Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్విట్టర్లో వినతికి స్పందించిన మంత్రి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర యువ క్రీడాకారిణి, అంతర్జాతీయ ఫెన్సర్ కుమారి నజియాకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల రామారావు ఆర్థిక సహాయం అందించింది. నల్గొండ జిల్లా, చండూరు మండలానికి చెందిన 17 ఏండ్ల నజియా అంతర్జాతీయ స్థాయిలో పలు టోర్నీల్లో బహుమతులు సాధించింది. ఇటీవల లండన్‌లో ఆగస్టు 9-20 వరకు జరిగిన కామన్వెల్త్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో సైతం వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకం, జట్టు విభాగంలో కాంస్య పతకం సాధించింది నజియా. హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో ఇంటర్ పూర్తి చేసిన నజియా.. ఆర్థిక సహాయం కోసం ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తి చేసింది. స్పందించిన కేటీఆర్.. నజియాకు ఆర్థిక సహకారం అందించాలని శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డిని ఆదేశించారు. మునుగోడు నియోజకవర్గంలోని బంగారి గడ్డ గ్రామంలోని నజియా ఇంటికెళ్లిన అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర ఫెన్సింగ్ సంఘం అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి ఆమెకు స్పోర్ట్స్ కిట్‌తో పాటు రూ.50 వేల చెక్‌ను అందజేశారు. ఆర్టీసీలో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తూ ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడిని ఫెన్సింగ్ క్రీడలో ప్రోత్సహిస్తున్న నజియా తండ్రిని ఈ సందర్భంగా అల్లీపురం అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున భవిష్యత్‌లోనూ నజియాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.