Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్‌లో న్యూజిలాండ్‌పై గెలుపు
- రాణించిన షహీన్, రిజ్వాన్, బాబర్
అనిశ్చితి పాకిస్థాన్ ఎట్టకేలకు సాధించింది. 13 ఏండ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం సిడ్నీ సెమీఫైనల్లో న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో గెలుపొందిన పాకిస్థాన్.. ముచ్చటగా మూడోసారి పొట్టి ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది. రిజ్వాన్, బాబర్ అర్థ సెంచరీలతో సులువగా ఛేదన పూర్తి చేసిన పాకిస్థాన్.. అగ్రజట్టు న్యూజిలాండ్‌పై పైచేయి సాధించింది. మూడు క్యాచులు, రనౌట్ అవకాశాలు వృథా చేసిన న్యూజిలాండ్ భారీ మూల్యమే చెల్లించుకుంది.
నవతెలంగాణ-సిడ్నీ
సిడ్నీ స్టేడియంలో 1992 వరల్డ్‌కప్ సెమీస్ పునరావృతం!. గ్రూప్ దశలో తిరుగులేని విజయాలు సాధించిన న్యూజిలాండ్.. సెమీస్‌లో చతికిల పడింది. గ్రూప్ దశలో పేలవ ప్రదర్శన చేసిన పాకిస్థాన్ సెమీస్‌లో సూపర్‌గా రాణించింది. పాకిస్థాన్ పేసర్లు, బ్యాటర్లు రాణించిన సిడ్నీ సెమీస్ సమరంలో న్యూజిలాండ్‌కు అనూహ్య పరాభవం తప్పలేదు. 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన పాకిస్థాన్ 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. తొలుత న్యూజిలాండ్ 152/4 పరుగులు చేసింది. 19.1 ఓవర్లలోనే పాకిస్థాన్ ఛేదనను పూర్తి చేసింది. మహ్మద్ రిజ్వాన్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' గా నిలిచాడు. నేడు భారత్, ఇంగ్లాండ్ సెమీఫైనల్ విజేతతో పాకిస్థాన్ టైటిల్ పోరులో పోటీపడనుంది.
అఫ్రిది అదుర్స్ : కీలక సెమీస్‌లో టాస్ నెగ్గిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ పిచ్‌పై ఆసీస్ పేసర్లను ఎదుర్కొని 200 పరుగులు చేసిన కివీస్ బ్యాటర్లు.. పాక్ పేసర్ల ముందు తేలిపోయారు. ఓపెనర్ ఫిన్ అలెన్ (4) ఇన్నింగ్స్ మూడో బంతికే వికెట్ చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ కాన్వే (21) పవర్‌ప్లే చివరి బంతికి రనౌట్‌గా నిష్క్రమించాడు. పవర్‌ప్లేలో 38/2తో నిలిచిన న్యూజిలాండ్ ఎక్కడా దూకుడు పట్టాలు ఎక్కలేదు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (46, 42 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) వేగంగా ఆడలేకపోయాడు. గ్లెన్ ఫిలిప్స్ (6) నిరాశపరచగా.. డార్లీ మిచెల్ (53 నాటౌట్, 35 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీతో కివీస్‌కు ఓ మోస్తరు స్కోరు అందించాడు. చేతిలో వికెట్లు ఉన్నప్పటకీ డెత్ ఓవర్లలో పెద్దగా స్కోరు రాలేదు. పాక్ పేసర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి కివీస్‌ను కట్టడి చేశారు. షహీన్ షా అఫ్రిది (2/24), మహ్మద్ నవాజ్ (1/12) రాణించారు.
రిజ్వాన్ మెరిసెన్ : లక్ష్యం 153 పరుగులు. కివీస్ పేసర్లపై ఆ స్కోరు అంత సులువేమీ కాదు. టాప్‌లో ఇద్దరు అవుటైతే మిడిల్ ఆర్డర్‌పై పెద్దగా ఆశలే లేవు. ఈ పరిస్థితుల్లో ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్ (57, 43 బంతుల్లో 5 ఫోర్లు), బాబర్ ఆజామ్ (53, 42 బంతుల్లో 7 ఫోర్లు) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. కొత్త బంతితో పేసర్లపై ఎదరుదాడి చేసిన రిజ్వాన్, బాబర్ పాకిస్థాన్ ఇన్నింగ్స్‌ను ఆరంభంలో సాహాసోపేతంగా నడిపించారు. ఈ ఇద్దరు 12.4 ఓవర్లలో తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించారు. పాకిస్థాన్ విజయాన్ని లాంఛనం చేశారు. మహ్మద్ హరీశ్ (30, 26 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) సైతం విలువైన ఇన్నింగ్స్ నమోదు చేశాడు. 19.1 ఓవర్లలోనే పాకిస్థాన్ లక్ష్యం చేరుకుంది. మూడోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్లోకి ప్రవేశించింది. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ (2/33), మిచెల్ శాంట్నర్ (1/26) రాణించారు.
స్కోరు వివరాలు :
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : ఫిన్ అలెన్ (ఎల్బీ) షహీన్ 4, కాన్వే (రనౌట్) 21, విలియమ్సన్ (బి) షహీన్ 46, ఫిలిప్స్ (సి,బి) నవాజ్ 6, మిచెల్ నాటౌట్ 53, నీషమ్ నాటౌట్ 16, ఎక్స్‌ట్రాలు : 6, మొత్తం : (20 ఓవర్లలో 4 వికెట్లకు) 152.
వికెట్ల పతనం : 1-4, 2-38, 3-49, 4-117.
బౌలింగ్ : షహీన్ అఫ్రిది 4-0-24-2, నషీమ్ షా 4-0-30-0, హరీశ్ రవూఫ్ 4-0-32-0, మహ్మద్ వసీం 2-0-15-0, షాదాబ్ ఖాన్ 4-0-33-0, నవాజ్ 2-0-12-1.
భారత్ ఇన్నింగ్స్ : మహ్మద్ రిజ్వాన్ (సి) ఫిలిప్స్ (బి) బౌల్ట్ 57, బాబర్ ఆజామ్ (సి) మిచెల్ (బి) బౌల్ట్ 53, మహ్మద్ హరీశ్ (సి) అలెన్ (బి) శాంట్నర్ 30, షాన్ మసూద్ నాటౌట్ 3, ఇఫ్తీకార్ అహ్మద్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 10, మొత్తం : (19.1 ఓవర్లలో 3 వికెట్లకు) 153.
వికెట్ల పతనం : 1-105, 2-132, 3-151.
బౌలింగ్ : ట్రెంట్ బౌల్ట్ 4-0-33-2, టిమ్ సౌథీ 3.1-0-24-0, లాకీ ఫెర్గుసన్ 4-0-37-0, మిచెల్ శాంట్నర్ 4-0-26-1, ఇశ్ సోధి 4-0-26-0.