Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెడ్, వైట్ బాల్ ఫార్మాట్లపై అనిల్ కుంబ్లే
బెంగళూర్ : ఆధునిక క్రికెట్లో అగ్రజట్టుగా నిలిచేందుకు, ఐసీసీ ఈవెంట్లలో విజయాలు అందుకునేందుకు భిన్న ఫార్మాట్లకు భిన్న జట్లను బరిలోకి నిలపటమే ఉత్తమ మార్గమని భారత మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే అభిప్రాయం వ్యక్తపరిచారు. ఇంగ్లాండ్ వైట్‌బాల్ ఫార్మాట్‌కు, రెడ్‌బాల్ ఫార్మాట్‌కు భిన్నమైన సారథ్యం కలిగి ఉంది. వన్డే, టీ20లకు జోశ్ బట్లర్ కెప్టెన్ కాగా, మాథ్యూ మాట్ చీఫ్ కోచ్. ఇక టెస్టుల్లో బెన్ స్టోక్స్ కెప్టెన్ కాగా, చీఫ్ కోచ్‌గా బ్రెండన్ మెక్‌కలమ్ ఉన్నారు. భారత్ సైతం ఇటువంటి పద్దతినే అనుసరించాలని కుంబ్లే అన్నారు. ' భారత్‌కు కచ్చితంగా వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు జట్లు అవసరం. పొట్టి ఫార్మాట్లో టీ20 స్పెషలిస్ట్‌లు కావాలి. ఈ విషయాన్ని ఇంగ్లాండ్‌తో పాటు గత టీ20 ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా నిరూపించాయి. అందుకోసం బ్యాటింగ్ ఆర్డర్లో ఆల్రౌండర్లను తీసుకోవాలి. ఇంగ్లాండ్‌కు ఏడో స్థానంలో లియాం లివింగ్‌స్టోన్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అదే ఆస్ట్రేలియాకు ఆరో స్థానంలో మార్కస్ స్టోయినిస్ బ్యాటింగ్ చేస్తున్నాడు. మరే జట్టుకు లోయర్ ఆర్డర్లో ఇంతటి విధ్వంసకర బ్యాటర్లు అందుబాటులో లేరు. అటువంటి జట్టును తయారు చేయాలి. అటువంటి ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలి' అని కుంబ్లే తెలిపారు. అయితే, భిన్న ఫార్మాట్లకు భిన్న నైపుణ్యాలను కలిగివున్న ఆటగాళ్లను తీసుకునే అంశంలో ఏకీభవించిన కుంబ్లే.. కెప్టెన్, కోచ్‌లు సైతం వేర్వేరుగా ఉండాల్సిన అవసరం లేదని అన్నాడు. 'ప్రతి ఫార్మాట్‌కు భిన్న కెప్టెన్, కోచ్ ఉండాల్సిన అవసరం లేదు. ఎటువంటి జట్టును ఎంచుకున్నామనే అంశంపై అది ఆధారపడి ఉంటుంది. ఆటగాళ్లను ఎంచుకున్న తర్వాత ఆ బృందానికి నాయకత్వం ఎవరు వహించాలి, ఎటువంటి సహాయక సిబ్బంది సహకారం ఉండాలని ఆలోచన చేయాలని కుంబ్లే వ్యాఖ్యానించారు.