల్ లోపల సైతం చాలా తడిగా ఉంది. ఇది పూర్తిగా ఆటగాళ్ల క్షేమానికి సంబంధించిన అంశం. మరో మ్యాచ్‌లో ఓ జింబాబ్వే ఆటగాడు తడి పిచ్‌పై ప్రమాదకరంగా పడటం చూశాం. మ్యాచ్‌లో అదే ప్రధాన సమస్య అవుతుంది. అందరికీ మ్యాచ్‌లో ఆడాలనే ఉత్సుకత గొప్పగా ఉంది. కానీ పిచ్ పరిస్థితులు అందరికీ నిరాశకు గురిచేశాయి' అని ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ అన్నాడు. పలుమార్లు పిచ్‌ను పర్యవేక్షించి పరిశీలించిన మ్యాచ్ అంపైర్లు.. మ్యాచ్‌కు తగిన పరిస్థితులు లేవని రద్దు చేశారు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాకు చెరో పాయింట్ కేటాయించారు. అంతకముందు, ఇదే మైదానంలో జరగాల్సిన అఫ్గనిస్థాన్, ఐర్లాండ్ మ్యాచ్ సైతం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షంతో రద్దుగా ముగిసింది. ఒక్క బంతి, కనీసం టాస్ కూడా వేయకుండానే శుక్రవారం రెండు మ్యాచులు రద్దుగా ముగిశాయి.