Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సఫారీ చేతిలో భారత్ పరాజయం
- నిప్పులు చెరిగిన లుంగిసాని ఎంగిడి
- సూర్య అసమాన ఇన్నింగ్స్ వృథా
పెర్త్ పేస్ పరీక్షలో టీమ్ ఇండియా ఫెయిల్!. అత్యంత వేగవంతమైన పిచ్‌పై పదునైన సఫారీ పేసర్లను ఎదుర్కొవటంలో రోహిత్ సేన తేలిపోయింది. పవర్‌ప్లేలోనే పస కోల్పోయింది. 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్ సూపర్12 గ్రూప్ దశలో తొలి పరాజయం మూటగట్టుకుంది. లుంగిసాని ఎంగిడి (4/29), వేనీ పార్నెల్ (3/15) నిప్పులు చెరిగే ప్రదర్శనతో తొలుత భారత్ 133 పరుగులే చేసింది. ఛేదనలో ఎడెన్ మార్కరం (52), డెవిడ్ మిల్లర్ (56) అర్థ సెంచరీలతో రాణించటంతో దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. సూర్యకుమార్ యాదవ్ (68) స్పెషల్ ఇన్నింగ్స్ వృథా అయ్యింది.
నవతెలంగాణ-పెర్త్ :ఆస్ట్రేలియాలోనే కాదు, ఏకంగా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పిచ్ పెర్త్. అదనంగా, ఆదివారం అత్యంత శీతల వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల్లో బంతి మరింత స్వింగ్, పేస్‌కు బౌన్స్ తోడయ్యాయి. భీకర పేస్ లైనప్ కలిగిన దక్షిణాఫ్రికా.. పెర్త్ పేస్ సవాల్లో టీమ్ ఇండియాపై పైచేయి సాధించింది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ సూపర్12 గ్రూప్-2 మ్యాచ్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 134 పరుగుల థ్రిల్లింగ్ ఛేదనలో ఎడెన్ మార్కరం (52, 41 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), డెవిడ్ మిల్లర్ (56 నాటౌట్) 76 పరుగుల భారీ భాగస్వామ్యంతో కదం తొక్కారు. 24/3తో ఒత్తిడిలో ఉన్న సఫారీలను ఈ ఇద్దరు ఆదుకున్నారు. ఐదు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించిపెట్టారు. అంతకముందు, తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 133 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (68, 40 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) కండ్లుచెదిరే ఇన్నింగ్స్‌తో భారత్‌కు గౌరవప్రద స్కోరు అందించాడు. కెఎల్ రాహుల్ (9), రోహిత్ శర్మ (15), విరాట్ కోహ్లి (12), హార్దిక్ పాండ్య (2), దీపక్ హుడా (0), దినేశ్ కార్తీక్ (6)లు విఫలమయ్యారు. నాలుగు వికెట్లతో భారత్‌ను కోలుకోలేని దెబ్బతీసిన లుంగిసాని ఎంగిడి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.
మార్కరం, మిల్లర్ షో : దక్షిణాఫ్రికా లక్ష్యం 134 పరుగులు. పేస్ స్వర్గధామం పెర్త్‌లో భారత బౌలర్లకు సైతం ఇది కాపాడుకోగల స్కోరే. పవర్‌ప్లేలో పేసర్లు భారత్‌కు మంచి బ్రేక్ ఇచ్చారు. అర్షదీప్ సింగ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లతో సఫారీలను ఇరకాటంలో పడేశాడు. క్వింటన్ డికాక్ (1), రిలీ రొసో (0)లను అర్షదీప్ సాగనంపాడు. సఫారీ కెప్టెన్ తెంబ బవుమా (10)ను మహ్మద్ షమి అవుట్ చేశాడు. 24 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా సైతం కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో ఎడెన్ మార్కరం (52), డెవిడ్ మిల్లర్ (56 నాటౌట్) అర్థ సెంచరీలతో చెలరేగారు. ఆరంభంలో పేస్ సవాల్‌ను కాచుకున్న ఈ జోడీ.. ఆ తర్వాత చెత్త బంతులకు మాత్రమే పరుగులు సాధించటం మొదలుపెట్టింది. ఈ ఇద్దరిని అవుట్ చేసే అవకాశం లభించినా.. భారత్ చేజార్చుకుంది. దీంతో మరింత స్వేచ్ఛగా మెరిసిన మార్కరం, మిల్లర్ దక్షిణాఫ్రికాకు మెరుపు విజయాన్ని అందించారు. అర్థ సెంచరీ అనంతరం మార్కరం అవుటైనా.. డెవిడ్ మిల్లర్ కూల్‌గా ముగించాడు. 19.4 ఓవర్లలోనే సఫారీలను గెలుపు అందించాడు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ (2/25) రెండు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ షమి, హార్దిక్ పాండ్య, అశ్విన్‌లు తలా ఓ వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
ఆరంభం పేలవం : టాస్ నెగ్గిన టీమ్ ఇండియా పేస్‌కు అనుకూలించే పిచ్‌పై తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నలుగురు పేసర్లతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా భారత్‌కు పవర్‌ప్లేలోనే పవర్ఫుల్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. తొలి ఓవర్‌ను కెఎల్ రాహుల్ మెయిడిన్‌గా ముగించగా.. రోహిత్ శర్మ సైతం తొలి నాలుగు బంతుల్లో పరుగు సాధించలేదు. రబాడపై డీప్ ఫైన్ లెగ్‌లో సిక్సర్‌తో రోహిత్ శర్మ పరుగుల ఖాతా తెరువగా.. వేనీ పార్నెల్పై డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్‌తో రాహుల్ స్కోరు సాధించాడు. ఇద్దరు ఓపెనర్లు సిక్సర్లతో ఇన్నింగ్స్‌ను ఆరంభించినా స్ట్రయిక్రొటేషన్కు సైతం బాగా ఇబ్బంది పడ్డారు. సఫారీ పేసర్ లుంగిసాని ఎంగిడి పరిస్థితులను గొప్పగా సద్వినియోగం చేసుకుని.. భారత టాప్-4 బ్యాటర్లను డగౌట్‌కు చేర్చాడు. కెఎల్ రాహుల్ (9), రోహిత్ శర్మ (15), విరాట్ కోహ్లి (12), హార్దిక్ పాండ్య (2)లు లుంగిసాని ఎంగిడి బౌలింగ్‌లో వికెట్లు కోల్పోయారు. స్కోరు వేగం పెంచే ప్రయత్నంలో రోహిత్ శర్మ విచిత్రంగా పుల్ షాట్‌కు వికెట్ కోల్పోగా.. రాహుల్ స్లిప్స్‌లో దొరికిపోయాడు. ఎంగిడికి రెండు బౌండరీలతో దీటుగా బదులిచ్చిన విరాట్ కోహ్లి.. మంచి బౌన్సర్‌కు బౌండరీ లైన్ వద్ద క్యాచౌట్‌గా నిష్క్రమించాడు. రబాడ కండ్లుచెదిరే క్యాచ్‌తో హార్దిక్ పాండ్యను వెనక్కి పంపించాడు. మిడిల్ ఆర్డర్లో దీపక్ హుడా (0) సున్నా పరుగులకే అవుటయ్యాడు. దీంతో 49 పరుగులకే భారత్ 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది.
సూర్య ఒక్కడే.. : ప్రతికూల పరిస్థితుల్లో, పెర్త్ పేస్ పిచ్‌పై అందరు బ్యాటర్లు ఇబ్బంది పడగా.. సూర్యకుమార్ యాదవ్ (68) ఒక్కడే భిన్నమైన ప్రదర్శన చేశాడు. ఇతర బ్యాటర్లు పరుగుల వేటలో ఇబ్బంది పడుతున్న పిచ్ ఇదేనా అన్న తరహాలో సూర్య ఇన్నింగ్స్ సాగింది. 30 బంతుల్లోనే కెరీర్ 12వ అర్థ సెంచరీ పూర్తి చేసిన సూర్యకుమార్ యాదవ్.. ఆరో వికెట్‌కు దినేశ్ కార్తీక్ (6)తో కలిసి కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో చెలరేగిన సూర్య భారత్‌కు పోరాడగలిగే స్కోరు అందించాడు. టాప్ బ్యాటర్లు అందరూ డగౌట్‌కు చేరుకున్నా, ఆవల ఎండ్‌లో ఉన్న బ్యాటర్ స్ట్రయిక్ రొటేషన్‌కు ఆపసోపాలు పడినా.. సూర్య ప్రతాపం ఆగలేదు. డెత్ ఓవర్లలో మరింత ధాటిగా ఆడేందుకు ప్రయత్నించిన సూర్య ఆ క్రమంలో వికెట్ కోల్పోయాడు. పేసర్లు నిప్పులు చెరిగిన పిచ్‌పై 170 స్ట్రయిక్‌రేట్‌తో సూర్య పరుగులు చేయటం విశేషం. పది ఓవర్లలోపే క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ (6) ఆకట్టుకోలేదు. రవిచంద్రన్ అశ్విన్ (7) కాసేపు సూర్యతో కలిసి అలరించే ప్రయత్నం చేశాడు. దక్షిణాఫ్రికా పేసర్లలో లుంగిసాని ఎంగిడి (4/29) నాలుగు వికెట్లు పడగొట్టగా, వేనీ పార్నెల్ (3/15) మూడు వికెట్లతో విరుచుకుపడ్డాడు.
స్కోరు వివరాలు :
భారత్ ఇన్నింగ్స్ : కెఎల్ రాహుల్ (సి) మార్కరం (బి) లుంగి ఎంగిడి 9, రోహిత్ శర్మ (సి,బి) లుంగి ఎంగిడి 15, విరాట్ కోహ్లి (సి) రబాడ (బి) లుంగి ఎంగిడి 12, సూర్యకుమార్ యాదవ్ (సి) కేశవ్ (బి) పార్నెల్ 68, దీపక్ హుడా (సి) డికాక్ (బి) నోకియా 0, హార్దిక్ పాండ్య (సి) రబాడ (బి) లుంగి ఎంగిడి 2, దినేశ్ కార్తీక్ (సి) రొసో (బి) పార్నెల్ 6, అశ్విన్ (సి) రబాడ (బి) పార్నెల్ 7, భువనేశ్వర్ కుమార్ నాటౌట్ 4, మహ్మద్ షమి (రనౌట్) 0, అర్షదీప్ సింగ్ నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు : 8, మొత్తం : (20 ఓవర్లలో 9 వికెట్లకు) 133.
వికెట్ల పతనం : 1-23, 2-26, 3-41, 4-42, 5-49, 6-101, 7-124, 8-127, 9-130.
బౌలింగ్ : వేనీ పార్నెల్ 4-1-15-3, కగిసో రబాడ 4-0-26-0, లుంగిసాని ఎంగిడి 4-0-29-4, ఎన్రిచ్ నోకియా 4-0-23-1, కేశవ్ మహరాజ్ 3-0-28-0, ఎడెన్ మార్కరం 1-0-5-0.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ : క్వింటన్ డికాక్ (సి) రాహుల్ (బి) అర్షదీప్ సింగ్ 1, తెంబ బవుమా (సి) దీనేశ్ కార్తీక్ (బి) మహ్మద్ షమి 10, రిలీ రొసో (ఎల్బీ) అర్షదీప్ సింగ్ 0, ఎడెన్ మార్కరం (సి) సూర్యకుమార్ (బి) హార్దిక్ పాండ్య 52, డెవిడ్ మిల్లర్ నాటౌట్ 59, ట్రిస్టన్ స్టబ్స్ (ఎల్బీ) అశ్విన్ 6, వేనీ పార్నెల్ నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు : 7, మొత్తం : (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 137.
వికెట్ల పతనం : 1-3, 2-3, 3-24, 4-100, 5-122.
బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ 3.4-0-21-0, అర్షదీప్ సింగ్ 4-0-25-2, మహ్మద్ షమి 4-0-13-1, హార్దిక్ పాండ్య 4-0-29-1, రవిచంద్రన్ అశ్విన్ 4-0-43-1.