Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కివీస్‌పై ఇంగ్లాండ్ విజయం
బ్రిస్బేన్ : ఐసీసీ టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్ రేసులో ఇంగ్లాండ్ అవకాశాలను వరుణుడు శాసించాడు. ఓ మ్యాచ్‌లో ఆటంకంతో అనూహ్య పరాజయం అందివ్వగా.. మరో మ్యాచ్‌లో ఆటంకంతో అసలు ఆటనే తుడిచిపెట్టేశాడు. ఇక సెమీఫైనల్స్ అవకాశాలు తక్కువే అనుకున్న తరుణంలో ఇంగ్లాండ్ గొప్పగా పుంజుకుంది. న్యూజిలాండ్‌కు తొలి ఓటమి రుచి చూపించింది. సూపర్12 గ్రూప్-1లో న్యూజిలాండ్‌పై 20 పరుగుల తేడాతో గెలుపొందిన ఇంగ్లాండ్ సెమీఫైనల్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. మంగళవారం బ్రిస్బేన్‌లో జరిగిన గ్రూప్-1 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు పరాజయం తప్పలేదు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 179 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ జోశ్ బట్లర్ (73, 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), యువ ఓపెనర్ అలెక్స్ హేల్స్ (52, 40 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీలతో విరుచుకుపడ్డారు. మోయిన్ అలీ (5), బ్రూక్ (7), స్టోక్స్ (8) విఫలమైనా.. లియాం లివింగ్‌స్టోన్ (20, 14 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) ధనాధన్‌తో మెప్పించాడు. కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గుసన్ రెండు వికెట్లతో రాణించాడు. ఇక ఛేదనలో న్యూజిలాండ్ ఆరంభంలో లక్ష్యం దిశగా దూసుకెళ్లినా.. మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో ఓటమి మూటగట్టుకుంది. డెవాన్ కాన్వే (3), ఫిన్ అలెన్ (16) నిరాశపరిచినా.. కేన్ విలియమ్సన్ (40, 40 బంతుల్లో 3 ఫోర్లు), గ్లెన్ ఫిలిప్స్ (62, 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు)లు భారీ భాగస్వామ్యంతో కివీస్‌ను రేసులోకి తీసుకొచ్చారు. కానీ వెన్వెంటనే వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ ఒత్తిడిలో పడింది. 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులే చేసిన న్యూజిలాండ్ ప్రపంచకప్‌లో తొలి పరాజయం చవిచూసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, శామ్ కరణ్‌లు రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇంగ్లాండ్ కెప్టెన్ జోశ్ బట్లర్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.
గ్రూప్-1 రేసు రసవత్తరం! : ఐసీసీ టీ20 ప్రపంచకప్ సూపర్12 గ్రూప్-1లో సెమీఫైనల్ రేసు రక్తికట్టింది. మంగళవారం జరిగిన రెండు మ్యాచుల్లో ఇంగ్లాండ్, శ్రీలంకలు విజయం సాధించటంతో రేసు ఆసక్తికరంగా మారింది. అఫ్గనిస్థాన్‌పై శ్రీలంక 6 వికెట్ల తేడాతో గెలుపొంది సెమీఫైనల్స్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. గ్రూప్-1లో ప్రస్తుతం న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు నాలుగు మ్యాచుల్లో ఐదేసి పాయింట్లతో సమవుజ్జీలుగా నిలిచాయి. న్యూజిలాండ్ ఎదురులేని రన్‌రేట్ (2.233)తో అగ్రస్థానంలో నిలువగా.. ఇంగ్లాండ్ (0.547), ఆస్ట్రేలియా (-0.304) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. శ్రీలంక నాలుగు మ్యాచుల్లో నాలుగు పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో శ్రీలంక, అఫ్ఘనిస్థాన్‌తో ఆస్ట్రేలియా, ఐర్లాండ్‌తో న్యూజిలాండ్ తలపడనున్నాయి. చివరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్, కివీస్, ఆసీస్ విజయం సాధిస్తే.. మెరుగైన నెట్‌రన్‌రేట్‌తో తొలుత కివీస్ సెమీస్‌కు చేరుకోనుంది. రెండో స్థానం ఇంగ్లాండ్, ఆసీస్‌లు మెరుగైన నెట్రన్రేట్తోనే తేల్చుకోనున్నాయి. ఇక చివరి మ్యాచ్‌లో మూడు జట్లు సైతం పరాజయం పాలైనా.. అనూహ్యంగా శ్రీలంక సెమీస్‌కు చేరుకోనుండగా.. మెరుగైన నెట్‌రన్‌రేట్‌తో న్యూజిలాండ్ ముందంజ వేసేందుకు అవకాశం ఉంది. ఇక గ్రూప్‌లో సెమీస్ బెర్త్ ఎవరికి దక్కుతుందో తెలుసుకునేందుకు గ్రూప్-1లో చివరి మ్యాచ్ (నవంబర్ 5) వరకు ఎదురు చూడాల్సిందే.