Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ప్రస్థానం ఓ జట్టుది. నాకౌట్ ఆశలు ఆవిరైనా.. పరిస్థితులు కలిసి రావటంతో సెమీస్‌కు చేరుకున్న ప్రస్థానం మరో జట్టుది. ఈ రెండు జట్లు నేడు సిడ్నీలో తొలి సెమీఫైనల్లో తలపడనున్నాయి. 2022 టీ20 ప్రపంచకప్ సెమీస్ పోరు.. ప్రపంచ క్రికెట్ ప్రియులకు 1992 వన్డే వరల్డ్‌కప్ సన్నివేశాలను గుర్తు చేస్తోంది!. అందుకు కారణం, నేడు సెమీస్‌తో తలపడే జట్లు న్యూజిలాండ్, పాకిస్థాన్ కావటమే. మూడు దశాబ్దాల క్రితం సైతం కివీస్ గొప్ప ప్రదర్శనతో నాకౌట్‌కు చేరుకోగా.. పాకిస్థాన్ అసలు రేసులోనే నిలువలేదు. అయినా, అచ్చొచ్చిన పరిస్థితుల్లో నాకౌట్‌కు చేరుకుని చరిత్రే సృష్టించింది. ఇప్పుడు సిడ్నీలో కివీస్, పాక్ సెమీస్‌లో ఏం జరుగుతుందా? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఫైనల్లో తొలుత అడుగుపెట్టేదెవరో? చూడాలి.
- నేడు కివీస్, పాకిస్థాన్ సెమీస్ పోరు
- మధ్యాహ్నాం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-సిడ్నీ : 2022 టీ20 ప్రపంచకప్‌లో.. 1992 వన్డే వరల్డ్‌కప్ కథ పునరావృతం!?. మూడు దశాబ్దాల క్రితం వన్డే వరల్డ్‌కప్‌ను చూసిన వారెవరైనా ఇదే మాట అంటారేమో!. అసలు నాకౌట్‌కు చేరుకునే ఆశలు ఏమాత్రం లేని స్థితిలో పాకిస్థాన్ జట్టు మరోసారి సెమీఫైనల్స్‌కు చేరుకుంది. ఇదే సమయంలో మెరుపు ప్రదర్శనలతో న్యూజిలాండ్ దర్జాగా సెమీస్‌కు చేరుకుంది. అంతిమంగా సెమీస్‌కు ఎలా చేరుకున్నామనే అంశం ప్రధానం కాదు. సెమీస్‌లో ఎలా ఆడామనేది కీలకం. అనుకోకుండా సెమీస్‌కు చేరుకున్న పాకిస్థాన్ ఇప్పుడు అదే పనిలో నిమగమైంది. మరోవైపు వరల్డ్‌కప్ ఫైనల్స్ ఆడుతున్నా.. వైట్‌బాల్ ఫార్మాట్లో ఐసీసీ టైటిల్ న్యూజిలాండ్‌కు అందని ద్రాక్ష మాదిరిగానే మిగిలిపోయింది. 2021 ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్ గెల్చుకున్న కివీస్.. ఆ స్ఫూర్తితో పొట్టి ప్రపంచకప్ విజయానికి బాటలు వేయాలని భావిస్తోంది. పొట్టి ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్, పాకిస్థాన్ చావోరేవో తేల్చుకోనున్నాయి.
కెప్టెన్ కేన్ మెరవాలి : న్యూజిలాండ్ కథ దక్షిణాఫ్రికా తరహాలో ముగియకూడదని అనుకుంటే.. ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్స్ ఫామ్‌లోకి రావాలి. జట్టులోని ఇతర ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్న వేళ నాయకుడు భారం కాకూడదు. ధనాధన్ ఫార్మాట్లో బంతితో పరుగు తీస్తున్న విలియమ్సన్ అంతిమంగా సొంత జట్టు అవకాశాలను ప్రభావితం చేస్తున్నాడు. స్పిన్‌పై విలియమ్సన్కు తోడు డార్లీ మిచెల్ దారుణంగా ఆడుతున్నారు. దీంతో నేడు విలియమ్సన్, డార్లీ మిచెల్లపై పాకిస్థాన్ స్పిన్ అస్త్రమే ప్రయోగించనుంది. షాదాబ్ ఖాన్ సవాల్‌ను కేన్ ఎలా ఎదుర్కొంటానేది ఆసక్తిరం. యువ ఆటగాళ్లు ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్‌లు గొప్పగా ఆడుతున్నారు. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ, బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చూపిస్తున్నారు. ఓపెనర్ డెవాన్ కాన్వే సైతం ఈ ఇద్దరికి తోడైతే న్యూజిలాండ్‌కు తిరుగుండదు. లాకీ ఫెర్గుసన్, ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీలతో కూడిన పేస్ విభాగం సిడ్నీలో అత్యంత ప్రమాదకరం. మిచెల్ శాంట్నర్, ఇశ్ సోధిల రూపంలో కివీస్ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగనుంది.
ప్రమాదకర పాక్ : అనుకోకుండా, అనూహ్యంగా సెమీఫైనల్లో ప్రవేశించిన పాకిస్థాన్.. నాకౌట్ దశలో అత్యంత ప్రమాదకారి. ఆ సంగతి న్యూజిలాండ్‌కు బాగా తెలుసు. పాకిస్థాన్‌కు మిడిల్ ఆర్డర్ ప్రధాన బలహీనత. కానీ గ్రూప్ దశ చివరి మ్యాచుల్లో మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లే చెప్పుకోదగిన ఇన్నింగ్స్‌లు నమోదు చేశారు. టాప్ ఆర్డర్లో బాబర్ ఆజామ్, మహ్మద్ రిజ్వాన్‌లు కాస్త దూకుడు తగ్గారు. ఈ ఇద్దరు ఓపెనర్లుగా కాకుండా.. వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్‌కు రావటం పాక్‌కు మేలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇఫ్తీకార్ అహ్మద్, షాన్ మసూద్, మహ్మద్ హరీశ్లులు మంచి ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. భారత్ చేతిలో పరాజయం అనంతరం నలుగురు పేసర్లతో ఆడుతున్న పాకిస్థాన్ నేడు సిడ్నీలోనూ అదే ఫార్ములా వాడనుంది. షహీన్ షా అఫ్రిది, హరీశ్ రవూఫ్, నషీం షా, మహ్మద్ వసీంలతో కూడిన పేస్ దళం న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్‌కు గట్టి సవాల్ విసరనుంది. ఆఫ్ స్పిన్ ఆడటంలో పాక్ బ్యాటర్ల బలహీనత అందరికీ తెలిసిందే. ఆఫ్ స్పిన్‌తో కివీస్ చేతిలో కంగుతినకుండా ఉండేందుకు పాక్ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
పిచ్, వాతావరణం : సిడ్నీలో ఇప్పటి వరకు ఆరు మ్యాచులు జరిగాయి. ఐదు మ్యాచుల్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. సెమీస్ మ్యాచ్‌కు వరల్డ్‌కప్ సూపర్12 ఆరంభ పోరుకు వినియోగించిన పిచ్‌ను వాడనున్నారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసేందుకు ఇరు జట్లు ఆసక్తి చూపించనున్నాయి. నేడు భారీ స్కోర్లు నమోదు కావచ్చు. కివీస్ ఇక్కడ టోర్నీలో అత్యధిక స్కోరు సాధించింది. ఆ అనుకూలత కేన్ సేనకు ఉపయోగపడనుంది. సిడ్నీలో నేడు చిరుజల్లులతో కూడిన వర్షం సూచనలు ఉన్నాయి. కానీ మ్యాచ్ సమయంలో వర్షం కురిసే అవకాశాలు చాలా తక్కువ.
తుది జట్లు (అంచనా) :
న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, డార్లీ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్, ఇశ్ సోధి, లాకీ ఫెర్గుసన్.
పాకిస్థాన్ : మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), బాబర్ ఆజామ్ (కెప్టెన్), మహ్మద్ హరీశ్, షాన్ మసూద్, ఇఫ్తీకార్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, మహ్మద్ వసీం, నషీం షా, షహీన్ షా అఫ్రిది, హరీశ్ రవూఫ్.