Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జింబాబ్వేపై భారత్ ఘన విజయం
- సూర్యకుమార్, రాహుల్ అర్థ సెంచరీలు
- గ్రూప్-2లో అగ్రస్థానం సైతం సొంతం
పరిపూర్ణ ప్రదర్శన!. పొట్టి ప్రపంచకప్‌లో భారత్ మెరిసినా.. ప్రత్యర్థిపై పట్టుబిగిస్తూ అన్ని రంగాల్లో పైచేయి సాధించిన మ్యాచ్ లోటు కనిపించింది. జింబాబ్వేతో చివరి గ్రూప్ మ్యాచ్‌తో టీమ్ ఇండియా ఆ లోటు తీర్చుకుంది. సూర్యకుమార్ యాదవ్ కండ్లుచెదిరే ఇన్నింగ్స్‌తో అదరగొట్టగా, కెఎల్ రాహుల్ అర్థ సెంచరీతో ఫామ్‌లోకి వచ్చాడు. 189 పరుగుల ఛేదనలో జింబాబ్వే 115 పరుగులకే కుప్పకూలింది. 71 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. పరిపూర్ణ విజయంతో గ్రూప్-2లో అగ్రస్థానం సైతం టీమ్ ఇండియా సొంతమైంది.
నవతెలంగాణ-మెల్బోర్న్
సూర్యకుమార్ యాదవ్ (61 నాటౌట్, 25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెఎల్ రాహుల్ (51, 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్థ సెంచరీలతో చెలరేగగా..రవిచంద్రన్ అశ్విన్ (3/22), మహ్మద్ షమి (2/14) వికెట్ల వేటలో విజృంభించారు. కిక్కిరిసిన మెల్బోర్న్ మైదానంలో అటు బ్యాట్‌తో, ఇటు బంతితో తిరుగులేని ప్రదర్శన చేసిన టీమ్ ఇండియా 71 పరుగుల తేడాతో జింబాబ్వేపై ఘన విజయం సాధించింది. సూపర్12 గ్రూప్-2 చివరి మ్యాచ్‌లో ఏకపక్ష విజయం నమోదు చేసిన భారత్ గ్రూప్‌లో అగ్రస్థానంలో సెమీఫైనల్లోకి చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 186 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఛేదనలో జింబాబ్వే 17.2 ఓవర్లలోనే చేతులెత్తేసింది. 115 పరుగులకే కుప్పకూలింది. 'సూర్యకుమార్ యాదవ్' మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
సూర్య..సూపరో సూపర్ : టాస్ నెగ్గిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు ఆశించిన ఆరంభాన్ని ఇవ్వలేదు. తొలి తొమ్మిది బంతులకు భారత్ పరుగుల ఖాతా తెరువనేలేదు. రోహిత్ షాట్లకు చూసినా.. రాహుల్ ఆ ప్రయత్నమూ చేయలేదు. దీంతో పవర్‌ప్లేలో భారత్‌కు నిరాశే ఎదురైంది. రోహిత్ శర్మ (15) వికెట్ చేజార్చుకున్నాడు. ఈ సమయంలో విరాట్ కోహ్లి (26, 25 బంతుల్లో 2 ఫోర్లు), కెఎల్ రాహుల్ (51) రెండో వికెట్‌కు అర్థ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. వేగంగా ఆడలేకపోయిన విరాట్ డగౌట్‌కు చేరుకోగా.. అక్కడి నుంచి సూర్యకుమార్ షో మొదలైంది. ఓ ఎండ్‌లో రాహుల్ ఫర్వాలేదనిపించగా, సూర్య విధ్వంసం సృష్టించాడు. 23 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేశాడు. పెద్ద బౌండరీల మెల్బోర్న్లో పేసర్లు ఆఫ్లైడ్ వైడ్ బంతులేసినా.. లెగ్ సైడ్ సిక్సర్లు సంధించిన సూర్య కుమార్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 25 బంతుల్లోనే అజేయంగా 61 పరుగులు సాధించాడు. 34 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన రాహుల్ వెంటనే డగౌట్‌కు చేరుకోగా.. హార్దిక్ పాండ్య (18, 18 బంతుల్లో 2 ఫోర్లు) ఆశించిన వేగంగా ఆడలేదు. ఇతర బ్యాటర్లు తేలిపోయిన చోట.. సూర్య మరోసారి స్పెషల్ ఇన్నింగ్స్ ఆడాడు. భారత్‌కు 186 పరుగుల భారీ స్కోరు అందించాడు.
బౌలర్లు భళా : పొట్టి ప్రపంచకప్‌లో భారత బౌలర్లు తొలిసారి ప్రత్యర్థిని ఆలౌట్ చేశారు. 17.2 ఓవర్లలోనే జింబాబ్వే ఖేల్ ఖతం చేశారు. ముగ్గురు పేసర్లు భువనేశ్వర్ , అర్షదీప్ సింగ్, మహ్మద్ షమి నిప్పులు చెరిగే బంతులు సంధించటంతో జింబాబ్వే టాప్ ఆర్డర్ బెంబేలెత్తింది. వెస్లీ (0), క్రెయిగ్ (13), రేగిస్ (0), సీన్ విలియమ్స్ (11), టోనీ (5)లు ఆరంభంలోనే వికెట్ కోల్పోయారు. 36 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన జింబాబ్వేను.. సికందర్ రజా (34, 24 బంతుల్లో 3 ఫోర్లు), రియాన్ బర్ల్ (35, 22 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) ఆదుకునే ప్రయత్నం చేశారు. మిడిల్ ఆర్డర్లో విలువైన భాగస్వామ్యం నమోదు చేశారు. కానీ భారత బౌలర్ల దాడికి దాసోహం అవ్వక తప్పలేదు. అశ్విన్ మూడు వికెట్లు కూల్చగా, షమి రెండు వికెట్లు పడగొట్టాడు. 115 పరుగులకే పది వికెట్లు కోల్పోయిన జింబాబ్వే 71 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
స్కోరు వివరాలు :
భారత్ ఇన్నింగ్స్ : కెఎల్ రాహుల్ (సి) మసకద్జ (బి) సికిందర్ రజా 51, రోహిత్ శర్మ (సి) మసకద్జ (బి) ముజారబాని 15, విరాట్ కోహ్లి (సి) బర్ల్ (బి) విలియమ్స్ 26, సూర్యకుమార్ యాదవ్ నాటౌట్ 61, రిషబ్ పంత్ (సి) బర్ల్ (బి) విలియమ్స్ 3, హార్దిక్ పాండ్య (సి) ముజారబాని (బి) గరాబ 18, అక్షర్ పటేల్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 12, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 186.
వికెట్ల పతనం : 1-27, 2-87, 3-95, 4-101, 5-166.
బౌలింగ్ : రిచర్డ్ గరాబ 4-1-44-1, టెండరు చతారా 4-0-34-0, బ్లెస్సింగ్ ముజారబాని 4-0-50-1, వెల్లింగ్టన్ మసకద్జ 2-0-12-0, రియాన్ బర్ల్ 1-0-14-0, సికందర్ రజా 3-0-18-1, సీన్ విలియమ్స్ 2-0-9-2.
జింబాబ్వే ఇన్నింగ్స్ : వెస్లీ మధెవరె (సి) కోహ్లి (బి) భువనేశ్వర్ 0, క్రెయిగ్ ఎర్విన్ (సి,బి) హార్దిక్ పాండ్య 13, రేగిస్ చకబ్వా (బి) అర్షదీప్ సింగ్ 0, సీన్ విలియమ్స్ (సి) భువనేశ్వర్ (బి) మహ్మద్ షమి 11, సికందర్ రజా (సి) సూర్యకుమార్ (బి) హార్దిక్ పాండ్య 34, టోనీ మున్యోంగ (ఎల్బీ) మహ్మద్ షమి 5, రియాన్ బర్ల్ (బి) అశ్విన్ 35, వెల్లింగ్టన్ మసకద్జ (సి) రోహిత్ శర్మ (బి) అశ్విన్ 1, రిచర్డ్ గరాబ (బి) అశ్విన్ 1, టెండారు చతారా (సి,బి) అక్షర్ పటేల్ 4, బ్లెస్సింగ్ ముజారబాని నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం : (17.2 ఓవర్లలో ఆలౌట్) 115.
వికెట్ల పతనం : 1-0, 2-2, 3-28, 4-31, 5-36, 6-96, 7-104, 8-106, 9-111, 10-115.
బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ 3-1-11-1, అర్షదీప్ సింగ్ 2-0-9-1, మహ్మద్ షమి 2-0-14-2, హార్దిక్ పాండ్య 3-0-16-2, రవిచంద్రన్ అశ్విన్ 4-0-22-3, అక్షర్ పటేల్ 3.2-0-40-1.
1
టీ20 క్రికెట్లో ఓ ఏడాది వెయ్యి పరుగులు సాధించిన తొలి భారత బ్యాటర్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. జింబాబ్వేపై అజేయ 61 ఇన్నింగ్స్‌తో సూర్యకుమార్ ఈ ఏడాది పొట్టి ఫార్మాట్లో 1000 పరుగుల మైలురాయి దాటేశాడు. మహ్మద్ రిజ్వాన్ (2021) అనంతరం ఈ ఘనత సాధించిన రెండో క్రికెటర్ సూర్య.
ఇంగ్లాండ్‌తో సెమీస్‌కు సై
2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్ సూపర్12 సమరం ముగిసింది. ఆదివారం గ్రూప్-2లో మూడు మ్యాచులతో ఈ అంకానికి తెరపడింది. బుధవారం (నవంబర్ 9) నుంచి సెమీఫైనల్ సమరం షురూ కానుంది. గ్రూప్-1 నుంచి న్యూజిలాండ్, ఇంగ్లాండ్ సెమీస్‌కు చేరుకోగా.. గ్రూప్-2 నుంచి భారత్, పాకిస్థాన్‌లు అర్హత సాధించాయి. తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్, పాకిస్థాన్ (సిడ్నీ) తలపడనున్నాయి. రెండో సెమీఫైనల్లో (నవంబర్ 10) భారత్, ఇంగ్లాండ్‌లు ఆడిలైడ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.
టైటిల్ పోరు నవంబర్ 13న మెల్బోర్న్లో జరుగనుంది. సెమీఫైనల్స్ సహా ఫైనల్స్‌కు రిజర్వ్ డే సదుపాయం ఉంది. వర్షం కారణంగా మ్యాచ్‌కు ఆటంకం కలిగితే.. తర్వాతి రోజున మ్యాచ్‌ను కొనసాగిస్తారు.