Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాలుగు మ్యాచులు. మూడు విజయాలు. గ్రూప్‌లో ఇప్పటికీ అగ్రస్థానం. అయినా, సెమీఫైనల్ బెర్త్ ఇంకా ఖరారు కాలేదు. బంగ్లాదేశ్‌పై విజయంతో సెమీస్‌కు చేరువైన టీమ్ ఇండియా.. నేడు జింబాబ్వేపై విజయంతో దర్జాగా సెమీస్‌లో అడుగుపెట్టాలని చూస్తోంది. గ్రూప్-2లో నేడు ఆరు జట్లు బరిలో నిలువగా.. రెండు సెమీఫైనల్ బెర్త్‌ల కోసం మూడు జట్లు పోటీపడుతున్నాయి. గ్రూప్ దశ చివరి మ్యాచ్‌లో పరిపూర్ణ ప్రదర్శనతో సెమీఫైనల్లోకి చేరుకోవాలని రోహిత్‌సేన ఉరకలేస్తోంది. మెల్బోర్న్లో నేడు భారత్, జింబాబ్వే ఢీ.
- పరిపూర్ణ ప్రదర్శనపై భారత్ గురి
- నేడు జింబాబ్వేతో కీలక సమరం
- మధ్యాహ్నాం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-మెల్బోర్న్
టాప్ బెంగ తీరేనా?! : సూపర్12 గ్రూప్ దశలో భారత్ మూడు మ్యాచుల్లో విజయాలు సాధించింది. కానీ ఏ ఒక్క మ్యాచ్‌లో పరిపూర్ణ ప్రదర్శన కనబరచలేదు. పాక్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అసమాన ఇన్నింగ్స్‌తో బయటపడగా.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనూ దర్జాగా నెగ్గలేదు. ఇక నెదర్లాండ్స్‌పై తొలుత బ్యాటింగ్ చేసినా భారీ స్కోరు చేయటంలో విఫలమైంది. గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌లోనైనా తిరుగులేని ప్రదర్శన చేయగలిగితే సెమీఫైనల్లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగేందుకు అవకాశం ఉంటుంది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్‌లు చెరో అర్థ సెంచరీ సాధించారు. నెదర్లాండ్స్‌పై రోహిత్ శర్మ మెరువగా, బంగ్లాదేశ్‌పై రాహుల్ రాణించాడు. ఓవరాల్‌గా భారత్‌కు మెరుగైన ఆరంభాలు అందించటంలో రోహిత్, రాహుల్ జోడీ దారుణంగా విఫలమైంది. నాలుగు మ్యాచుల్లో 13 సగటు, 4.27 రన్‌రేట్‌తోనే పరుగులు సాధించారు. పాకిస్థాన్, నమీబియాలు మాత్రమే భారత్ కంటే దారుణ పరిస్థితిలో నిలిచాయి. మెల్బోర్న్లో నేడు కొత్త పిచ్ ఎదురుకానుండటంతో జింబాబ్వే పేసర్లు సైతం ఓపెనర్లకు పరీక్ష పెట్టనున్నారు. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ నేడు మెరిస్తే టాప్ ఆర్డర్లో భారత్ కష్టాలకు తెరపడినట్టే. జింబాబ్వేపై ఓపెనర్లు ఆ పని చేస్తారేమో చూడాలి.
ఇక బ్యాటింగ్ లైనప్ భారం పూర్తిగా విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ మోస్తున్నారు. ఈ ఇద్దరు నిలకడగా రాణించటంతో భారత్ కఠిన పరిస్థితుల నుంచి గట్టెక్కగల్గుతుంది. కానీ ప్రతి మ్యాచ్‌లో ఈ ఇద్దరు బ్యాటర్లే ఆదుకోవాలని ఆశించటం తగదు. ఇతర బ్యాటర్లు సైతం సమయోచితంగా బాధ్యత తీసుకోవాలి. హార్దిక్ పాండ్య నిలకడగా నిరాశపరుస్తున్నాడు. ఫినిషర్ ట్యాగ్‌తో తుది జట్టులో నిలుస్తున్న దినేశ్ కార్తీక్.. వంద శాతం విఫలమయ్యాడు. అయినా, జట్టు మేనేజ్మెంట్ అతడిపై భరోసా పెడుతోంది. కెప్టెన్, కోచ్ నమ్మకాన్ని నిలబెట్టేందుకైనా కార్తీక్ ఓ మంచి ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. ఆస్ట్రేలియాపై పిచ్‌లపై, నాణ్యమైన పేస్పై తిరుగులేని రికార్డున్న యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‌కు నేడు సైతం అవకాశం దక్కే సూచనలు లేవు. జట్టు ప్రణాళికల్లో కీలకమైన విధ్వంసకారుడు రిషబ్ పంత్‌ను పక్కనపెట్టి.. మరోసారి దినేశ్ కార్తీక్‌నే బరిలోకి దింపనున్నారు. అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌లు అంచనాలను అందుకోకపోయినా ఇద్దరూ తుది జట్టులో చోటు నిలుపుకోనున్నారు. మహ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్‌లు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.
ఆశలు లేకపోయినా..! : వీలైన మంచి ప్రదర్శన, కుదిరితే సంచలన విజయం!. ఇదీ నేడు భారత్‌తో మ్యాచ్‌లో జింబాబ్వే వ్యూహం. అగ్ర జట్టు టీమ్ ఇండియాతో మ్యాచ్‌కు ముందే జింబాబ్వే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. పాక్‌పై నెగ్గినా, నెదర్లాండ్స్ చేతిలో పరాజయం ఆ జట్టు అవకాశాలను ఆవిరి చేసింది. సికిందర్ రజా జింబాబ్వేకు నేడు కీలకం కానున్నాడు. బ్యాట్‌తో, బంతితో అతడి ప్రదర్శన జింబాబ్వే అవకాశాలను ప్రభావితం చేయనుంది. టాప్ ఆర్డర్లో వికెట్ కీపర్ బ్యాటర్ రేగిస్ చకాబ్వా వరల్డ్‌కప్‌లో నిరాశపరిచాడు. 6.42 సగటుతో 45 పరుగులే సాధించాడు. టాప్ ఆర్డర్లో వేగంగా పరుగులు సాధించగల సత్తా ఉన్న బ్యాటర్ రేగిస్. భారత్‌తో మ్యాచ్‌లో రేగిస్ మెరిస్తే జింబాబ్వే బ్యాటింగ్ కష్టాలకు తెరపడినట్టే అవుతుంది. దీంతో నేడు రేగిస్పై ఆ జట్టు ఆశలు పెట్టుకుంది. బౌలర్లు సైతం అగ్రశ్రేణి బ్యాటర్లపై మంచి ప్రదర్శన చేసేందుకు ఎదురుచూస్తున్నారు. ప్రపంచకప్‌లో ప్రదర్శన, ప్రత్యేకించి పాకిస్థాన్‌పై ఉత్కంఠ విజయంతో స్వదేశంలో అభిమానుల హృదయాలను గెల్చుకున్న జింబాబ్వే ఆటగాళ్లు.. నేడు టీమ్ ఇండియాపై పోరాట స్ఫూర్తి కనబరిచి టోర్నీని ముగించేందుకు చూస్తోంది.
పిచ్, వాతావరణం : మెల్బోర్న్లో సూపర్ 12 దశలో ఐదు మ్యాచులు షెడ్యూల్ చేశారు. తొలి మ్యాచ్‌లో మినహా అన్ని మ్యాచులకు వరుణుడు అంతరాయం కలిగించాడు. చివరి మూడు మ్యాచులు వర్షంతో తుడిచిపెట్టుకుపోగా.. ఐర్లాండ్, ఇంగ్లాండ్ మ్యాచ్ మధ్యలోనే ఆగిపోయింది. నేడు కీలక మ్యాచ్‌కు వరుణుడు లైన్ క్లియర్ చేసినట్టుగా సమాచారం. మెల్బోర్న్లో నేడు వర్ష సూచనలు లేవు. జింబాబ్వే, భారత్ మ్యాచ్‌కు కొత్త పిచ్‌ను సిద్ధం చేశారు. దీంతో పేసర్లకు పిచ్ నుంచి మంచి సహకారం లభించనుంది. బ్యాట్ మీదకు బంతి రానుండటంతో బ్యాటర్లకు సైతం పరుగుల వేట సులువుగానే ఉండనుంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం కనిపిస్తోంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి, అర్షదీప్ సింగ్.
జింబాబ్వే : వెస్లీ మాదెవరె, క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), రేగిస్ చకాబ్వా (వికెట్ కీపర్), సీన్ విలియమ్స్, సికిందర్ రజా, మిల్టన్ శుంభా, రియాన్ బర్ల్, ల్యూక్ జాంగ్వే, రిచర్డ్ నరావా, టెండారు చతారా, బ్లెస్సింగ్ ముజారబాని.
1
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్, జింబాబ్వే ముఖాముఖి ఆడనుండటం ఇదే తొలిసారి కానుంది.
48
టీ20 క్రికెట్లో 4000 పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచేందుకు విరాట్ కోహ్లి మరో 68 పరుగుల దూరంలో నిలిచాడు.
35
ఈ ఏడాది పొట్టి ఫార్మాట్లో 1000 పరుగుల మైలురాయికి సూర్యకుమార్ యాదవ్ (965) మరో 35 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ ఫార్మాట్లో మహ్మద్ రిజ్వాన్ (2021) మాత్రమే ఓ ఏడాది వెయ్యి పరుగులు సాధించిన ఘనత వహించాడు.
మెల్బోర్న్ హౌస్‌ఫుల్
జింబాబ్వే క్రికెట్ జట్టు జీవితకాల అనుభూతి ఆస్వాదించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. గ్రూప్ దశ పోరును మెల్బోర్న్లో మొదలుపెట్టిన టీమ్ ఇండియా.. నేడు జింబాబ్వేతో మ్యాచ్‌లో గ్రూప్ దశ సమరానికి ముగింపు పలికేందుకు సిద్ధమైంది. భారత్ బరిలో నిలువటంతో 90 వేలకు పైగా సామర్థ్యం కలిగిన మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో ఇప్పటికే పూర్తి సామర్థ్యం మేరకు టికెట్లు అమ్ముడుపోయినట్టు సమాచారం. దీంతో సుమారు లక్ష మంది అభిమానుల నడుమ జింబాబ్వే క్రికెట్ జట్టు తొలిసారి ఆడబోతుంది. కిక్కిరిసిన స్టేడియంలో విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్‌లు సహజంగానే ప్రత్యేక ప్రదర్శనలు చేస్తారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు!.
మూడు జట్లు.. రెండే బెర్తులు!
గ్రూప్-2 సెమీఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది. ఈ గ్రూప్ నుంచి ఇంకా ఏ జట్టు సెమీస్‌కు చేరుకోలేదు. గ్రూప్ దశ చివరి రోజు ఆరు జట్లు సైతం బరిలోకి దిగుతున్నాయి. భారత్, జింబాబ్వేలు, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌లు నేడు తలపడనున్నాయి. భారత్, సఫారీలు విజయాలు నమోదు చేస్తే.. బంగ్లాదేశ్ నెట్‌రన్‌రేట్ దృష్ట్యా ఆ జట్టు నేడు పాక్‌పై నెగ్గినా సెమీస్‌కు చేరుకోలేదు. భారత్ గెలిచి.. సఫారీలు నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోతే.. అప్పుడు పాక్‌పై విజయం బంగ్లాకు కలిసి రానుంది. ఇక బంగ్లాదేశ్‌పై పాక్ నెగ్గితే.. అప్పుడు ఆ జట్టు సెమీస్ రేసులో నిలువనుంది.
అప్పుడు సఫారీలు, భారత్ మ్యాచుల ఫలితాలు కీలకం కానున్నాయి. పాకిస్థాన్‌కు మెరుగైన నెట్‌రన్‌రేట్ ఉంది. దీంతో జింబాబ్వేపై విజయం సాధిస్తేనే భారత్ ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా సెమీస్‌లో అడుగు పెట్టగలదు. సఫారీలు ఓడి.. పాక్ నెగ్గితే.. భారత్‌తో పాటు బాబార్ గ్యాంగ్ సైతం సెమీస్‌లో అడుగుపెట్టనుంది. దక్షిణాఫ్రికా, భారత్ ఓడిపోయి.. పాకిస్థాన్ విజయం సాధించినా.. టీమ్ ఇండియా సైతం సెమీస్‌లో అడుగుపెడుతుంది.