Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జట్టులో ఎంతటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ, ప్రపంచ మేటీ బ్యాటర్లు, బౌలర్లును కలిగి ఉన్నప్పటికీ.. మెగా ఈవెంట్లలో అటువంటి జట్లు బోల్తాపడటం చూస్తూనే ఉన్నాం. జట్టులో అందుబాటులో ఉన్న ప్రతిభను సమయానుకూలంగా సద్వినియోగం చేసుకుని, సరైన సమయంలో సిసలైన అస్త్రాన్ని సంధించగల వ్యూహ చతురత ఉన్న నాయకుడే విజయాన్ని అందుకోగలడు. ప్రపంచ క్రికెట్లో ఎందరో సారథులు ఈ విషయాన్ని నిరూపితం చేశారు. ప్రపంచకప్ టైటిల్ కరువులో ఉన్న ఇంగ్లాండ్‌కు ఇయాన్ మోర్గాన్ సరికొత్త మార్గం చూపించాడు. జట్టును దూకుడు పట్టాలు ఎక్కించి స్వదేశంలో వన్డే వరల్డ్‌కప్ విజయం దిశగా నడిపించాడు. అతడి శకం ముగిసీ ముగియగానే.. ఇంగ్లాండ్ క్రికెట్లో మరో వెలుగు. అతడే జోశ్ బట్లర్. ఇయాన్ మోర్గాన్ అనంతరం వైట్‌బాల్ ఫార్మాట్ జట్టు పగ్గాలు అందుకున్న బట్లర్.. దూకుడు దారిలోనే మరింత స్వేచ్ఛ కల్పించి నడిపించాడు. ఈ ఫార్ములా ఇంగ్లాండ్ డ్రెస్సింగ్‌రూమ్‌లో తారకమంత్రంగా పని చేసింది. పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టగా.. అదే ఇంగ్లాండ్ కేవలం పవర్‌ప్లేలోనే ఆరు ఫోర్లు, ఓ సిక్సర్ బాదేసింది. రెండు జట్ల మధ్య వ్యూహాత్మక ప్రణాళికల్లో ప్రధాన వ్యత్యాసం ఇదే. స్వల్ప స్కోర్ల థ్రిల్లర్‌లో ఇంగ్లాండ్‌కు విజయాన్ని సులభతరం చేసింది పవర్‌ప్లేలో లభించిన బౌండరీలే!.
ఇక ఇంగ్లాండ్ మ్యాచ్ విన్నర్లు అందుబాటులో లేరని దిగులు పడలేదు. జోఫ్రా ఆర్చర్ లేకపోయినా.. శామ్ కరణ్ రూపంలో సరికొత్త అస్త్రాన్ని ప్రత్యర్థులపై ప్రయోగించింది. శామ్ కరణ్ కచ్చితమైన లెంగ్త్‌లతో, బ్యాటర్ల బాడీ లాంగ్వేజ్‌ను అంచనా వేస్తూ బంతులు సంధించాడు. ఫైనల్లో కీలక మూడు వికెట్లు పడగొట్టిన కరణ్.. మ్యాన్ ఆఫ్ ది టోర్నీగా సైతం నిలిచాడు. ఇక మెగా మ్యాచులు అంటే బెన్ స్టోక్స్ పూనకాలు వస్తాయేమో!. ఇంగ్లాండ్ చారిత్రక విజయాల నుంచి బెన్ స్టోక్స్‌ను వేరుగా చూడలేం. ఆదివారం పాక్‌తో ఫైనల్లోనూ స్టోక్స్ ఆ తరహా ప్రదర్శనే చేశాడు. బట్లర్, హేల్స్, సాల్ట్ నిష్క్రమించిన తరుణంలో ఒత్తిడి పెరుగగా.. గొప్ప ఇన్నింగ్స్‌తో ఒత్తిడిని ప్రత్యర్థిపైకి తోసేశాడు. ఇక టీ20 ప్రపంచకప్ అసాంతం తుది జట్టులో (గాయాల కారణంగా సెమీస్‌లో మార్పులు)లో మార్పులు చేయలేదు. ఆటగాళ్లపై విశ్వాసం నిలిపిన బట్లర్.. ప్రతిఫలంగా టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్నాడు. మోర్గాన్ నడిపిన దూకుడు పట్టాలపైనే.. స్వేచ్ఛగా ఆడగలిగే ఫార్ములా జోడించిన జోశ్ బట్లర్ ఇంగ్లాండ్ క్రికెట్లో మరో శకారంభానికి నాంది పలికాడు. బట్లర్ ఇంగ్లాండ్ తదుపరి లక్ష్యం 2023 వన్డే వరల్డ్‌కప్ అని చెప్పనక్కర్లేదు!.