Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఓ వారం ముగిసింది. గ్రూప్-1లో సెమీస్ రేసు రక్తి కట్టగా.. గ్రూప్-2లో అగ్రస్థానం కోసం భారత్, దక్షిణాఫ్రికాలు నేడు ముఖాముఖి సమరానికి సై అంటున్నాయి. పేస్ స్వర్గధామం పెర్త్‌లో టీమ్ ఇండియా బ్యాటర్లు సఫారీ పేస్ పరీక్షకు సిద్ధమవుతున్నారు. పేసర్లకు కలిసొచ్చే వేదికపై భారత్‌పై పైచేయి సాధించాలనే తపనతో దక్షిణాఫ్రికా కనిపిస్తోంది. గ్రూప్-2లో ఆరు జట్లు ఆదివారం బరిలో నిలువటంతో.. ఇక్కడ సెమీఫైనల్స్ రేసు నేడే ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. సూపర్12 గ్రూప్-2లో భారత్, దక్షిణాఫ్రికా పోరు నేడు.
- భారత్, దక్షిణాఫ్రికా సమరం నేడు
- గ్రూప్‌లో అగ్రస్థానం కోసం అమీతుమీ
- సాయంత్రం 4.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-పెర్త్
ప్రపంచకప్‌లో మరో కీలక సమరానికి రంగం సిద్ధం. గ్రూప్-2లో అగ్రస్థానం కోసం భారత్, దక్షిణాఫ్రికాలు అమీతుమీ తేల్చుకునేందుకు రెఢ అయ్యాయి. వరుస విజయాలతో టీమ్ ఇండియా నేడు మ్యాచ్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. అయినా, సఫారీలు ఫేవరేట్ ట్యాగ్‌కు ఏమాత్రం తక్కువ కాదు. ఈ నెల ఆరంభంలో దాదాపుగా ఇదే జట్టుతో భారత్ చేతిలో చిత్తుగా ఓడిన దక్షిణాఫ్రికా.. ఇప్పుడు గ్రూప్ దశలో విజయంతో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. దక్షిణాఫ్రికా శిబిరంలో గెలుపు కోసం ఆకలి బాగా కనిపిస్తోంది. ఇక అన్ని రంగాల్లోనూ మెరుగ్గా దూసుకుపోతున్న టీమ్ ఇండియా.. పొట్టి ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది.
రికార్డులపై కన్నేసిన విరాట్ : భారత సూపర్‌స్టార్ విరాట్ కోహ్లి రికార్డులపై కన్నేసి నేడు దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లోకి రానున్నాడు. ప్రపంచకప్‌లో వరుసగా తొలి రెండు మ్యాచుల్లో అజేయ అర్థ సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లి.. ఇప్పటికే టోర్నీ చరిత్రలో అత్యధిక హాఫ్ సెంచరీలు (13) సాధించిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇక టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో అగ్రస్థానానికి విరాట్ మరో 28 పరుగుల దూరంలోనే ఉన్నాడు. టోర్నీలో హ్యాట్రిక్ అర్థ సెంచరీతో పాటు అత్యధక పరుగుల రికార్డును బద్దలు కొట్టేందుకు కోహ్లి నేడు మరింత స్వేచ్ఛగా బ్యాట్ ఝులిపించనున్నాడు.
ఇక భారత బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. నెదర్లాండ్స్‌పై రోహిత్ అర్థ సెంచరీ సాధించినా.. ఆ ఇన్నింగ్స్‌తో అతడికీ సంతృప్తి కలుగలేదు. సెమీఫైనల్స్‌కు బెర్త్ దాదాపుగా ఖాయం చేసుకున్న టీమ్ ఇండియాకు ఇప్పుడు రోహిత్ శర్మ నుంచి ధనాధన్ జోరు అవసరం. మరో ఓపెనర్ కెఎల్ రాహుల్ సైతం రాణించాల్సి ఉంది. రెండు మ్యాచుల్లోనూ రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ నెదర్లాండ్స్‌పై మెరుపు ఇన్నింగ్స్‌తో తనదైన మార్క్ చూపించాడు. నేడు హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్ తోడుగా సూర్యకుమార్ మెరిస్తే.. సఫారీల ముందు భారీ లక్ష్యం ఉంచటం , లాంఛనమే. దినేశ్ కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్‌ను తుది జట్టులోకి తీసుకుంటారా? లేదంటే కార్తీక్‌నే కొనసాగిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. బౌలింగ్ విభాగంలో ఎటువంటి మార్పులు ఉండే అవకాశం కనిపించటం లేదు. భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి, అర్షదీప్ సింగ్‌లకు తోడు హార్దిక్ పాండ్య పేస్ బాధ్యతలు పంచుకోనుండగా.. అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌లు స్పిన్నర్లుగా కొనసాగనున్నారు. విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చేందుకు కెప్టెన్ రోహిత్ శర్మ పెద్ద ఇష్టపడకపోవచ్చు.
నాయకుడే భారంగా..! : దక్షిణాఫ్రికా పరిస్థితి కాస్త విచిత్రంగా ఉంది. ఆ జట్టులో కెప్టెన్ తెంబ బవుమా మినహా అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. టాప్ ఆర్డర్లో బవుమా కోసం భీకర ఫామ్‌లో ఉన్న ఓ బ్యాటర్‌ను బెంచ్‌కు పరిమితం చేయాల్సి వస్తోంది. అంతిమంగా, ఇది మ్యాచ్ ఫలితం ప్రతికూల ప్రభావం చూపుతోంది. నేడు భారత్‌తో మ్యాచ్ దక్షిణాఫ్రికా కీలకం. నేటి మ్యాచ్‌లో తలొగ్గితే.. పాకిస్థాన్‌తో పోరులో చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దీంతో రీజా హెండ్రిక్స్ కోసం బవుమాను పక్కనపెట్టే ఆలోచన సైతం సఫారీ శిబిరంలో ఉంది. ఇక పేస్ స్వర్గధామం పెర్త్‌లో అదనపు పేసర్‌తో ఆడేందుకు దక్షిణాఫ్రికా ఉవ్విళ్లూరుతోంది. అందుకోసం ఓ స్పిన్నర్‌పై వేటు పడవచ్చు. కేశవ్ మహరాజ్ తుది జట్టులో కొనసాగనుండగా.. షంషి బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. అతడి స్థానంలో యువ పేసర్ మార్కో జాన్సెన్ను తుది జట్టులోకి ఎంపిక చేయనున్నారు. సఫారీ శిబిరంలో రిలీ రొసో ప్రస్తుతం కెరీర్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌తో టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో చెలరేగిన రోసో.. తాజాగా ప్రపంచకప్‌లో శతకంతో చెలరేగాడు. నేడు భారత్‌తో మ్యాచ్‌లో రొసోతో పాటు క్వింటన్ డికాక్ కీలకం కానున్నాడు. ఐపీఎల్‌తో సంచలన ఫామ్ అందుకున్న డెవిడ్ మిల్లర్, సీనియర్ బ్యాటర్ ఎడెన్ మార్కరం అంచనాలకు తగినట్టు రాణిస్తే.. నేడు భారత్‌కు షాక్ ఇవ్వటం సఫారీలకు శక్తికి మించిన పని కాదు. బౌలింగ్ విభాగంలో నోకియా, ఎంగిడి, కగిసో రబాడ సహా జాన్సెన్లు భారత్‌కు సవాల్ విసిరేందుకు సిద్ధంగా ఉన్నారు.
పిచ్, వాతావరణం : పెర్త్ పిచ్ పేస్‌కు స్వర్గధామం. అదనపు పేస్, వికెట్‌కు ఇరువైపులా స్వింగ్ లభిస్తుంది. మ్యాచ్‌కు ముందు పచ్చికతో కనిపిస్తుంది. భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్ నేడు ఈ పిచ్‌పై రెండోది. తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్, పాకిస్థాన్ ఆడనున్నాయి. పెద్ద బౌండరీల పెర్త్‌లో సిక్సర్లు బాదేందుకు, బ్యాటర్లు అదనపు ప్రయత్నం చేయకతప్పదు. ఇక్కడ బౌలర్లు హార్డ్ లెంగ్త్‌లతో బంతులు సంధిస్తారు. పెర్త్‌లో సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 143. ఇక్కడ ఒక్క సారే 200 ప్లస్ పరుగులు నమోదయ్యాయి. ఆదివారం ఇక్కడ వాతావరణం మేఘావృతమై ఉండనుంది. వర్ష సూచనలు 10 శాతం వరకు ఉన్నాయి. అయినా, మ్యాచ్‌కు ఎటువంటి ఆటంకం కలిగే అవకాశం లేదు. టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్.
దక్షిణాఫ్రికా : క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), తెంబ బవుమా, రిలీ రొసో, ఎడెన్ మార్కరం, డెవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేనీ పార్నెల్/మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, ఎన్రిచ్ నొకియా, లుంగి ఎంగిడి, కగిసో రబాడ.
4
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లలో భారత్, దక్షిణాఫ్రికా ఇప్పటివరకు ఐదు మ్యాచుల్లో తలపడ్డాయి. భారత్ నాలుగింట విజయాలు సాధించగా, దక్షిణాఫ్రికా (2009)ఓ మ్యాచ్‌లో నెగ్గింది. 2014 తర్వాత ఇరు జట్లు పొట్టి ప్రపంచకప్‌లో తలపడనుండటం ఇదే తొలిసారి కానుంది.
1
టీ20 ఫార్మాట్లో టీమ్ ఇండియాపై విజయం సాధించిన చివరి జట్టు దక్షిణాఫ్రికా. అక్టోబర్ ఆరంభంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో నామమాత్రపు మ్యాచ్‌లో సఫారీలు ఊరట విజయం సాధించారు.
28
విరాట్ కోహ్లి రికార్డులపై కన్నేసి పెర్త్‌లో బరిలోకి దిగనున్నాడు. 13 అర్థ సెంచరీలతో టోర్నీ చరిత్రలోనే అత్యధిక హాఫ్ సెంచరీల రికార్డు సొంతం చేసుకున్న కోహ్లి.. టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచేందుకు కోహ్లికి మరో 28 పరుగులు అవసరం. మహేళ జయవర్దెనె ఒక్కడే కోహ్లి కంటే ముందున్నాడు.