Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైట్‌బాల్ క్రికెట్లో ఇంగ్లాండ్ నయా పంథా
- ఏకకాలంలో వన్డే, టీ20 వరల్డ్‌కప్ విజేత
తొంగి తొంగి నక్కి నక్కి కాదే.. తొక్కుకుంటూ పోవాలె. ఎదురొచ్చినోన్ని ఏసుకుంటూ పోవాలి. ప్రపంచవ్యాప్తంగా పాపులర్‌గా మారిన ఈ డైలాగ్.. వైట్ బాల్ క్రికెట్లో ఇంగ్లాండ్ నయా పంథాకు చక్కగా నప్పుతుంది. ఆత్మరక్షణ, ఓటమి భయం ఏమాత్రం కనిపించని ఇంగ్లాండ్ పొట్టి క్రికెట్ ఫార్ములాలో.. అంతా దూకుడు, ఎదురుదాడి మంత్రమే. ఇయాన్ మోర్గాన్ సారథ్యంలో ఈ ఫార్ములాతో 2019 వన్డే వరల్డ్‌కప్ నెగ్గిన ఇంగ్లాండ్.. తాజాగా జోశ్ బట్లర్ కెప్టెన్సీలో అదే ఫార్ములాతో టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఏకకాలంలో వన్డే, టీ20 ప్రపంచకప్ చాంపియన్ నిలిచిన ఏకైక జట్టు ఇంగ్లాండ్ ప్రపంచ క్రికెట్‌కు నేర్పిన పాఠం 'భయమెరుగని దూకుడు'!.
నవతెలంగాణ క్రీడావిభాగం
6 సంవత్సరాలు. వైట్‌బాల్ ఫార్మాట్ క్రికెట్లో ఇంగ్లాండ్ ఆధిపత్య శకానికి. ఇయాన్ మోర్గాన్ సారథ్యంలో 2016 టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరుకున్న ఇంగ్లాండ్.. మూడేండ్ల తర్వాత స్వదేశంలో 2019 వన్డే వరల్డ్‌కప్‌ను గెల్చుకుంది. 2021 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్‌కు చేరుకున్న ఇంగ్లాండ్.. తాజాగా 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ రెండో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీలో నెగ్గినా.. జోశ్ బట్లర్ సారథ్యంలో టైటిల్ సాధించినా.. ఆ జట్టు ఫార్ములా ఒక్కటే. అదే భయమెరుగని దూకుడు. ప్రత్యర్థిపై ఎదురుదాడి, దూకుడు అంశంలో మరో జట్టు ఇంగ్లాండ్ దరిదాపుల్లోకి రాలేదు. వైట్‌బాల్ క్రికెట్లో (వన్డే, టీ20)లో వ్యూహం, ప్రణాళికల్లో విప్లవాత్మక మార్పులు చేసుకున్న ఇంగ్లాండ్ ఆధునిక వైట్‌బాల్ క్రికెట్ గతిని శాసిస్తోంది. దూకుడు, బిగ్ హిట్టింగ్, ఎదురుదాడి వ్యూహా చతురతకు ప్రమాణాలు నిర్దేశించిన ఇంగ్లాండ్.. ప్రపంచ క్రికెట్లో దూకుడుకు పర్యాయపదంగా మారింది.
దూకుడుగానే ఆడటం
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు 2019, 2022 ప్రపంచకప్ విజయాలు సాధించింది. వన్డే, టీ20 ఫార్మాట్లో ఇంగ్లాండ్ అత్యంత ప్రమాదకర జట్టుగా రూపొందింది. ఇదేమీ రాత్రికి రాత్రి జరిగిన రూపాంతరం కాదు. 2015 వన్డే వరల్డ్‌కప్ పరాజయం అనంతరం మొదలైన ప్రక్షాళన ప్రక్రియ.. ఆ జట్టును నేడు వైట్‌బాల్ ఫార్మాట్లో ఎదురులేని శక్తిగా నిలబెట్టింది. దూకుడుగానే ఆడాలి, ఫలితం గురించి ఆలోచన వద్దు. ఎదురుదాడి చేస్తూ ఆడినా.. ఓడితే ఆ ఫలితాన్ని స్వీకరించు, పొరపాట్లు దిద్దుకో. కానీ దూకుడుగా ఆడటంలో ఎటువంటి మార్పు ఉండకూడదు. ఇదీ క్లుప్తంగా ఇంగ్లాండ్ క్రికెట్ వ్యూహం. 'గత కొన్నేండ్లలో ఇంగ్లాండ్ జట్టు ఆలోచన విధానం ఎంతగానో మార్పు చెందింది. ఆత్మరక్షణ ధోరణిలో ఇంగ్లాండ్ ఎన్నడూ ఆడలేదు. ఆ ఆటతీరు మాకు ఫలితాలు అందించింది. మా పరిమితులు, పరిధులు దాటేందుకు ఇంగ్లాండ్ నిరంతరం ప్రయత్నించింది. స్వేచ్ఛగా, ధైర్యంగా ఆడటంలో మాకు మించిన జట్టు మరోకొటి లేదు. దూకుడుగా ఆడుతూ ఫలితం ఎలా వచ్చినా మేము స్వీకరించేందుకు సిద్ధపడే ఉన్నాం. ఈ ప్రక్రియలో తడబాటు ఉండొచ్చు. కానీ మా పద్దతులపై జట్టుగా విశ్వాసం ఉంచాం. మెగా మ్యాచుల్లోనూ ఇంగ్లాండ్ ఇదే ఫార్ములా నమ్ముతుంది' అని ఇంగ్లాండ్ కెప్టెన్ జోశ్ బట్లర్ వ్యాఖ్యానించాడు.
సాహాసోపేత నిర్ణయాలు
2015 ప్రపంచకప్ పరాజయం అనంతరం దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఇంగ్లాండ్ క్రికెట్ పలు సాహాసోపేత నిర్ణయాలు తీసుకుంది. ఆ కఠిన నిర్ణయాలే ఇప్పుడు ఇంగ్లాండ్‌కు ఫలాలు ఇస్తున్నాయి. రెడ్‌బాల్ (టెస్టులు), వైట్‌బాల్ (వన్డే, టీ20) ఫార్మాట్లలో కెప్టెన్లను భిన్న ఆటగాళ్లను ఎంచుకుంది. సహాయక సిబ్బంది (చీఫ్ కోచ్)ని సైతం ఫార్మాట్‌కు అనుగుణంగా భిన్నమైన బృందాలను ఎంచుకుంది. సంప్రదాయ క్రికెట్ వాదులకు ఇది ఏమాత్రం రుచించదు. కానీ వేగంగా మార్పు చెందుతున్న ఆధునిక క్రికెట్లో స్టార్డమ్ ఉన్న ఆటగాళ్లతో అన్ని ఫార్మాట్లకు వెళ్లకుండా.. జట్టు ప్రణాళికలకు తగిన ఆటగాళ్లను తగిన ఫార్మాట్‌కు ఎంచుకుంది. ఇంగ్లాండ్‌కు ఇప్పుడు రెడ్‌బాల్, వైట్‌బాల్ ఫార్మాట్లో పూర్తిగా భిన్నమైన జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ అంశంలో మిగతా జట్లు సమీప దూరంలో సైతం లేవు. అందుకే ప్రపంచ క్రికెట్లో ఇతర జట్లకు ఇంగ్లాండ్ భిన్నమైన స్థితిలో నిలిచింది. ఏక కాలంలో వన్డే, టీ20 వరల్డ్‌కప్ చాంపియన్‌గా నిలువగలిగింది.