Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బంగ్లాదేశ్‌తో సూపర్12 గ్రూప్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి రికార్డులు బద్దలు కొట్టాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. బంగ్లాదేశ్‌పై అజేయంగా 64 పరుగుల అర్థ సెంచరీతో సాధించిన విరాట్ కోహ్లి 1065 పరుగులతో మహేళ జయవర్ధనె (1016) రికార్డును అధిగమించాడు. 88.75 సగటు, 132.46 స్ట్రయిక్‌రేట్‌తో 23 ఇన్నింగ్స్‌ల్లోనే విరాట్ కోహ్లి ఈ ఘనత సాధించాడు. మహేళ జయవర్ధనె 31 ఇన్నింగ్స్‌ల్లో 39.07 సగటుతో వెయ్యి పరుగులు నమోదు చేశాడు. ఐదో టీ20 వరల్డ్‌కప్ ఆడుతున్న కోహ్లి.. 13వ అర్థ సెంచరీతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. 845 పరుగులతో 2022 టీ20 వరల్డ్‌కప్‌కు వచ్చిన కోహ్లి.. నాలుగు మ్యాచుల్లో మూడు అర్థ సెంచరీలతో ఈ రికార్డును అందుకున్నాడు. 2012లో తొలి టీ20 వరల్డ్‌కప్ ఆడిన కోహ్లి 185 పరుగులు సాధించాడు. 2014, 2016 టీ20 ప్రపంచకప్‌లో పరుగుల వరదతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. ఏడుసార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకుని మరో రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ పరుగుల వేటలో క్రిస్ గేల్ (965), రోహిత్ శర్మ (921), దిల్షాన్ (897), డెవిడ్ వార్నర్ (781) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఫీల్డింగ్ అదిరింది!
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో విజయం సాధించిన టీమ్ ఇండియా.. గెలుపునకు మించిన సానుకూల అంశాన్ని ఖాతాలో వేసుకుంది. బ్యాట్‌తో ఆశించిన విధ్వంసం సృష్టించని రోహిత్‌సేన.. బంతితోనూ ఆరంభంలో సంతృప్తికర ప్రదర్శన చేయలేదు. కానీ వర్షం విరామం అనంతరం టీమ్ ఇండియా ఫీల్డింగ్ విమర్శకుల మెప్పు సైతం పొందింది. కండ్లుచెదిరే ఫీల్డింగ్ మెరుపులతోనే టీమ్ ఇండియా ఆడిలైడ్‌లో విజయం సొంతం చేసుకోగల్గింది. విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగిన లిటన్ దాస్ వర్షం విరామం అనంతరం ఒక్క బంతినే ఎదుర్కొని నిష్క్రమించాడు. అందుకు కారణం, మిడ్ వికెట్ నుంచి కెఎల్ రాహుల్ సంధించిన డైరెక్ట్ త్రో.. లిటన్ దాస్ ఇన్నింగ్స్‌కు తెరదించింది. వర్షంతో తడిగా ఉన్న అవుట్ ఫీల్డ్‌పై భారత ఆటగాళ్లు అసమాన ఫీల్డింగ్ ప్రదర్శన చేశారు. సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, అర్షదీప్ సింగ్‌లు మూడు మెరుపు క్యాచ్‌లను అందుకున్నారు. తడి పిచ్‌తో కదలటం కాస్త ఇబ్బందిగా ఉన్న పిచ్‌పై రన్నింగ్ క్యాచ్‌లు అందుకుని మ్యాచ్‌ను భారత్ వశం చేశారు. షకిబ్, అఫిప్, యాసిర్, లిటన్ దాస్‌లు ఫీల్డర్ల జోరుతోనే నిష్క్రమించారు. కీలక సెమీఫైనల్స్ సమరానికి ముందు ఫీల్డింగ్ మెరుగుపడటం టీమ్ ఇండియా ఆత్మవిశ్వాసం పెంపొందించేదే!.