Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వ్యక్తిగత ప్రదర్శనలు మ్యాచుల్లో విజయాన్ని కట్టబెడతాయి. జట్టు ప్రదర్శనలు టోర్నీల్లో విజేతగా నిలిచేందుకు దోహదం చేస్తాయి. ఐసీసీ టైటిళ్లు నెగ్గేందుకు ఈ రెండింటితో పాటు వ్యూహాత్మక ఎత్తుగడలు ప్రాణ వాయువు వంటిది. తొలి రెండు అంశాల్లో టీమ్ ఇండియా మంచిగానే కనిపిస్తోన్నా.. మూడో అంశంలోనే రోహిత్, రాహుల్ ద్వయం లెక్క తప్పుతున్నట్టు అనిపిస్తోంది. అందుకు కారణం, 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో కుడి-ఎడమ కాంబినేషన్‌పై జట్టు మేనేజ్మెంట్ శ్రద్ధ వహించటం లేదు. ఇదే నాకౌట్ దశలో ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాదం పొంచి ఉంది.
- బ్యాట్‌తో, బంతితో లోపించిన లెఫ్ట్
- పొంచివున్న ప్రతికూల ప్రభావ ప్రమాదం
నవతెలంగాణ క్రీడావిభాగం
బ్యాట్‌తో గానీ, బంతితో గానీ కుడి-ఎడమ కాంబినేషన్‌ను ప్రయోగించటంలో టీమ్ ఇండియాకు మంచి రికార్డే ఉండేది. సౌరవ్ గంగూలీ, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా సహా జహీర్ ఖాన్, ఆశీష్ నెహ్రా, ఇర్షాన్ పఠాన్, ఆర్పీ సింగ్‌లు కుడి-ఎడమ కాంబినేషన్లో భారత్‌కు తిరుగులేని సక్సెస్ మంత్ర అందించారు. కానీ కీలక ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా అత్యంత ముఖ్యమైన అంశాన్ని తెలిసే విస్మరిస్తోంది. అదే కుడి-ఎడమ కాంబినేషన్. ఆస్ట్రేలియాలో జరుగుతున్న పొట్టి ప్రపంచకప్‌లో రోహిత్, రాహుల్ ద్వయం ఎందుకు ఈ విషయాన్ని విస్మరిస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది.
అంతా రైట్ హ్యాండర్లే! : భారత జట్టు బ్యాటింగ్ లైనప్‌లో ఎడమ చేతి వాటం బ్యాటర్లే లేరు. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్.. ఇలా అందరూ కుడి చేతి వాటం బ్యాటర్లు. టెయిలెండర్లతో సైతం అందరూ కుడి చేతి వాటం బ్యాటర్లు మాత్రమే ఉన్నారు. జట్టులో ఉన్న ఏకైక ఎడమ చేతి వాటం బ్యాటర్ (ఆల్‌రౌండర్) అక్షర్ పటేల్‌ను సైతం పక్కనపెట్టి కుడి చేతి వాటం బ్యాటర్ దీపక్ హుడాను ఎంచుకున్నారు. దీంతో భారత జట్టులో కుడి-ఎడమ వైవిధ్యం పూర్తిగా లేకుండా పోయింది.
పంత్ ఉన్నప్పటికీ..! : ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ప్రభావం చూపగల సత్తా ఉన్న ఆటగాడు యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్. ప్రపంచ క్రికెట్ అభిమానులు సైతం టీమ్ ఇండియా విధ్వంసకారుడి విన్యాసాల కోసం ఎదురుచూస్తున్నారు. అయినప్పటికీ.. ఫినీషర్ పేరుతో దినేశ్ కార్తీక్‌ను జట్టులో కొనసాగిస్తున్నారు. సూపర్12 గ్రూప్ దశలో భారత్ ఇప్పటి వరకు నాలుగు మ్యాచులు ఆడింది. నాలుగు మ్యాచుల్లో దినేశ్ కార్తీక్ తుది జట్టులో నిలిచాడు. రిషబ్ పంత్‌కు అవకాశమే చిక్కలేదు. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఉన్న సమయంలో అతడు అటు బ్యాట్‌తో, ఇటు బంతితో కుడి-ఎడమ కాంబినేషన్‌కు న్యాయం చేసేవాడు. ఆసియా కప్ గ్రూప్ దశలో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో రవీంద్ర జడేజాను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపించిన టీమ్ ఇండియా.. వ్యూహాత్మక ఎత్తుగడ ఫలించి మెరుపు విజయం సొంతం చేసుకుంది. జడేజాకు గాయంతో వరల్డ్‌కప్‌కు దూరం కాగా.. జట్టులో ఉన్న రిషబ్ పంత్ బెంచ్‌కు పరిమితమయ్యాడు. టాప్ ఆర్డర్లో లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ శిఖర్ ధావన్ ప్రస్తుతం వన్డే ప్రణాళికల్లోనే ఉన్నాడు. దీంతో ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో భారత బ్యాటింగ్‌కు ఎడమ చేతి వాటం బ్యాటరే కరువయ్యాడు.
ఇక బౌలింగ్ ప్రణాళికల్లో సైతం ఎడమ చేతి వాటం బౌలర్ కరువయ్యాడు. అక్షర్ పటేల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. అతడి స్థానంలో దీపక్ హుడా తుది జట్టులో చోటు సాధించాడు. దీంతో బౌలింగ్‌లో ఇప్పుడు పేసర్ అర్షదీప్ సింగ్ ఒక్కడే లెఫ్ట్ ఆర్మ్ ఆప్షన్‌గా కొనసాగుతున్నాడు. లోయర్ ఆర్డర్లో అర్షదీప్ సింగ్ ఎడమ చేతి వాటం బ్యాటర్‌గా ఉన్నప్పటకీ అతడికి బ్యాట్ పట్టే అవకాశం రాలేదు. భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి, రవిచంద్రన్ అశ్విన్ సహా హార్దిక్ పాండ్యలు కుడి చేతి వాటం బౌలర్లే కావటం విశేషం.
వ్యూహాత్మకంగా కీలకం : కుడి-ఎడమ కాంబినేషన్ వ్యూహాత్మకంగా అత్యంత కీలకం. కుడి-ఎడమ కాంబినేషన్ బ్యాటర్లు క్రీజులో ఉన్నప్పుడు ప్రత్యర్థి కెప్టెన్‌కు ఫీల్డింగ్ మొహరింపులు చికాకు తెప్పిస్తాయి. స్ట్రయిక్‌రొటేషన్ చేసినప్పుడు.. ఈ పరిస్థితి ప్రత్యర్థి జట్టును ఇబ్బంది పెట్టగలదు. ఇక ఎడమ చేతి పేసర్లు.. కుడి చేతి వాటం బ్యాటర్లకు బౌలింగ్ చేసినప్పుడు ఎదుర్కొవటం అంత సులువు కాదు. అటు బ్యాట్‌తో, ఇటు బంతితో భారత్ ఈ రెండు అదనపు ప్రయోజనాలను కోల్పోతుంది. అయితే, ఈ సంగతి జట్టు మేనేజ్మెంట్కు తెలియనిది కాదు. అయినా, రిషబ్ పంత్‌ను, అక్షర్ పటేల్‌ను బెంచ్‌కు పరిమితం చేయటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దినేశ్ కార్తీక్ ఫినిషర్‌గా భారత పిచ్‌లపై రాణించాడు. కానీ ఆస్ట్రేలియా పిచ్‌లపై నాణ్యమైన పేస్‌ను ఎదుర్కొని పరుగులు సాధించటం అతడికి సులువైన పని కాదు. ఆ విషయం గత మ్యాచుల్లోనే తేలిపోయింది. ఎదుర్కొన్న బంతులు తక్కువే అయినా.. దినేశ్ కార్తీక్ బౌండరీలు సాధించటంలో విఫలమయ్యాడు. రిషబ్ పంత్‌కు ఆసీస్ పిచ్‌లపై తిరుగులేని రికార్డుంది. భీకర పేసర్లను సైతం అతడు అలవోకగా బౌండరీలు దాటించగలడు. గ్రూప్ దశలో భారత్‌కు ఇది పెద్దగా బ్యాక్‌ఫైర్ కాకపోయినా.. సెమీఫైనల్లో బలమైన ప్రత్యర్థితో తలపడినప్పుడు కచ్చితంగా ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం పొంచి ఉంది. వ్యూహాత్మక ఎత్తుగడలో తేలిపోయి.. ఆ తర్వాత పశ్చాత్తాపం వ్యక్తం చేసి ప్రయోజనం ఉండదు. జట్టు మేనేజ్మెంట్ ఇప్పటికైనా.. రిషబ్ పంత్‌ను తుది జట్టులోకి తీసుకుని బ్యాటింగ్ విభాగాన్ని బలోపేతం చేయటంతో పాటు కుడి-ఎడమ కాంబినేషన్‌తో వ్యూహాత్మక ఎత్తుగడ సైతం ఉపయుక్తంగా ఉండగలదు.
తొలగిన వర్షం ముప్పు?
ఐసీసీ టీ20 ప్రపంచకప్ సూపర్12 గ్రూప్ దశలో భారత్ చివరి మ్యాచ్‌ను ఆదివారం ఆడనుంది. మెల్బోర్న్లో జింబాబ్వేతో భారత్ తలపడనుంది.ఎడతెరపి లేకుండా వర్షాలు కురిసిన మెల్బోర్న్లో.. ఆదివారం వాతావరణం ఆహ్లాదకరంగా ఉండనుంది. భారత్, జింబాబ్వే మ్యాచ్‌కు వర్షం ముప్పు దాదాపుగా లేనట్టేనని చెప్పవచ్చు. ఇక, ప్రస్తుతం గ్రూప్-2లో భారత్ ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గ్రూప్-2లో ఆరు జట్లు ఆదివారం బరిలో నిలువనున్నాయి. జింబాబ్వేపై విజయం సాధిస్తే భారత్ 8 పాయింట్లతో నేరుగా సెమీఫైనల్లోకి చేరుకుంటుంది. అలా కాకుండా, సంచలన ఫలితం వెలవడితే సెమీస్ సమీకరణం ఆసక్తికరంగా మారనుంది. నెదర్లాండ్స్‌తో దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌తో బంగ్లాదేశ్‌లు చివరి మ్యాచుల్లో పోటీపడనున్నాయి. నెదర్లాండ్స్ చేతిలో సఫారీలు ఓడితే.. పాక్, బంగ్లా మ్యాచ్‌లో నెగ్గిన జట్టు నేరుగా సెమీస్‌కు చేరుకుంటుంది.