Authorization
Mon Jan 19, 2015 06:51 pm
15 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించటమే లక్ష్యంగా ఆస్ట్రేలియాకు బయల్దేరిన టీమ్ ఇండియా.. ఐసీసీ టీ20 ప్రపంచకప్ సూపర్12 గ్రూప్ దశలో వరుసగా రెండు మ్యాచుల్లో గెలుపొంది, కీలక మూడో మ్యాచ్‌లో బోల్తాపడింది. అత్యంత వేగవంతమైన పెర్త్ పిచ్‌పై పేస్ సవాల్ భారత్‌కు ముందే తెలుసు. అందుకే ఆసీస్‌కు చేరుకోగానే వాకాలోనే రెండు ప్రాక్టీస్ మ్యాచులు సైతం ఆడేసింది. అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ప్రయత్నం చేసింది. అయినా, పెర్త్‌లో ఓటమితో వ్యూహాత్మక నిర్ణయాలే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
- పెర్త్‌లో భారత్ వ్యూహాత్మక తప్పిదాలు
- నాయకత్వంపై దూసుకొస్తున్న విమర్శలు
నవతెలంగాణ క్రీడావిభాగం
తుది జట్టులో మార్పులు ఎందుకు? :
ప్రపంచకప్‌లో తుది జట్టు మార్పులపై టీమ్ ఇండియా ప్రతిసారి ఒకటే సమాధానం చెబుతూ వచ్చింది. మార్పులు చేర్పులపై పెద్దగా ఆసక్తి లేదని తేల్చింది. విన్నింగ్ కాంబినేషన్‌పై నమ్మకం కాకపోయినా.. ప్రస్తుత జట్టు అన్ని కోణాల్లో సమతూకంగా ఉందని జట్టు మేనేజ్మెంట్ విశ్వసించింది. పేస్ పిచ్ పెర్త్‌లో స్పిన్నర్ అక్షర్ పటేల్ స్థానంలో దీపక్ హుడా తుది జట్టులోకి వచ్చాడు. సఫారీ పేస్ పదును దృష్ట్యా అదనపు బ్యాటర్ అవసరమని భారత్ భావించిందా? అదే నిజమైతే.. ఆసీస్ పిచ్‌లపై తిరుగులేని రికార్డున్న రిషబ్ పంత్‌ను జట్టులోకి తీసుకుని ఉండవచ్చు. బ్యాటర్‌గా తేలిపోయిన దీపక్ హుడాకు కెప్టెన్ బంతిని అందించేందుకు నిరాకరించాడు. ఇక పెర్త్‌లో ఇద్దరు స్పిన్నర్లు అవసరం లేదు, నలుగురు పేసర్లు పూర్తి ఓవర్ల కోటా వేస్తారని అనుకున్నారు. పెర్త్‌లో స్ట్రయిట్ బౌండరీలు తక్కువ దూరంలో ఉంటాయి. అదే స్క్వేర్ బౌండరీలు చాలా పెద్దవిగా ఉంటాయి. అక్షర్ పటేల్‌ను కూర్చోబెట్టడం వెనుక ఇదో కారణం అయి ఉండవచ్చు. అక్షర్ పటేల్‌ను తీసేయటంతో.. బ్యాటింగ్ లైనప్‌లో ఎడమ చేతి బ్యాటర్ లేకుండా పోయాడు. భారత్ తర్వాతి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో భారత్ విన్నింగ్ కాంబినేషన్‌కు మారుతుందా? లేదంటే ఇదే జట్టుతో ఆడుతుందా? అనేది ఆసక్తికరం.
తొలుత బ్యాటింగ్ ఎందుకు? :
సగటు క్రికెట్ అభిమానిని వేధించిన ప్రశ్న... పేస్ స్వర్గధామం పెర్త్‌లో తొలుత ఎందుకు బ్యాటింగ్ ఎంచుకున్నారని?. ఈ ప్రశ్నకు జట్టు మేనేజ్మెంట్ వద్ద సరైన సమాధానం లేదు. పాకిస్థాన్‌తో భారత్... భారత్‌పై దక్షిణాఫ్రికా ఛేదనల దృష్ట్యా పెర్త్‌లో రోహిత్‌సేన రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసివుంటే ఫలితం కచ్చితంగా భిన్నంగా ఉండేదని చెప్పవచ్చు. గణాంకాల పరంగా చూసినప్పుడు పెర్త్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 15 మ్యాచుల్లో నెగ్గగా, 11 మ్యాచుల్లో ఓడింది. అయితే ఒత్తిడితో కూడిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో స్వల్ప స్కోరు ఛేదించే సమయంలో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ఉత్తమ మార్గం. తొలుత బ్యాటింగ్ చేయాలనే భారత నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపించింది.
పుల్ షాట్లు ఆడటం ఎందుకు? :
పెర్త్ పిచ్‌పై అదనపు బౌన్స్‌ను సఫారీ బౌన్సర్లు అద్భుతంగా ఉపయోగించుకున్నారు. లుంగిసాని ఎంగిడి వరుసగా షార్ట్ బంతులు సంధిస్తూ.. ఆ బంతిని ఆడగలే పొజిషన్లలో బౌండరీ లైన్ వద్ద నలుగురు ఫీల్డర్లను మొహరించాడు. అందుకు తగినట్టుగానే బంతులు వేశాడు. రోహిత్ శర్మ తొలి సిక్సర్‌ను సైతం షార్ట్ బాల్‌పైనే సాధించాడు. రోహిత్ శర్మ పుల్ షాట్ ఆడుతూ నిష్క్రమించగా.. టాప్-6లో నలుగురు బ్యాటర్లు బంతిని పుల్ లేదా హుక్ చేసేందుకు ప్రయత్నించి వికెట్ కోల్పోయారు. ఇటువంటి పిచ్‌పై షార్ట్ బంతులను ఎదుర్కొవటం అంత సులువు కాదు. ఈ రెండు షాట్లను ఆడకుండా స్కోరు బోర్డును ముందుకు కదించలేం. భారత బ్యాటర్ల షాట్ల ఎంపికలో ఎటువంటి లోపం లేదు. కానీ అదనపు బౌన్స్‌ను అంచనా వేయటంలో మాత్రం కాస్త వెనుకంజ వేశారు.
యార్కర్లు ఎందుకు వేయలేదు? :
పెర్త్‌లో ఆదివారం తొలుత పాకిస్థాన్, నెదర్లాండ్స్ జరుగగా.. రెండో మ్యాచ్‌లో భారత్, దక్షిణాఫ్రికా తలపడ్డాయి. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ పేసర్లు యార్కర్లు సంధించి ఫలితం రాబట్టారు. భారత పేసర్లు సఫారీలపై యార్కర్లు వేయడానికి ప్రయత్నమే చేయలేదు. సఫారీ పేసర్ల తరహాలోనే హార్డ్ లెంగ్త్ బంతులు, షార్ట్ బంతుల కోసమే ప్రయత్నించారు. అర్షదీప్ సింగ్, మహ్మద్ షమిలు యార్కర్లు బాగా వేయగలరు. అయినా, ఆ పని చేయలేదు. పెర్త్‌లో చిన్న స్ట్రయిట్ బౌండరీల నేపథ్యంలో గతి తప్పితే బౌండరీ ప్రమాదం ఉంటుంది. అందుకే, యార్కర్ కోసం మనోళ్లు వెళ్లలేదు.
అశ్విన్‌కు చివరి ఓవర్? :
స్వల్ప స్కోర్ల థ్రిల్లర్‌లో స్పిన్నర్ అశ్విన్‌కు చివరి ఓవర్ ఇవ్వవచ్చు కదా అనే వాదన వినిపిస్తోంది. పేసర్లు నిప్పులు చెరుగుతున్న పిచ్‌పై ఏకైక స్పిన్నర్ అశ్విన్ ఓవర్లు కీలకం అయ్యాయి. అశ్విన్ నాలుగు ఓవర్లలో దండిగా పరుగులు పిండుకున్న మిల్లర్, మార్కరం సఫారీలను గట్టెక్కించారు. అశ్విన్‌కు 20వ ఓవర్ ఇవ్వకుండా ముందే ఇవ్వటం వెనుక రోహిత్ వ్యూహాత్మక తప్పిదం పెద్దగా కనిపించటం లేదు. అశ్విన్‌కు ఓ ఓవర్ ఉండటంతో సఫారీలు అతడి ఓవర్ కోసమే ఎదురుచూస్తారు. సహజంగా కెప్టెన్లు ఆ బౌలర్‌ను అంత త్వరగా తీసుకురారు. పాక్‌తో ఛేదనలోనూ నవాజ్‌కు కెప్టెన్ బాబర్ చివరి ఓవర్ ఇచ్చాడు. 18 పరుగులను సైతం నవాజ్ కాపాడుకోలేదు. మిల్లర్ క్రీజులో ఉండటంతో అశ్విన్‌కు చివరి ఓవర్ ఇచ్చినా.. ఆరు బంతుల్లో 11-12 పరుగులు చేయాల్సిన సమీకరణం ఉండేది. పెద్దగా ఉపయోగం ఉండేది కాదని చెప్పవచ్చు.