Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్‌కు చేరువైన టీమ్ ఇండియా
- విరాట్, రాహుల్ అర్థ సెంచరీలు
- రాణించిన అర్షదీప్, హార్దిక్ పాండ్య
ఆడిలైడ్‌లో బంగ్లాదేశ్‌ను బాదేసిన టీమ్ ఇండియా.. ఐసీసీ టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ బెర్త్ దాదాపుగా ఖాయం చేసుకుంది. వర్షం ఆటంకం కలిగించిన మ్యాచ్‌లో బౌలర్లు, ఫీల్డర్లు అద్భుత ప్రదర్శన చేయటంతో బంగ్లాదేశ్‌పై 5 పరుగుల తేడాతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో భారత్ విజయం సాధించింది. విరాట్ కోహ్లి (64), కెఎల్ రాహుల్ (50) అర్థ సెంచరీలతో తొలుత భారత్ 184 పరుగుల భారీ స్కోరు చేసింది. 16 ఓవర్లకు 151 పరుగులకు కుదించిన లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 145 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో సూపర్12 గ్రూప్-2లో భారత్ అగ్రస్థానం సొంతం చేసుకుంది.
నవతెలంగాణ-ఆడిలైడ్
2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ అడుగుపెట్టేసింది!. బుధవారం ఆడిలైడ్‌లో జరిగిన గ్రూప్-2 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 5 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్దతి) గెలుపొందిన టీమ్ ఇండియా ఆరు పాయింట్లతో గ్రూప్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. చివరి మ్యాచ్‌లో జింబాబ్వేతో తలపడనున్న టీమ్ ఇండియా.. ఇతర మ్యాచుల్లో అద్భుతాలు సమ్మిళి తంగా చోటుచేసుకున్నా.. సెమీస్‌కు చేరుకోవటం ఖాయమని చెప్పవచ్చు!. పేసర్లు అర్షదీప్ సింగ్ (2/38), హార్దిక్ పాండ్య (2/28)లు మెరవటంతో 151 పరుగుల కుదించిన ఛేదనలో బంగ్లాదేశ్ 145 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ లిటన్ దాస్ (60, 27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) కండ్లుచెదిరే ఇన్నింగ్స్‌తో భారత్‌కు భయపెట్టినా.. బంగ్లాదేశ్‌కు విజయాన్ని అందించలేకపోయాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 184 పరుగుల భారీ స్కోరు సాధించింది. విరాట్ కోహ్లి (64 నాటౌట్) అజేయ అర్థ సెంచరీతో ఫామ్ కొనసాగించగా.. ఓపెనర్ కెఎల్ రాహుల్ (50, 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీతో పేలవ ఫామ్‌కు గుడ్‌బై చెప్పాడు. సూర్యకుమార్ యాదవ్ (30, 16 బంతుల్లో 4 ఫోర్లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. సంప్రదాయ షాట్లతో విన్నింగ్ ఇన్నింగ్స్ నమోదు చేసిన విరాట్ కోహ్లి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు సొంతం చేసుకున్నాడు.
దాస్ దూకుడు
185 పరుగుల ఛేదనలో బంగ్లాదేశ్‌కు తిరుగులేని ఆరంభం లభించింది. పవర్‌ప్లేలో భారత పేసర్లపై బంగ్లా ఓపెనర్ లిటన్ దాస్ (70) ఏకంగా దండయాత్రే చేశాడు. భువనేశ్వర్ కుమార్‌పై బౌండరీల వర్షం కురిపించిన లిటన్ దాస్.. ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు. లిటన్ దాస్ దూకుడుతో బంగ్లాదేశ్ వేగంగా పరుగులు సాధించింది. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 21 బంతుల్లోనే దాస్ అర్థ సెంచరీ పూర్తి చేశాడు. 7 ఓవర్లలో 66/0తో ఉన్న సమయంలో వర్షం ఆటంకం కలిగించింది. లిటన్ దాస్ (59), నజ్ముల్ (7) అజేయంగా క్రీజులో నిలిచారు.
పేసర్ల ప్రతాపం
సుమారు గంట పాటు వర్షం అంతరాయం అనంతరం డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో బంగ్లాదేశ్ లక్ష్యాన్ని 16 ఓవర్లలో 151 పరుగులకు కుదించారు. పది వికెట్లు చేతిలో ఉండటంతో బంగ్లాదేశ్ ఫేవరేట్‌గా కనిపించింది. కానీ ఫీల్డింగ్, బౌలింగ్ మెరుపులతో భారత్ మ్యాచ్‌పై నెమ్మదిగా పట్టు బిగించింది. కెఎల్ రాహుల్ డైరెక్ట్ హిట్‌తో లిటన్ దాస్ (70) నిష్క్రమించగా.. బంగ్లాదేశ్ పతనం సైతం అక్కడి నుంచే మొదలైంది. మరో ఓపెనర్ నజ్ముల్ (21)ను షమి వెనక్కి పంపించాడు. షకిబ్ క్రీజులో ఉండటంతో బంగ్లా రేసులోనే నిలిచింది. వరుసగా 12, 13 ఓవర్లలో అర్షదీప్, హార్దిక్ పాండ్యలు రెండేసి వికెట్లు పడగొట్టడంతో మ్యాచ్ బారత్ గుప్పిట్లోకి వచ్చింది. అఫిఫ్ (3), షకిబ్ (13)లను అర్షదీప్.. యాసిర్ అలీ (1), మొసద్దిక్ (6)లను పాండ్య పడగొట్టారు. చివర్లో బంగ్లాదేశ్ టెయిలెండర్లు నురుల్ (25 నాటౌట్, 14 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), టస్కిన్ అహ్మద్ (12 నాటౌట్, 7 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకు తీసుకొచ్చారు. 6 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన తరుణంలో అర్షదీప్ సింగ్ యార్కర్ల వర్షంతో బంగ్లాదేశ్‌కు పరాజయాన్ని అందించాడు. 16 ఓవర్లలో బంగ్లాదేశ్ 145 పరుగులే చేసింది.
ఆ ముగ్గురి షో!
టాస్ ఓడిన టీమ్ ఇండియా తొలుత బ్యాటింగ్‌కు వచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ (2) విఫలమయ్యాడు. కెఎల్ రాహుల్ (50) సైతం ఆరంభంలో పరుగులు చేసేందుకు తంటాలు పడ్డాడు. డాట్ బాల్స్ ఎక్కువగా అయ్యాయి. మరో ఎండ్‌లో విరాట్ కోహ్లి బౌండరీలపై దృష్టి పెట్టలేదు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి భారత్ 37/1తో ఒత్తిడిలో పడింది. పవర్‌ప్లే అనంతరం రాహుల్, విరాట్ దూకుడు పెంచారు. పేలవ ఫామ్‌కు బ్రేక్ వేస్తూ మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో రాహుల్ 31 బంతుల్లో అర్థ సెంచరీ అందుకున్నాడు. విరాట్, రాహుల్ రెండో వికెట్‌కు విలువైన భాగస్వామ్యం నమోదు చేశారు. రాహుల్ నిష్క్రమించినా.. సూర్య కుమార్ యాదవ్ (30) రాకతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. సహజశైలిలో ధనాధన్ జోరందుకున్న సూర్య నాలుగు ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఏడు ఫోర్ల సాయంతో 37 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లి భారత్‌కు భారీ స్కోరు అందించాడు. హార్దిక్ పాండ్య (5), దినేశ్ కార్తీక్ (7), అక్షర్ పటేల్ (7) ధనాధన్ రేసులో నిరాశపరిచారు. రవిచంద్రన్ అశ్విన్ (13 నాటౌట్, 6 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) కోహ్లితో కలిసి మంచి ముగింపు అందించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహమూద్ (3/47), షకిబ్ అల్ హసన్ (2/33) రాణించారు.
భారత్ ఇన్నింగ్స్ : కెఎల్ రాహుల్ (సి) ముస్తాఫిజుర్ (బి) షకిబ్ అల్ హసన్ 50, రోహిత్ శర్మ (సి) యాసిర్ అలీ (బి) హసన్ మహమూద్ 2, విరాట్ కోహ్లి నాటౌట్ 64, సూర్యకుమార్ యాదవ్ (బి) షకిబ్ అల్ హసన్ 30, హార్దిక్ పాండ్య (సి) యాసిర్ అలీ (బి) హసన్ మహమూద్ 5, దినేశ్ కార్తీక్ (రనౌట్) 7, అక్షర్ పటేల్ (సి) షకిబ్ అల్ హసన్ (బి) హసన్ మహమూద్ 7, రవిచంద్రన్ అశ్విన్ నాటౌట్ 13, ఎక్స్‌ట్రాలు : 6, మొత్తం : (20 ఓవర్లలో 6 వికెట్లకు) 184.
వికెట్ల పతనం : 1-11, 2-78, 3-116, 4-130, 5-150, 6-157.
బౌలింగ్ : టస్కిన్ అహ్మద్ 4-0-15-0, షోరిఫుల్ ఇస్లాం 4-0-57-0, హసన్ మహ మూద్ 4-0-47-3, ముస్తాఫిజుర్ రెహమాన్ 4-0-31-0, షకిబ్ అల్ హసన్ 4-0-33-2.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ (లక్ష్యం :16 ఓవర్లలో 151): నజ్ముల్ శాంటో (సి) సూర్యకుమార్ (బి) మహ్మద్ షమి 21, లిటన్ దాస్ (రనౌట్) 60, షకిబ్ అల్ హసన్ (సి) దీపక్ హుడా (బి) అర్షదీప్ సింగ్ 13, అఫిఫ్ హొస్సేన్ (సి) సూర్యకుమార్ (బి) అర్షదీప్ సింగ్ 3, యాసిర్ అలీ (సి) అర్షదీప్ సింగ్ (బి) హార్దిక్ పాండ్య 1, నురుల్ హసన్ నాటౌట్ 25, మొసద్దిక్ హొస్సేన్ (బి) హార్దిక్ పాండ్య 6, టస్కిన్ అహ్మద్ నాటౌట్ 12, ఎక్స్‌ట్రాలు : 4, మొత్తం : (16 ఓవర్లలో 6 వికెట్లకు) 145.
వికెట్ల పతనం : 1-68, 2-84, 3-99, 4-100, 5-102, 6-108.
బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ 3-0-27-0, అర్షదీప్ సింగ్ 4-0-38-2, మహ్మద్ షమి 3-0-25-1, అక్షర్ పటేల్ 1-0-6-0, రవిచంద్రన్ అశ్విన్ 2-0-19-0, హార్దిక్ పాండ్య 3-0-28-2.