Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పేసర్లు, యంగ్ టాలెంట్‌ను నడిపిస్తున్న నాయకుడు బాబర్ ఆజాం. వైట్‌బాల్ ఫార్మాట్లో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర జట్టుకు సారథ్యం వహిస్తున్న నాయకుడు జోశ్ బట్లర్. మూడు దశాబ్దాల క్రితం ఇమ్రాన్ ఖాన్ సృష్టింంచిన మ్యాజిక్‌ను పునసృష్టి చేసేందుకు బాబర్ ఆజామ్ ఎదురు చూస్తున్నాడు. ఇయాన్ మోర్గాన్ అనంతరం ఇంగ్లీష్ క్రికెట్ జట్టులో మరో కొత్త శకం ఆరంభానికి నాంది వేసేందుకు సిద్ధమవుతున్నాడు జోశ్ బట్లర్. అటు బాబర్, ఇటు బట్లర్ కన్నేసింది ఐసీసీ టీ20 ప్రపంచకప్‌పైనే. పొట్టి కప్పు విజయంతో స్వదేశంలో నవ శకానికి నాంది పలికేందుకు ఎదురుచూస్తున్న ఇంగ్లాండ్, పాకిస్థాన్‌లు నేడు మెల్బోర్న్ మహా ఫైట్‌కు సిద్ధమయ్యాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరు నేడు.
- ట్రోఫీ వేటలో పాకిస్థాన్, ఇంగ్లాండ్
- ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్ నేడు
- మధ్యాహ్నాం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-మెల్బోర్న్
పొట్టి ప్రపంచకప్ పోరాటం చివరి అంకానికి చేరుకుంది. తొలి రౌండ్, సూపర్12, సెమీఫైనల్స్ ముగిశాయి. ఇక మిగిలింది టైటిల్ పోరే. అనిశ్చితికి మారుపేరు పాకిస్థాన్, వైట్‌బాల్‌లో విధ్వంసకర జట్టు ఇంగ్లాండ్ మెగా వార్‌కు సిద్ధమయ్యాయి. నేడు మెల్బోర్న్ వేదికగా ఇంగ్లాండ్, పాకిస్థాన్‌లు టీ20 ప్రపంచకప్ ఫైనల్లో తలపడనున్నాయి. 1992 ప్రపంచకప్‌ను పాకిస్థాన్ నెగ్గిన పరిస్థితులే ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఏమాత్రం అంచనాలు లేని ఇమ్రాన్‌ఖాన్ జట్టు గ్రూప్ దశలో చచ్చీచడి సెమీస్‌కు చేరుకుంది. అందుకు ఎన్నో సమీకరణాలు కలిసొచ్చాయి. గ్రూప్ దశలో అద్భుతంగా రాణించిన జట్టు న్యూజిలాండ్‌ను సెమీఫైనల్లో ఓడించి ఫైనల్స్‌కు చేరుకుంది. ఆ తర్వాత చరిత్ర అందరికి తెలిసిందే. 2022 టీ20 ప్రపంచకప్‌కు సైతం బాబర్ ఆజాం సేన పెద్దగా అంచనాలు లేకుండానే వచ్చింది. సూపర్12 దశలో పెద్దగా మెప్పించలేదు. ఇతర జట్ల స్వయంకృతంతో సెమీస్ బెర్త్ సొంతం చేసుకుంది. సెమీస్‌లో మళ్లీ అగ్ర జట్టు న్యూజిలాండ్‌ను అలవోకగా ఓడించింది. ఫైనల్లోకి చేరుకుంది. మరి ఇప్పుడు బాబర్ ఆజాం సైతం ఇమ్రాన్ ఖాన్ సాధించిన చరిత్రను పునసృష్టిస్తాడా? ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఇయాన్ మోర్గాన్ ఇంగ్లాండ్ క్రికెట్లో సరికొత్త చరిత్రను లిఖించాడు. వైట్‌బాల్ జట్టును ముందుండి నడిపించి.. నవ శకానికి తెరతీశాడు. 2019 వన్డే వరల్డ్‌కప్ విజయాన్ని అందించిన మోర్గాన్ శకం ముగిసింది. పగ్గాలు జోశ్ బట్లర్ చేతికి చిక్కాయి. మోర్గాన్ బాటలోనే జట్టును దూకుడుగా నడిపిస్తున్న జోశ్ బట్లర్.. పొట్టి ప్రపంచకప్ విజయంతో తన శకానికి బాటలు వేయాలని చూస్తున్నాడు. జోశ్ బట్లర్, బాబర్ ఆజాంలలో ఎవరు పొట్టి కప్పు నెగ్గుతారు? ఎవరు నవ చరిత్ర సృష్టిస్తారో? నేడు తేలనుంది.
ఇంగ్లాండ్‌కు ఎదురుందా? : టైటిల్ పోరుకు ఇంగ్లాండ్ టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. భీకర ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్ మ్యాచ్‌కు ముందు ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఇంగ్లాండ్‌కు ఎదురులేదు. ఇక బ్యాట్‌తో, బంతితో స్పెషలిస్ట్ తరహా ప్రదర్శన చేయగల ఆల్‌రౌండర్లు ఇంగ్లాండ్‌కు అదనపు బలం. సెమీస్‌లో భారత్‌పై పది వికెట్ల తేడాతో గెలుపొందిన ఇంగ్లాండ్.. నేడు టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఓపెనర్లు జోశ్ బట్లర్, అలెక్స్ హేల్స్‌లు ఫైనల్లో కీలకం కానున్నారు. ఇక మెగా ఈవెంట్లో తుది జట్టులో మార్పులు చేయని ఏకైక జట్టు ఇంగ్లాండ్. ఈ సమీకరణమే ఆ జట్టు ఫామ్‌ను తెలియజేస్తుంది. మలాన్, మార్క్‌వుడ్‌లకు గాయాలతో సెమీస్‌లో మాత్రం రెండు మార్పులు చేసింది. టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ డెవిడ్ మలాన్, స్పీడ్‌స్టర్ మార్క్‌వుడ్‌లు శనివారం ప్రాక్టీస్‌లో చురుగ్గా కనిపించారు. పూర్తి స్థాయిలో సాధన చేశారు. ఈ ఇద్దరు ఫిట్నెస్ సాధిస్తే నేరుగా తుది జట్టులోకి రానున్నారు. లేదంటే ఫిల్ సాల్ట్ టాప్ ఆర్డర్లో చోటు దక్కించుకోనున్నాడు. భారత్‌పై సెమీస్‌లో మూడు కీలక వికెట్లు కూల్చిన క్రిస్ జోర్డాన్‌తో డెవిడ్ విల్లే సైతం మార్క్‌వుడ్ స్థానం కోసం పోటీపడుతున్నాడు. మెల్బోర్న్లో స్క్వేర్ బౌండరీలు కాస్త చిన్నవిగా ఉంటాయి. దీంతో స్వింగ్‌తో చెలరేగే డెవిడ్ విల్లే ఉపయుక్తమైన పేసరని మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అన్నాడు. జోఫ్రా ఆర్చర్ గైర్హాజరీలో శామ్ కరణ్ రూపంలో ఇంగ్లాండ్ సరికొత్త అస్త్రం దొరికింది. కచ్చితమైన లెంగ్త్‌లతో పదునైన బంతులు సంధిస్తున్న కరణ్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. లియాం లివింగ్‌స్టోన్, బెన్ స్టోక్స్‌లు సైతం మంచి ఫామ్‌లో ఉన్నారు. ఆదిల్ రషీద్, క్రిస్ వోక్స్‌కు తోడు హ్యారీ బ్రూక్స్, మోయిన్ అలీ ఫైనల్లో సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నారు.
చరిత్ర పాక్‌వైపు! : టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌కు ముందు చరిత్ర పాకిస్థాన్‌కు అనుకూలంగా ఉంది. సరిగ్గా 30 ఏండ్ల క్రితం ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ జట్టు ప్రస్థానం తరహాలోనే ప్రస్తుత బాబర్ ఆజామ్ కెప్టెన్సీలోని పాక్ నడుస్తోంది. దీంతో ఆ స్ఫూర్తితో ఇప్పుడూ ప్రపంచకప్ సొంతం చేసుకునే ఉత్సాహంలో పాకిస్థాన్ ఉరకలేస్తోంది. షహీన్ షా అఫ్రిది, నషీం షా, హరీశ్ రవూఫ్‌ల రూపంలో పాకిస్థాన్‌కు ప్రపంచ శ్రేణి పేసర్లు ఉన్నారు. ఎటువంటి బ్యాటింగ్ లైనప్‌ను అయినా.. ఈ పేస్ త్రయం ముప్పుతిప్పలు పెట్టగలదు. షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్ స్పిన్ మాయజాలం ప్రత్యర్థులకు గుబులు రేపుతోంది. బౌలింగ్ పరంగా చూసినప్పుడు పాకిస్థాన్ శిబిరంలో ఎటువంటి లోపాలు ఎత్తిచూపలేం. కానీ బ్యాటింగ్‌లోనే ఆ జట్టు కష్టాలు కనిపిస్తున్నాయి. ఓపెనర్లు బాబర్ ఆజామ్, మహ్మద్ రిజ్వాన్‌లు మినహా ఎవరిపైనా అంచనాలు పెట్టుకునే పరిస్థితి లేదు. న్యూజిలాండ్‌తో సెమీఫైనల్లో బాబర్, రిజ్వాన్‌లు ఫామ్‌లోకి రావటం పాక్‌కు గొప్ప ఊరట. టాప్ ఆర్డర్లో ఈ ఇద్దరు మెరిస్తే పాక్‌కు పెద్దగా బెంగ అవసరం లేదు. మహ్మద్ హరీశ్ నం.3 బ్యాటర్‌గా కొత్తగా కనిపిస్తున్నాడు. 160కి పైగా స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధిస్తున్నాడు. ఇఫ్తీకార్ అహ్మద్, మసూద్ షాలు సైతం సందర్భోచితంగా రాణిస్తున్నారు. కానీ మెగా ఫైనల్లో ఎవరో ఒకరు మెరిస్తే సరిపోదు. కలిసికట్టుగా రాణించాల్సి ఉంటుంది. ఛేదనలో టాప్ ఆర్డర్ కుప్పకూలితే పాకిస్థాన్ పరిస్థితి ఆందోళనకరమే కానుంది.
పిచ్ రిపోర్ట్ : సూపర్12 దశలో మెల్బోర్న్లో మ్యాచులు ఎక్కువగా వర్షం ప్రభావితమైనవే. నేడు మ్యాచ్‌కు సైతం వరుణుడు రానున్నాడు!. పిచ్‌పై మంచి పచ్చిక కనిపిస్తోంది. 160 పరుగులు ఛేదించటం అంత సులువు కాదు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ సహా ఐర్లాండ్‌తో ఇంగ్లాండ్ మ్యాచ్ ఈ సంగతి నిరూపించింది. టైటిల్ పోరులో కఠిన పరిస్థితులకు ఒత్తిడి తోడవుతుంది. పిచ్‌ను గత 24 గంటలుగా కవర్లలో కప్పి ఉంచారు. పవర్‌ప్లేలో పేసర్లు వికెట్ల వేటలో మునిగి తేలనున్నారు. టాస్ నెగ్గిన తొలుత బౌలింగ్ చేసేందుకు మొగ్గుచూపవచ్చు!.
తుది జట్లు (అంచనా)
ఇంగ్లాండ్ : జోశ్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), అలెక్స్ హేల్స్, డెవిడ్ మలాన్/ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, లియాం లివింగ్‌స్టోన్, మోయిన్ అలీ, శామ్ కరణ్, క్రిస్ వోక్స్, మార్క్‌వుడ్/క్రిస్ జోర్డాన్/డెవిడ్ విల్లే, ఆదిల్ రషీద్.
పాకిస్థాన్ : బాబర్ ఆజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ హరీశ్, షాన్ మసూద్, ఇఫ్తీకార్ అహ్మద్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, మహ్మద్ వసీం, నషీం షా, హరీశ్ రవూఫ్, షహీన్ షా అఫ్రిది.
వర్షం ముప్పు
ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరుకు వరుణ గండం పొంచి ఉంది. టైటిల్ పోరుకు ఐసీసీ ఓ రోజు రిజర్వ్ చేసి ఉంచింది. కానీ రిజర్వ్ డే (సోమవారం) సైతం మెల్బోర్న్ వాతావరణం మెరుగ్గా కనిపించటం లేదు. వాతావరణ సమాచారం ప్రకారం నేడు మెల్బోర్న్లో మ్యాచ్ జరుగటం కష్టమే. నిబంధనల ప్రకారం కుదించిన ఓవర్లతోనైనా మ్యాచ్‌ను మొదలుపెట్టేందుకు సాయంత్రం 5 గంటల వరకు గడువు ఉంది. ఒకవేళ సగం మ్యాచ్ జరిగి.. మిగతా మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగిస్తే తర్వాతి రోజును మ్యాచ్‌ను కొనసాగిస్తారు. అసలు ఆటే జరగకపోతే.. రిజర్వ్ డే రోజున పూర్తి మ్యాచ్‌ను నిర్వహిస్తారు. గ్రూప్ దశలో మెల్బోర్న్లో ఏకంగా ఐదు మ్యాచులు వర్షం ప్రభావం బారిన పడ్డాయి. ,నాలుగు మ్యాచులు రద్దు కాగా, ఓ మ్యాచ్‌లో ఫలితాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో తేల్చాల్చిన పరిస్థితి ఏర్పడింది.