Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్యాటర్‌గా రోహిత్ శర్మ నిలకడగా నిరాశపరుస్తున్నాడు. కీలక మ్యాచుల్లో పరుగులు సాధించటం లేదు. అతడికి కెఎల్ రాహుల్ సైతం తోడవటంతో టాప్ ఆర్డర్ భారత్‌కు భారంగా పరిణమిస్తోంది. బ్యాటర్‌గా విఫలమవుతున్నప్పటికీ... నాయకుడిగా రోహిత్ శర్మ వందకు వంద మార్కులు కొట్టేస్తూనే ఉన్నాడు!. కానీ పెర్త్‌లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో తొలిసారి రోహిత్ శర్మ కెప్టెన్‌గా సైతం తేలిపోయాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకు బలమైన కారణాలు లేకపోలేదు. పెర్త్ ఆస్ట్రేలియాలోనే వేగవంతమైన పిచ్. ఇంకోమాటలో చెప్పాలంటే.. ప్రపంచంలోనే పెర్త్ అత్యంత వేగవంతమైన పిచ్‌గా పేర్కొంటారు. పెర్త్ పిచ్‌పై పేసర్లు బుల్లెట్ల వంటి బంతులను వదులుతారు. పేస్‌కు అనుకూలించే పెర్త్ పిచ్ ఆదివారం.. అత్యంత శీతల వాతావరణం సంతరించుకుంది. డగౌట్లో భారత క్రికెటర్లు కొందరు టవల్స్ కప్పుకుని ఉండటం సైతం కనిపించింది. శీతల పరిస్థితుల్లో సహజంగానే ఎవరైనా తొలుత బౌలింగ్ చేసేందుకు ఇష్టపడతారు. టాస్ నెగ్గిన రోహిత్ శర్మ అందుకు భిన్నంగా కోరి మరీ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడానికి రోహిత్ శర్మ సరైన కారణాలను సైతం వెల్లడించలేదు. 'పిచ్ బాగుందంటూ.. తొలుత బ్యాటింగ్ తీసుకున్నాడు'. ఆ నిర్ణయమే తొలుత భారత్‌ను ఇరకాటంలో పడేసింది. పేస్ స్వర్గధామం పెర్త్‌లో లుంగిసాని ఎంగిడికి తొలిసారి దక్షిణాఫ్రికా తుది జట్టులోకి తీసుకుంది. పరిస్థితులు, పెద్ద బౌండరీలను సరిగ్గా సద్వినియోగం చేసుకున్న లుంగిసాని ఎంగిడి.. బౌన్సర్లతో బ్యాటర్లను కవ్వించి క్యాచింగ్ పోజిషన్లతో ఫీల్డర్లను మొహరించాడు. విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యలను ఆ తరహాలోనే వెనక్కి పంపించాడు. ఇక కెప్టెన్ రోహిత్ శర్మ తనకు ఇష్టమైన పుల్ షాట్ ఆడబోయి.. అదనపు బౌన్స్‌కు బోల్తా పడ్డాడు. రిటర్న్ క్యాచ్‌తో వెనుదిరిగాడు. భీకర పేస్ పిచ్‌పై భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుని ఉంటే.. దక్షిణాఫ్రికాను సైతం స్వల్ప స్కోరుకు పరిమితం చేసేందుకు మంచి అవకాశాలు ఉండేవి. ఛేదనలో భారత్ సైతం వికెట్లు కోల్పోయినా.. సాధించాల్సిన రన్‌రేట్ తక్కువగానే ఉండనుండటం టీమ్ ఇండియాకు కలిసొచ్చేది. భీకర పేస్ లైనప్ కలిగిన దక్షిణాఫ్రికాపై పేస్ పిచ్‌పై తొలుత బ్యాటింగ్ ఎంచుకోవటం రోహిత్ శర్మ వ్యూహాత్మక తప్పిదమే.
ఇక లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో టీమ్ ఇండియా అందివచ్చిన అవకాశాలను జారవిడిచింది. పేస్‌కు అనుకూలించే పిచ్‌పై అశ్విన్ నాలుగు ఓవర్లే కీలకం అనే సంగతి ఇరు జట్లకు తెలుసు. అశ్విన్ వేసిన తొలి ఓవర్లోనే మార్కరంను అవుట్ చేసే అవకాశం లభించింది. సులువైన క్యాచ్‌ను విరాట్ కోహ్లి నేలపాలు చేయటం ఎవరకీ నమ్మశక్యం కాలేదు. ఇక కీలక తరుణంలో డెవిడ్ మిల్లర్‌ను రనౌట్ చేసే అవకాశాన్ని రోహిత్ శర్మ జారవిడిచాడు. స్వల్ప ఛేదనలో మార్కరంను ముందే సాగనంపితే మ్యాచ్ స్వరూపమే మారిపోయి ఉండేది. అశ్విన్ ఓవర్లో జీవనదానం లభించటంతో.. మిల్లర్, మార్కరం అతడిపై ఏకంగా 43 పరుగులు పిండుకున్నారు. ఇక్కడ మ్యాచ్ మలుపు తిరిగింది. గ్రూప్-2 నుంచి సెమీస్‌కు చేరేందుకు భారత్ చివరి రెండు మ్యాచుల్లో బంగ్లాదేశ్, జింబాబ్వేలపై విజయం సాధించాల్సి ఉంటుంది. నేడు భారత్‌పై సఫారీల గెలుపుతో పాకిస్థాన్ సెమీస్ ఆశలు ఆవిరయ్యాయి.