Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ చీఫ్ సెలక్టర్ శ్రీకాంత్ సూచన
న్యూఢిల్లీ : 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని హార్దిక్ పాండ్యకు పొట్టి ఫార్మాట్ పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని మాజీ చీఫ్ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ వ్యాఖ్యానించారు. 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ పది వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. మరో టీ20 వరల్డ్‌కప్‌కు రెండేండ్ల సమయం ఉంది. రేపటి నుంచి మొదలుపెడితే 2024లో కొట్టగలమని శ్రీకాంత్ అన్నాడు. ' ప్రపంచకప్ కోసం రెండేండ్ల ముందుగానే సన్నద్ధం అవ్వాలి. ఓ ఏడాది పూర్తిగా ప్రయోగాలు చేయాలి. ఎలా కావాలంటే అలా ప్రయోగాలు చేయాలి. పొరపాట్లను దిద్దుకోవాలి. మరో ఏడాది అనుకున్న జట్టును తయారు చేసి.. ప్రణాళికలను అమలు చేయాలి. గుజరాత్ టైటాన్స్‌కు ఐపీఎల్ టైటిల్ అందించిన హార్దిక్ పాండ్యకు కెప్టెన్సీ ఇవ్వాలి. పాండ్యకు గాయాల బెడద ఉంది కదా అంటే.. నాయకత్వ గ్రూప్‌ను సిద్ధం చేయాలి. ఓపెనర్లు అనగానే ఓ గ్రూప్‌ను ఏ విధంగా అనుకుంటామో.. అదే విధంగా కెప్టెన్సీకి సైతం ఇద్దరిని సిద్ధం చేయాలి. 1983, 2011, 2007 ప్రపంచకప్ విజయాలకు కారణం జట్టులో ఆల్‌రౌండర్లు. ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్లు, సెమీ ఆల్‌రౌండర్లు జట్టుకు అత్యంత కీలకం. ఆ దిశగా జట్టుకు ప్రణాళికలు రూపొందించుకోవాలని' శ్రీకాంత్ సూచించారు. నేనే చీఫ్ సెలక్టర్‌ను ఐతే నేరుగా హార్దిక్ పాండ్యకు కెప్టెన్సీ ఇచ్చేవాడిని. అదే తొలి ప్రాధాన్యంగా ఉండేదని చిక్కా అన్నారు.