Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ గెలుపు
- సెమీస్‌లో టీమ్ ఇండియాకు భంగపాటు
- విరాట్, హార్దిక్ అర్థ శతకాలు వృథా
సెమీస్‌లో చిత్తుగా ఓడారు. ఫైనల్లో అడుగు పెట్టడంపై దృష్టి పెట్టిన భారత్.. సెమీస్‌లో నెగ్గటం మరిచింది!. ఆడిలైడ్ సెమీస్ సమరంలో ఇంగ్లాండ్ ఏకపక్ష విజయం సాధించింది. 169 పరుగుల లక్ష్యాన్ని 16 ఓవర్లలోనే ఊదేసింది. 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హార్దిక్ పాండ్య (63), విరాట్ కోహ్లి (50) అర్థ సెంచరీలు వృథా అయ్యాయి. జోశ్ బట్లర్ (80), అలెక్స్ హేల్స్ (86) అజేయ ఇన్నింగ్స్‌లతో ఇంగ్లాండ్‌ను ఫైనల్లోకి తీసుకెళ్లారు. ఆదివారం మెల్బోర్న్ మెగా వార్‌లో ఇంగ్లాండ్, పాకిస్థాన్ ఐసీసీ టీ20 ప్రపంచకప్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి. సెమీస్‌లో ఓటమితో భారత్ ఇంటిముఖం పట్టింది.
నవతెలంగాణ-ఆడిలైడ్
ఏకపక్షం. అటు బ్యాట్‌తో, ఇటు బంతితో భారత్ పూర్తిగా తేలిపోయింది. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై భారీ స్కోరు సాధించలేకపోయిన టీమ్ ఇండియా.. తర్వాత బంతితో పూర్తిగా విఫలమైంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆశలను సెమీస్‌లోనే ఆవిరి చేసుకుంది. 2020 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్ దశ నుంచే నిష్క్రమించిన టీమ్ ఇండియా.. తాజాగా 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్లోకి చేరకుండానే ఇంటిబాట పట్టింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు జోశ్ బట్లర్ (80 నాటౌట్, 49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), అలెక్స్ హేల్స్ (86 నాటౌట్, 47 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీలతో తొలి వికెట్‌కు 170 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. బట్లర్, అలెక్స్ విధ్వంసక ఇన్నింగ్స్‌లతో భారత్‌పై ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (50, 40 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్య (63, 33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్థ సెంచరీలు సాధించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్‌లు కీలక మ్యాచ్‌లో చేతులెత్తేశారు. భారత్‌పై సెమీఫైనల్లో గెలుపొందిన ఇంగ్లాండ్.. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగే ఫైనల్లో పాకిస్థాన్‌తో ఇంగ్లాండ్ తలపడనుంది. పాకిస్థాన్, ఇంగ్లాండ్‌లు ఇప్పటికే పొట్టి ప్రపంచకప్ విజయాలు సాధించటంతో.. మెల్బోర్న్లో ఎవరు నెగ్గినా రెండో టీ20 ప్రపంచకప్ టైటిలే కానుంది.
బట్లర్, అలెక్స్ ఉతికేశారు : జోశ్ బట్లర్ (80 నాటౌట్), అలెక్స్ హేల్స్ (86 నాటౌట్) భారత ఆశలను ఆవిరి చేశారు. పవర్‌ప్లేలోనే ప్రమాద ఘంటికలు మోగించిన ఇంగ్లాండ్ ఓపెనర్లు.. ఆ తర్వాత సైతం ఎక్కడా దూకుడు పట్టాలు తప్పలేదు. కెప్టెన్ జోశ్ బట్లర్, ఓపెనర్ అలెక్స్ హేల్స్ టోర్నీలో ఆశించిన ప్రదర్శన చేయలేదు. కానీ, అసలైన సమరంలో సిసలైన ఫామ్‌తో ఓపెనర్లు దండెత్తారు. అలెక్స్ హేల్స్ ఏడు సిక్సర్లతో విశ్వరూపం చూపించాడు. బట్లర్ సైతం ఎక్కడా జోరు తగ్గలేదు. పవర్‌ప్లేలో (6 ఓవర్లు) 63 పరుగులు పిండుకున్న ఈ జోడీ..భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. అలెక్స్ హేల్స్ 28 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించగా, జోశ్ బట్లర్ 36 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ చేరుకున్నాడు. 10.1 ఓవర్లలోనే 100 పరుగులు మైలురాయి చేరుకున్న ఇంగ్లాండ్.. ఆ తర్వాత ఆరు ఓవర్లలోనే లాంఛనం ముగించింది. భారత బౌలర్లలో ఎవరూ ఇంగ్లాండ్ ఓపెనర్ల దూకుడుకు అడ్డుకట్ట వేయలేకపోయారు. ఓవర్‌కు 10కి పైగా రన్‌రేట్‌తో పరుగులు పిండుకున్న బట్లర్, అలెక్స్.. 16 ఓవర్లలోనే లాంఛనం ముగించారు. ఓపెనర్ల దూకుడుతో ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం నమోదు చేసింది. భారత బౌలర్లలో ఎవరూ మెరుగైన ప్రదర్శన చేయలేదు. భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, మహ్మద్ షమిలు ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్‌లు సైతం అంచనాలను అందుకోలేదు.
విరాట్, పాండ్య మెరిసినా..! : టాస్ ఓడిన టీమ్ ఇండియా తొలుత బ్యాటింగ్‌కు వచ్చింది. నిలకడగా విఫలవుతున్న కెఎల్ రాహుల్ (5) ఇన్నింగ్స్ తొలి బంతినే బౌండరీకి తరలించాడు. అదే జోరు కొనసాగిస్తాడని ఆశిస్తే.. అభిమానులకు నిరాశే ఎదురైంది. తర్వాత ఎదుర్కొన్న 4 బంతుల్లో ఒక్క పరుగే చేసిన రాహుల్ రెండో ఓవర్లోనే నిష్క్రమించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (27, 28 బంతుల్లో 4 ఫోర్లు) దూకుడుగా ఆడేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించాడు. కానీ ఫామ్‌లో లేని రోహిత్ శర్మ బంతిని బాదటంలో తడబడ్డాడు. నాలుగు ఫోర్లు కొట్టినా.. రోహిత్ శర్మ ఒత్తిడిలో కనిపించాడు. జోర్డాన్ ఓవర్లో పుల్ షాట్‌కు ప్రయత్నించి క్యాచౌట్‌గా నిష్క్రమించాడు. విరాట్ కోహ్లి (50) మరోసారి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ (14)పై గంపెడాశలు పెట్టుకున్న టీమ్ ఇండియా.. అతడి నిష్క్రమణతో కంగుతింది. పది బంతుల్లో ఓ సిక్సర్, ఫోర్‌తో మెరిసిన సూర్యకుమార్ యాదవ్.. ఆదిల్ రషీద్ వలలో పడ్డాడు. బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లితో జతకట్టిన హార్దిక్ పాండ్య.. ఆరంభంలో నెమ్మదిగా ఆడాడు. విరాట్ కోహ్లి 39 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత గేర్ మార్చేలోపే వికెట్ కోల్పోయాడు. ఇక విరాట్ కోహ్లి డగౌట్‌కు చేరుకున్న అనంతరం.. హార్దిక్ పాండ్య ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సులువుగా సిక్సర్లు సంధించిన పాండ్య భారత్‌కు మంచి స్కోరు అందించాడు. చివర్లో బ్యాటింగ్‌కు వచ్చిన రిషబ్ పంత్ (6) ఫర్వాలేదనిపించాడు. చివరి బంతికి బౌండరీ బాదినా.. హిట్‌వికెట్ అయిన పాండ్య నాలుగు పరుగులు కోల్పోయాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ (3/43) మూడు వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
స్కోరు వివరాలు :
భారత్ ఇన్నింగ్స్ : కెఎల్ రాహుల్ (సి) జోశ్ బట్లర్ (బి) క్రిస్ వోక్స్ 5, రోహిత్ శర్మ (సి) శామ్ కరణ్ (బి) క్రిస్ జోర్డాన్ 27, విరాట్ కోహ్లి (సి) ఆదిల్ రషీద్ (బి) క్రిస్ జోర్డాన్ 50, సూర్యకుమార్ యాదవ్ (సి) ఫిల్ సాల్ట్ (బి) ఆదిల్ రషీద్ 14, హార్దిక్ పాండ్య (హిట్‌వికెట్) క్రిస్ జోర్డాన్ 63, రిషబ్ పంత్ రనౌట్ 6, అశ్విన్ నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 3, మొత్తం : (20 ఓవర్లలో 6 వికెట్లకు) 168.
వికెట్ల పతనం : 1-9, 2-56, 3-75, 4-136, 5-158, 6-168.
బౌలింగ్ : బెన్ స్టోక్స్ 2-0-18-0, క్రిస్ వోక్స్ 3-0-24-1, శామ్ కరణ్ 4-0-42-0, ఆదిల్ రషీద్ 4-0-20-1, లివింగ్‌స్టోన్ 3-0-21-0, క్రిస్ జోర్డాన్ 4-0-43-3.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ : జోశ్ బట్లర్ నాటౌట్ 80, అలెక్స్ హేల్స్ నాటౌట్ 86, ఎక్స్‌ట్రాలు : 4, మొత్తం :(16 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 170.
బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ 2-0-25-0, అర్షదీప్ సింగ్ 2-0-15-0, అక్షర్ పటేల్ 4-0-30-0, మహ్మద్ షమి 3-0-39-0, రవిచంద్రన్ అశ్విన్ 2-0-27-0, హార్దిక్ పాండ్య 3-0-34-0.
మరీ ఇంత చెత్తగానా?!
2007 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్న టీమ్ ఇండియా.. ఆ తర్వాత మళ్లీ పొట్టి కప్పును అందుకోలేదు. 2014లో ఫైనల్స్‌కు చేరుకున్నా నిరాశే ఎదురైంది. 2016లో సెమీస్‌లో అనూహ్య ఓటమి ఎదురైంది. 2021 టీ20 వరల్డ్‌కప్‌లో ఊహించని భంగపాటు ఎదురైంది. తాజాగా 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకునే ఆశలతో ఆస్ట్రేలియాకు చేరుకున్న టీమ్ ఇండియా.. నిజానికి అక్కడ అడుగుపెట్టిన నాటి నుంచే ఏడాది ప్రణాళికలను గాలికొదిలేసింది. సూపర్12 గ్రూప్ దశ మ్యాచుల నుంచి సెమీఫైనల్స్ వరకు టీమ్ ఇండియా ప్రణాళికలను అమలు చేయటంలో దారుణంగా విఫలమైంది. ఆడిలైడ్‌లో టాస్ నెగ్గిన జట్టు (11 మ్యాచులు) విజయమే సాధించలేదు. భారత్‌తో సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ఆ చెత్త రికార్డుకు చెరమగీతం పాడింది. టాస్ నెగ్గినా బ్యాటింగ్ పిచ్‌పై తొలుత భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. ప్రపంచకప్‌లో భారత్ బలహీనతలను ఎరిగిన ఇంగ్లాండ్.. అందుకే ఆడిలైడ్‌లో భారత్‌కు బ్యాటింగ్ ఇచ్చింది. ఇక జోశ్ బట్లర్ సహా అలెక్స్ హేల్స్‌కు ముకుతాడు వేసిన రికార్డు భువనేశ్వర్ కుమార్‌ది. కానీ సెమీఫైనల్లో భారత్‌కు గత గణాంకాలు సైతం సహకరించలేదు. భువనేశ్వర్ సహా ఇతర ముగ్గురు పేసర్లు తేలిపోయారు. ఈ తరహా ఓటమి అసలు ఏమాత్రం ఊహించనది.
భారత శిబిరంలో వినూత్న, విలక్షణ షాట్లతో పరుగులు పిండుకునే సత్తా ఉన్న బ్యాటర్లు ఉన్నారు. ఆధునిక క్రికెట్లో అత్యంత విధ్వంసకర బ్యాటర్లు సైతం భారత జట్టులోనే ఉన్నారు. అయినా, బ్యాట్‌తో భారత్ దారుణంగా విఫలమైంది. గత వరల్డ్‌కప్‌లో భారత్ పరాభవానికి కారణం.. బ్యాటింగ్‌లో దూకుడు లేకపోవటమేనని తేల్చారు. అందుకు విరుగుడుగా.. పవర్‌ప్లే నుంచి మిడిల్ ఓవర్ల ఆ తర్వాత డెత్ ఓవర్లలో ఎక్కడా రన్‌రేట్ తగ్గకుండా ఉండేలా బ్యాటింగ్ ఆర్డర్‌ను తయారు చేసుకున్నారు. గత టీ20 ప్రపంచకప్ పరాజయం అనంతరం ఆ ఫార్ములాను భారత్ పక్కాగా అమలు చేసింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా.. భారీ స్కోర్లు సాధించగల సత్తా ఉందని చాటుకుంది. కానీ ఆ ప్రయోగాత్మక మ్యాచులు, సిరీస్‌ల్లో ప్రస్తుతం వరల్డ్‌కప్ జట్టు ఆడలేదు. విశ్రాంతి పేరుతో టీ20 జట్టులో ఆటగాళ్లను మ్యాచ్ మ్యాచ్‌కు మార్చేశారు. చివరకు ఫామ్‌లో లేని స్టార్ ఆటగాళ్లను వరల్డ్‌కప్‌కు ఎంపిక చేశారు. ఫలితం, ఇక్కడ మనం చూసిందే. సూపర్12 గ్రూప్ దశ మ్యాచ్‌ల నుంచి ఓపెనర్లు కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ ధనాధన్ ఆరంభం ఇవ్వలేదు. పవర్‌ప్లేలో ఏకంగా మెయిడిన్ ఓవర్లు ఆడేశారు. అయినా, భారత్ టాప్ ఆర్డర్లో మార్పులు చేయడానికి ఇష్టపడలేదు. మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ మెరవటంతో భారత్ సెమీఫైనల్స్ వరకు చేరుకుంది. కానీ నాకౌట్ మ్యాచుల్లో అన్ని విభాగాలు కలిసికట్టుగా మెరిస్తేనే విజయం వరిస్తుంది. సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై తొలి పది ఓవర్ల అనంతరం 62/2తో నిలిచిన భారత్.. హార్దిక్ పాండ్య వీరోచిత ఇన్నింగ్స్‌తో 168 పరుగుల భారీ స్కోరు సాధించింది. చివరి పది ఓవర్లలో 106 పరుగులు చేసిన భారత్.. తొలి పది ఓవర్లలో టాప్ ఆర్డర్‌లోని స్టార్ క్రికెటర్ల వైఫల్యంతోనే మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఈ లోపం భారత్‌కు ముందే తెలిసినా.. సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదు. ఫలితమే, మరో ప్రపంచకప్ ఆశలు ఆవిరి. సెమీఫైనల్లో దారుణ పరాజయంతో ఇంటిముఖం. ఈ ప్రపంచకప్ వైఫల్యం సైతం భారత జట్టులో మార్పులు తీసుకురావటం అనుమానమే!.