Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోహిత్ చేతికి గాయం
- ప్రమాదం లేదన్న ఫిజియో
నవతెలంగాణ-ఆడిలైడ్ : గాయాల రూపంలో కీలక ఆటగాళ్లను దూరం చేసుకున్న టీమ్ ఇండియాకు ప్రతిష్టాత్మక సెమీఫైనల్స్‌కు ముందు మరో గాయం భయం పట్టుకుంది. జశ్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు గాయంతో టీ20 ప్రపంచకప్‌కు దూరమైన సంగతి తెలిసిందే. గురువారం ఆడిలైడ్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ రెండో సెమీఫైనల్లో పోటీపడనున్నాయి. సోమవారమే ఆడిలైడ్‌కు చేరుకున్న టీమ్ ఇండియా.. మంగళవారం సాధన షురూ చేసింది. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా కెప్టెన్ రోహిత్ శర్మ చేతికి గాయం కావటంతో భారత శిబిరంలో కాస్త ఆందోళన వాతావరణం కనిపించింది. ప్రస్తుతానికి రోహిత్ శర్మ మంచిగానే ఉన్నట్టు జట్టు వర్గాలు తెలిపాయి.
అందరిలో ఆందోళన : కెప్టెన్ రోహిత్ శర్మ ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ అయినప్పటికీ కఠోర సాధన చేశాడు. తొలుత నెట్స్‌లోకి వచ్చిన రోహిత్ శర్మ త్రోడౌన్ స్పెషలిస్ట్ నుంచి బంతులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో ఓ బంతి నేరుగా కుడి చేతి ముంజేయికి తగిలింది. దీంతో మరో బంతిని ఎదుర్కొకుండానే రోహిత్ శర్మ నెట్స్‌ను వీడాడు. జట్టు ఫిజియో రోహిత్ శర్మ వద్దకు చేరుకుని నొప్పి నివారణకు తగిన చికిత్స చేశాడు. మంచు ముక్కలతో ముంజేయి గాయం నొప్పి నుంచి సాంత్వన పొందిన రోహిత్ శర్మ.. ఓ 30 నిమిషాల విరామం అనంతరం తిరిగి నెట్స్‌లోకి అడుగుపెట్టాడు. ఏకబిగిన బంతులను ఎదుర్కొన్న రోహిత్ శర్మ అన్ని రకాల షాట్లను ఆడేందుకు ప్రయత్నించాడు. బంతి బలంగా తాకటంతో రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై కాస్త ఆందోళన వాతావరణం కనిపించింది. కానీ రోహిత్ శర్మ మామూలు స్థితికి చేరుకోవటంతో అందరూ ఊపిరీ పీల్చుకున్నారు.
కార్తీక్ బిజీ బిజీ : ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ మ్యాచ్‌కు టీమ్ ఇండియా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య తుది జట్టు ఎంపిక. యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్‌లు తుది జట్టులో చోటు కోసం గట్టిగా పోటీపడుతున్నారు. మ్యాచ్ ఫినీషర్‌గా దినేశ్ కార్తీక్‌కు జట్టు మేనేజ్మెంట్ ఎక్కువ అవకాశాలు కల్పించింది. కానీ వేగవంతమైన పిచ్‌లపై పేసర్లను ఎదుర్కొని బౌండరీలు బాదటంలో కార్తీక్ తేలిపోతున్నాడు. దీంతో ఈ పిచ్‌లపై రిషబ్ పంత్‌ను ఆడిస్తేనే జట్టుకు ఉపయుక్తమని విశ్లేషకులు సైతం ఓ అభిప్రాయానికి వచ్చారు. జింబాబ్వేతో మ్యాచ్‌తో పంత్‌కు చోటిచ్చారు. అయితే, ఆడిలైడ్‌లో స్క్వేర్ బౌండరీలు కాస్త దగ్గరగా ఉంటాయి. బిగ్ హిట్టర్ రిషబ్ పంత్ ఈ అనుకూలతను గొప్పగా సద్వినియోగం చేసుకోగలడు. దీంతో పంత్‌ను ఆడించాలనే డిమాండ్ ఎక్కువగా వినిపిస్తోంది. అయితే, మ్యాచ్‌కు ముందు దినేశ్ కార్తీక్ నెట్స్‌లో ఎక్కువ సమయం గడపటం విశేషం. సుమారు రెండు గంటల పాటు నెట్స్‌లో ప్రాక్టీస్ చేసిన దినేశ్ కార్తీక్ చెమటోడ్చాడు. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య సైతం ప్రాక్టీస్ సెషన్లో చెమట చిందించాడు. ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ అయినప్పటికీ.. హార్దిక్ పాండ్య సాధన చేశాడు.