Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత పదేండ్లుగా ఈ రెండు జట్లు తలపడిన ప్రతిసారి భావోద్వేగాలు తారాస్థాయికి చేరుతున్నాయి. చివరగా 2016 ఐసీసీ టీ20 ప్రపంచకప్ క్వార్టర్ఫైనల్లో భారత్, బంగ్లాదేశ్ సమరం అభిమానులు ఇప్పటికి మరిచిపోలేదు!. నేడు ఆడిలైడ్ ఓవల్‌లో టీమ్ ఇండియా స్పష్టమైన ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నా.. అభిమానుల భావోద్వేగాల్లో మాత్రం మార్పు ఉండబోదు. సెమీఫైనల్స్ దారిలో బంగ్లాదేశ్‌పై గెలుపే లక్ష్యంగా భారత్ నేడు సమరానికి సై అంటోంది.
- బంగ్లాదేశ్‌తో భారత్ ఢ నేడు
- కెఎల్ రాహుల్, రోహిత్‌పై ఫోకస్
- మ.1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-ఆడిలైడ్ :
ఐసీసీ టోర్నీల్లో బంగ్లాదేశ్ రూపంలో భారత్‌కు మరో కవ్వించే ప్రత్యర్థి తయారైంది. గత దశాబ్ద కాలంగా బంగ్లాదేశ్ పలు మ్యాచుల్లో భారత్‌కు గట్టి పోటీ ఇచ్చింది. ఫలితంగా, ఇరు జట్లు తలపడిన మ్యాచ్‌లో అభిమానుల భావోద్వేగాలు భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను తలపిస్తున్నాయి. శ్రీలంకలో నిదహాస్ ట్రోఫీ, 2016 టీ20 ప్రపంచకప్ క్వార్టర్‌ఫైనల్ మ్యాచులు ఇరు జట్ల మధ్య భావోద్వేగ సమరానికి మచ్చుతునకలు. బలాబలాల పరంగా భారత్ నేటి మ్యాచ్‌లో అత్యంత బలంగా కనిపిస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్ పెద్దగా ఆశలు లేకుండానే ఆస్ట్రేలియాకు వచ్చింది. నేడు భారత్‌తో మ్యాచ్‌కు సైతం అదే పరిస్థితి. ఆడిలైడ్‌లో విజయంతో సెమీస్‌కు లైన్ క్లియర్ చేసుకునే పనిలో రోహిత్‌సేన ఉండగా.. భారత్ సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసేందుకు బంగ్లాదేశ్ విశ్వప్రయత్నం చేయనుంది. భారత్, బంగ్లాదేశ్ సూపర్12 గ్రూప్-2 మ్యాచ్ నేడే.
టాప్ కుదురుకునేనా?! :
పెర్త్‌లో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం గ్రూప్ దశలో భారత్ చివరి రెండు మ్యాచుల్లో కాస్త ఒత్తిడికి గురయ్యేందుకు కారణమైంది. ప్రపంచకప్‌లో భారత టాప్ ఆర్డర్ ఇప్పటివరకు ఒక్క మంచి ప్రదర్శన చేయలేదు.ఓపెనర్లు కెఎల్ రాహుల్, రోహిత్ శర్మలు కాగితంపైనే విధ్వంసకర బ్యాటర్లుగా మిగిలారు. మైదానంలో కొత్త బంతిని ఎదుర్కొనేందుకు ఇద్దరు ఆపసోపాలు పడుతున్నారు. టాప్ ఆర్డర్ వైఫల్యంతో మిడిల్ ఆర్డర్ బాధ్యత ప్రధానంగా ఇన్నింగ్స్‌ను తిరిగి నిర్మించటానికే పరిమితం అవుతోంది. సెమీఫైనల్స్‌కు ముందు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ అంచనాలను అందుకుంటే భారత టాప్ ఆర్డర్ కష్టాలు తీరినట్టే. కెఎల్ రాహుల్ ఆడిన మూడు మ్యాచుల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అయ్యాడు. రోహిత్ శర్మ నెదర్లాండ్స్‌పై అర్థ సెంచరీ సాధించినా.. అది అతడి స్థాయికి తగ్గ తరహాలో నమోదు కాలేదు. దీంతో నేడు కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ ప్రదర్శనపై ఫోకస్ ఉంది. ఇక విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్‌లు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు క్రీజులో నిలిచినా భారత్‌కు భారీ స్కోరు ఖాయం. దీపక్ హుడా అదనపు బ్యాటర్‌గా తుది జట్టులో కొనసాగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌కు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఫోబియో ఉంది. మరోవైపు బంగ్లా శిబిరంలో ఎడమ చేతి వాటం బ్యాటర్లు ఎక్కువ. దీంతో చాహల్, అశ్విన్‌లలో ఎవరు తుది జట్టులో నిలుస్తారనేది చూడాలి. గత మ్యాచ్‌లో గాయపడిన దినేశ్ కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ బాధ్యతలు తీసుకునే సూచనలు ఉన్నాయి. పేస్ విభాగంలో మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్‌లు హార్దిక్ పాండ్యతో కలిసి బంగ్లాను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
సంచలనం కోసం..! :
భారత్‌పై సంచలన విజయం కోసం తపిస్తోంది. జింబాబ్వే, నెదర్లాండ్స్‌పై గెలుపొందిన బంగ్లాదేశ్.. దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడింది. నెట్‌రన్‌రేట్ సైతం బుణాత్మకంగా ఉంది. బంగ్లాదేశ్ శిబిరంలో కొంతమంది ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేస్తున్నారు. కానీ జట్టుగా బంగ్లాదేశ్ నేడు భారత్ ముందు నిలబడటం ప్రశ్నార్థకమే. షకిబ్ అల్ హసన్, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, హసన్ ముహమద్లు నేడు ఆడిలైడ్ ఓవల్‌లో బంగ్లాదేశ్ తరఫున కీలకం కానున్నారు. బ్యాట్‌తో, బంతితో ఈ ఆటగాళ్లు మెరిస్తేనే బంగ్లాదేశ్ పోటీ ఇవ్వగలదు. లిటస్ దాస్, సౌమ్య సర్కార్, నజ్ముల్ శాంటో, అఫిఫ్లు నిలకడగా విఫలమవుతున్నారు. 2015లో ఇక్కడ వన్డే వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌కు షాక్ ఇచ్చిన బంగ్లాదేశ్.. నేడు భారత్‌కు అదే ఫలితాన్ని రుచి చూపించాలని తహతహలాడుతోంది. టస్కిన్ అహ్మద్ 12 వికెట్లతో టోర్నీలో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. రెండు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రదర్శనలు అతడి సొంతం. నేడు భారత్‌తో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టస్కిన్ అహ్మద్‌కు పెద్ద బాధ్యతలే అప్పగించనుంది. ఆత్మవిశ్వాసం కోల్పోయిన భారత ఓపెనర్లపై టస్కిన్ అహ్మద్ దాడి నేటి మ్యాచ్‌లో ఆసక్తికరం కానుంది.
పిచ్, వాతావరణం : ఆడిలైడ్ ఓవల్ మైదానం సహజంగానే భారీ స్కోర్లకు వేదిక. ఇక్కడ సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 170 పరుగులు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పరుగుల వరద మరింత అధికంగా ఉంటుంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది. కానీ నేడు ఆడిలైడ్‌లో సాయంత్రం వర్షం సూచనలు ఉన్నాయి. మ్యాచ్‌కు చిరుజల్లులు ఆటంకం కలిగించే అవకాశం ఉంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్/రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్.
బంగ్లాదేశ్ : సౌమ్య సర్కార్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, లిటన్ దాస్, షకిబ్ అల్ హసన్ (కెప్టెన్), అఫిఫ్ హుస్సేన్, నురుల్ హసన్ (వికెట్ కీపర్), మొసద్దిక్ హుస్సేన్, యాసిర్ అలీ, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, హసన్ మహ్మద్.
'ఆడిలైడ్‌లో భారత్ ఫేవరేట్ జట్టు.
టీమ్ ఇండియా ఇక్కడ (ఆస్ట్రేలియా)కు టీ20 ప్రపంచకప్ నెగ్గేందుకు వచ్చింది. బంగ్లాదేశ్ టైటిల్ ఫేవరేట్ కాదు, ఇక్కడికి టోర్నీ విజేతగా నిలిచేందుకూ రాలేదు. మేము ఒకవేళ భారత్‌పై విజయం సాధిస్తే అది అనూహ్యం, సంచలనమే అవుతుందని మాకు తెలుసు. భారత్‌కు ఊహించని పరాజయం అందించేందుకు బంగ్లాదేశ్ అత్యుత్తమ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నం చేస్తుంది'
- షకిబ్ అల్ హసన్, బంగ్లాదేశ్ కెప్టెన్.