Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మరో మెగా వార్‌కు రంగం సిద్ధం. ఆడిలైడ్ వేదికగా ఇంగ్లాండ్‌తో అమీతుమీకి టీమ్ ఇండియా సిద్ధమైంది. 15 ఏండ్ల తర్వాత పొట్టి ప్రపంచకప్‌ను మళ్లీ అందుకోవాలని తపిస్తోన్న టీమ్ ఇండియా నేడు కీలక సెమీఫైనల్ పరీక్ష ఎదుర్కొనుంది. ఆల్‌రౌండర్లతో కూడిన ఇంగ్లాండ్ సైతం మరోసారి పొట్టి కప్పు కోసం తపిస్తున్నప్పటికీ.. ఆడిలైడ్ వార్‌లో భారత్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఫైనల్లో పోరుకు పొరుగు దేశం పాకిస్థాన్ పిలుపు అందటంతో భారత్ నేడు అదనపు ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది!
- టైటిల్ పోరుపై కన్నేసిన భారత్
- ఇంగ్లాండ్‌తో భారత్ సెమీస్ నేడు
- మధ్యాహ్నాం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో.
నవతెలంగాణ-ఆడిలైడ్
అదొక్కటే ఆందోళన! :
గ్రూప్‌లో అగ్రస్థానం. దర్జాగా సెమీస్‌లో అడుగు. అయినా, టీమ్ ఇండియాలో బలమైన బలహీనతలు ఉన్నాయి. కీలక సెమీస్ పోరులో ఆ బలహీనత ప్రభావం సాధ్యమైన మేరకు తగ్గించటం అవసరం. భారత మిడిల్ ఆర్డర్ గొప్ప ఫామ్‌లో ఉంది. కానీ టాప్ ఆర్డర్ నిలకడగా చెత్త ప్రదర్శనలు చేస్తోంది. పవర్‌ప్లేలో ఓపెనర్లు కెఎల్ రాహుల్, రోహిత్ శర్మలు దారుణంగా విఫలమవుతున్నారు. ఇక కెఎల్ రాహుల్ ఏకంగా మెయిడిన్ ఓవర్లు ఆడేస్తున్నాడు. ఇప్పటివరకు ఈ జోడీ శుభారంభం చేసిందే లేదు. నేడు సెమీస్‌లో రోహిత్, రాహుల్ స్థాయికి తగ్గ ప్రదర్శనలు చేయగల్గితే భారత్ కష్టాలు తీరినట్టే. మిడిల్ ఆర్డర్లో విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య మంచి ఫామ్‌లో ఉన్నారు. ప్రధానంగా విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్ భారత బ్యాటింగ్ భారం మోస్తున్నారు. ఈ ఇద్దరు మెరిస్తేనే భారీ స్కోరు సాధ్యపడుతుంది. ఒత్తిడితో కూడిన మెగా మ్యాచుల్లో విరాట్ కోహ్లికి తిరుగులేని రికార్డుంది. పూనకమొచ్చినట్టే పరుగులు పిండుతాడు విరాట్. ఇక మిస్టర్ 360 ఆటగాడు సూర్య మరో స్పెషల్ ఇన్నింగ్స్ ఆడతాడని అభిమానులు ఆశిస్తున్నారు. హార్దిక్ పాండ్య గత మ్యాచుల్లో బౌండరీలు బాదటంలో తడబడ్డాడు. అచ్చొచ్చిన ఇంగ్లాండ్‌పై పాండ్య ప్రతాపం చూపిస్తాడేమో చూడాలి. బౌలింగ్ విభాగంలో మహ్మద్ షమి, అర్షదీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్‌లు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌లు స్పిన్నర్లుగా తుది జట్టులో నిలువనున్నారు. యుజ్వెంద్ర చాహల్‌కు అవకాశం దక్కకపోవచ్చు!.
ఇక ప్రధానంగా చర్చకు దారితీస్తున్న అంశం వికెట్ కీపర్ బ్యాటర్ ఎవరని?. జట్టు మేనేజ్మెంట్ ఎక్కువగా దినేశ్ కార్తీక్‌పై నమ్మకం ఉంచింది. కానీ ఆసీస్ పిచ్‌లపై కార్తీక్ ఆశించిన ప్రభావం చూపటం లేదు. సత్తా ఉన్న చిన్నోడు రిషబ్ పంత్‌ను తుది జట్టులోకి తీసుకోవాలనే వాదన ఎక్కువగా ఉంది. నెట్స్‌లో దినేశ్ కార్తీక్ సుదీర్ఘంగా చెమటోడ్చగా.. మ్యాచ్‌కు ముందు రోజు రిషబ్ పంత్ నెట్స్‌లో ఎక్కువ సమయం గడిపాడు. ప్రాక్టీస్ అనంతరం కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో మాట్లాడటం కనిపించింది. దీంతో నేడు రిషబ్ పంత్ అస్త్రాన్ని ఆడిలైడ్‌లో ఇంగ్లాండ్‌పై ప్రయోగించటం లాంఛనమే అనిపిస్తోంది!.
గాయాల బెడద! :
కీలక సెమీఫైనల్స్‌కు ముందు ఇంగ్లాండ్‌కు గాయాల బెడద ఎక్కువైంది. అసలే మిడిల్ ఆర్డర్ పేలవంగా రాణించగా.. కీలక బ్యాటర్ డెవిడ్ మలాన్ గాయంతో దూరమయ్యాడు. ఇక నిలకడగా జెట్ స్పీడ్‌తో బంతులేస్తున్న పేసర్ మార్క్‌వుడ్ సైతం గాయం బారిన పడ్డాడు. దీంతో భారత్‌తో మ్యాచ్‌కు ఇంగ్లాండ్ ఇద్దరు కీలక ఆటగాళ్ల సేవలు కోల్పోయింది. టాప్ ఆర్డర్లో జోశ్ బట్లర్, అలెక్స్ హేల్స్‌లు ప్రమాదకారులు. లియాం లివింగ్‌స్టోన్, మోయిన్ అలీలకు భారత్‌పై మంచి రికార్డుంది. శామ్ కరణ్ బ్యాత్తో, బంతితో విశ్వరూపం చూపిస్తున్నాడు. అతడి జోరు అలాగే సాగాలని ఇంగ్లీష్ జట్టు కోరుకుంటోంది. ఆల్‌రౌండర్లు ఉండటం ఇంగ్లాండ్‌కు అదనపు బలం. ఆదిల్ రషీద్ స్పిన్‌ను కాచుకోవటం సైతం భారత్‌కు సవాల్‌గా మారనుంది.
పిచ్ రిపోర్టు : ఆడిలైడ్‌లో నేడు వాతావరణం అనుకూలంగా ఉండనుంది. వర్షం ముప్పు లేదని చెప్పవచ్చు. ఇక సూపర్12 దశలో జరిగిన గ్రూప్ మ్యాచుల్లో సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 157. నేడు రెండో సెమీఫైనల్ మ్యాచ్‌కు సూపర్12 దశలో వాడిన పిచ్‌నే ఉపయోగించనున్నారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసేందుకు ఇరు జట్లు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇక్కడ తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు 4 మ్యాచుల్లో నెగ్గగా.. 2 మ్యాచుల్లో పరాజయం పాలయ్యాయి. చిన్న స్క్వేర్ బౌండరీలు వ్యూహాత్మకంగా ఇరు జట్లకు కీలకం కానున్నాయి.
తుది జట్లు (అంచనా) :
భారత్ : కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి, అర్షదీప్ సింగ్.
ఇంగ్లాండ్ : అలెక్స్ హేల్స్, జోశ్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియాం లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, ఫిల్ సాల్ట్, శామ్ కరణ్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, డెవిడ్ విల్లీ.
12/10
టీ20 క్రికెట్లో భారత్, ఇంగ్లాండ్ ముఖాముఖి రికార్డులో టీమ్ ఇండియాదే పైచేయి. భారత్ 12 మ్యాచుల్లో గెలుపొందగా, ఇంగ్లాండ్ జట్టు పది మ్యాచుల్లో విజయం సాధించింది.
2/1
టీ20 ఫార్మాట్లోనే కాదు ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లోనూ ఇంగ్లాండ్‌పై ముఖాముఖి రికార్డులో టీమ్ ఇండియాకే మొగ్గు. టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ రెండు సార్లు నెగ్గగా.. ఓ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పైచేయి సాధించింది.
0/11
ఆడిలైడ్ ఓవల్‌లో ఓ ఆసక్తికర గణాంకాలు. ఇక్కడ జరిగిన 11 మ్యాచుల్లో టాస్ నెగ్గిన జట్టును విజయం వరించలేదు. తొలుత బ్యాటింగ్, తొలుత బౌలింగ్‌తో సంబంధం లేకుండా టాస్ నెగ్గిన జట్లు ఓడాయి.
6/60
టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా మిడిల్ ఆర్డర్ ఆరు అర్థ శతకాల ఇన్నింగ్స్‌లు అందించింది. ఇదే సమయంలో ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ టోర్నీమెంట్లో కలిసి చేసిన పరుగులు 60.