Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోరాడి ఓడిన అఫ్ఘనిస్థాన్
- ఐసీసీ టీ20 ప్రపంచకప్
ఆడిలైడ్ (ఆస్ట్రేలియా) :ఐసీసీ టీ20 ప్రపంచకప్ నుంచి డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా నిష్క్రమించినట్టే!. సూపర్12 గ్రూప్-1లో చివరి మ్యాచ్‌లో అఫ్ఘనిస్థాన్‌పై ఆస్ట్రేలియా ఉత్కంఠ మ్యాచ్‌లో గెలుపొందింది. 169 పరుగుల ఛేదనలో అప్గాన్ బ్యాటర్లు చివరి వరకు పోరాడారు. 4 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించినా.. బుణాత్మక నెట్ రన్‌రేట్ నుంచి బయటకు రాలేకపోయింది. దీంతో నేడు ఇంగ్లాండ్, శ్రీలంక మ్యాచ్‌లో ఇంగ్లీశ్ జట్టు విజయం సాధిస్తే ఆతిథ్య ఆస్ట్రేలియా సూపర్12 దశ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్ ఇప్పటికే సెమీఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 8 వికెట్లకు 168 పరుగులు చేసింది. అఫ్గాన్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టారు. దీంతో ఆసీస్ ఇన్నింగ్స్ ఆశించిన వేగం అందుకోలేదు. ఓపెనర్ డెవిడ్ వార్నర్ (25, 18 బంతుల్లో 5 ఫోర్లు), మిచెల్ మార్ష్ (45, 30 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), మార్కస్ స్టోయినిస్ (25, 21 బంతుల్లో 2 సిక్స్‌లు) రాణించారు. డెత్ ఓవర్లలో టెయిలెండర్ల అండతో గ్లెన్ మాక్స్వెల్ (54 నాటౌట్, 32 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేసిన విధ్వంసక అర్థ సెంచరీ ఆసీస్‌కు మెరుగైన స్కోరు అందించింది. అఫ్గాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హాక్ (3/21), ఫజల్హాక్ ఫరూకీ (2/29)లు రాణించారు.
ఛేదనలో ఉస్మాన్ ఘని (2), మహ్మద్ నబి (1), నజీబుల్లా జద్రాన్ (0) విఫలమైనా.. అఫ్గాన్ పోరాటం అక్కడితో ఆగిపోలేదు. ఓపెనర్ రెహమానుల్లా గుర్బాజ్ (30, 17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇబ్రహీం జద్రాన్ (26, 33 బంతుల్లో 2 ఫోర్లు), గుల్బాదిన్ నయిబ్ (39, 23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఆసీస్ బౌలర్లను ప్రతిఘటించారు. చివర్లో రషీద్ ఖాన్ (48 నాటౌట్, 23 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) చిన్నపాటి సునామీ ఇన్నింగ్స్ ఆడేశాడు. రషీద్ ఖాన్ మెరుపులతో అఫ్గాన్ శిబిరంలో గెలుపు ఆశలు చిగురించాయి. చివరి ఓవర్ థ్రిల్లర్‌లో ఆసీస్ 4 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది. గ్లెన్ మాక్స్వెల్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.