Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్‌లో పరాజయంతో అభిమానుల నిరాశ
- బుమ్రా, జడేజా ఉంటే ఫలితం మరోలా..
మెల్బోర్న్: టీమిండియా సెమీస్‌లో ఓటమితో టైటిల్ వేట నుంచి నిష్క్రమించింది. లీగ్ దశలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, జింబాబ్వేలపై గెలిచిన టీమిండియా.. దక్షిణాఫ్రికా చేతిలో పోరాడి ఓడింది. సెమీస్‌కు ముందు వరకు టైటిల్ ఫేవరెట్‌గా ఉన్న టీమిండియా.. ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయాన్ని క్రీడాభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమితో టీమిండియా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో నిద్రపోలేదని ఓటమికి కారణాలను వెతకడం కంటే ఇంగ్లండ్ ఆటగాళ్ల ప్రదర్శన సెమీస్‌లో అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. టి20 ఫార్మాట్లో టాస్ గెలుపు మ్యాచ్ ఫలితాన్ని శాసిస్తోందని మరోసారి ఋజువు చేసింది. ఈ ఫార్మాట్లో టాస్ గెలిచిన ఏ కెప్టెన్ అయినా.. నిర్మొహమాటంగా బౌలింగ్‌కే మొగ్గు చూపుతాడనే నిజం మరోమారు తేటతెల్లమైంది. అంపైర్ల నిర్ణయాలు టీమిండియా ఫలితంపై ప్రభావాన్ని చూపాయి. ఒకటి, రెండు సందర్భాల్లో బ్యాట్, ప్యాడ్‌కు తగిలి బంతి కీపర్ చేతికి అందినా.. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ మూడో అంపైర్ నిర్ణయానికి వెళ్లపోవడంతో ఇంగ్లండ్ బ్యాటర్స్‌కు జీవనదానం లభించింది. టీమిండియా బౌలర్లలో హర్షల్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా గాయాల కారణంగా టోర్నీకి దూరం కావడంతో జట్టు ఫలితాన్ని తారుమారు చేసిందనుకోవచ్చు. విరాట్ కోహ్లి ఈ టోర్నమెంట్లో అద్భుత ఫామ్‌తో ఆకట్టుకోగా.. సూర్యకుమార్ యాదవ్ ఫర్వాలేదనిపించాడు. హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తదితర ఆటగాళ్లు ఆరు మ్యాచులు ఆడి ఒక్క మ్యాచ్‌లో మాత్రమే అర్ధసెంచరీకి పైచిలుకు పరుగులు చేశారు. ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమయ్యారు. ఎడమచేతి వాటం కోటాలో తుదిజట్టులో చోటు దక్కించుకున్న అక్షర్ పటేల్ జాస్ బట్లర్-అలెక్స్ హేల్స్‌ను ఔట్ చేయలేకపోయాడు. రవీంద్ర జడేజా, బుమ్రా జట్టులో ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిమానుల ఆశ. దీపక్ హుడాకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం దక్కలేదు.
వికెట్ కీపర్లు దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్ బ్యాటింగ్‌లో చేతులెత్తేశారు. 2007లో తొలిసారి టి20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా.. ఈసారి తప్పక కప్ గెలుస్తుందని అభిమానులు పెట్టుకున్న భారీ ఆశలు అడియాశలయ్యాయి. 15ఏళ్ల తర్వాత టీమిండియా మరోసారి కప్ గెలవకున్నా.. గత ఏడాది యుఏఇ వేదికగా జరిగిన టి20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌కు చేరకున్నా.. ఈసారి సెమీస్‌కు చేరి గత టోర్నీకంటే మెరుగైన ప్రదర్శన కనబరిచిందని అనుకోవచ్చు. 2022 టి20 ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చిన ఆస్ట్రేలియా జట్టు ఏకంగా లీగ్‌లో ఓడితే.. నెదర్లాండ్ జట్టు దక్షిణాఫ్రికాపై, జింబాబ్వేజట్టు పాకిస్తాన్‌ను ఓడించడం ఈ టోర్నీలో చెప్పుకోదగ్గ మ్యాచ్‌లే.