Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2024 టీ20 ప్రపంచకప్ దిశగా అడుగు
- దూకుడు, భయమెరుగని క్రికెట్‌కు అవకాశం
ఆటలో గెలుపు ఓటములు సహజం. గెలిచినా, ఓడినా ప్రయాణం అక్కడితో ఆగిపోదు. లోటు పాట్లు సరిదిద్దుకుంటూ ముందుకు సాగాల్సిందే. రెండేండ్లలో రెండు టీ20 ప్రపంచకప్‌లలో విఫలమైన టీమ్ ఇండియా.. 2024 టీ20 ప్రపంచకప్ దిశగా రెండేండ్ల ముందుగానే అడుగులు వేసేందుకు సిద్ధమైంది. యువ నాయకత్వం, భయమెరుగని క్రికెట్, ఎదురుదాడి, దూకుడుతో కూడిన జట్టును నిర్మించేందుకు న్యూజిలాండ్‌తో సిరీస్ నుంచే అడుగులు పడనున్నాయి. భారత్, న్యూజిలాండ్ టీ20 సిరీస్ నవంబర్ 18 నుంచి ఆరంభం.
నవతెలంగాణ క్రీడావిభాగం
ఓపెనింగ్‌లో దూకుడు
కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఓపెనింగ్ జోడీ దూకుడుగా ఆడలేదని ఎవరూ చెప్పలేరు. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఈ జోడీ ధనాధన్ ఆడగలదనీ ఎవరూ చెప్పలేరు. 2022 టీ20 ప్రపంచకప్‌లో పవర్‌ప్లేలో అత్యల్ప స్కోర్లు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. అందుకు కారణం ఓపెనింగ్ జోడీ. తొలుత భారత్ ఓపెనింగ్ జోడీని జాగ్రత్తగా ఎంచుకోవాలి. వికెట్ కాపాడుకుంటూ ఎదురుదాడి చేసే ఓపెనర్లు అవసరం లేదు. 20 ఓవర్ల ఆటలో ప్రతి రెండు ఓవర్లకు ఓ వికెట్ కోల్పోయినా పెద్ద సమస్య ఉండదు. వేగంగా పరుగులు చేయటమే ఇక్కడ ప్రధానం. ప్రస్తుత సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ మినహా ఇషాన్ కిషన్, సంజు శాంసన్‌లు దూకుడుకు పెట్టింది పేరు. ఈ సిరీస్‌లో ఈ ముగ్గురుతో కూడిన ఓపెనింగ్ ప్రయోగం చేయనున్నారు. భయమెరుగని బ్రాండ్ క్రికెట్ ఆడటంలో సంజు శాంసన్, ఇషాన్ కిషన్ సిద్దహస్తులు. సంప్రదాయ ఆటతో దూకుడుగా పరుగులు పిండుకోవటంలో గిల్ మేటి. వచ్చే ప్రపంచకప్‌కు అవసరమైన ఓపెనింగ్ జోడీ కోసం భారత్ ఇక్కడి నుంచే అన్వేషణ మొదలుపెట్టనుంది.
లెఫ్ట్ కాంబినేషన్ కోసం..! :
వ్యూహాత్మకంగా జట్టులో కుడి-ఎడమ కాంబినేషన్ సైతం ఎంతో అవసరం. 2022 టీ20 ప్రపంచకప్‌లో భారత్ ఈ అంశంలో అత్యంత వెనుకబడింది. దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్‌లలో ఎవరిని ఆడించాలనే ఆలోచనలో.. ఇద్దరి సేవలను సరిగా వినియోగించుకోలేదు. ప్రస్తుతం రిషబ్ పంత్‌కు తోడు ఇషాన్ కిషన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ సైతం ఎడమ చేతి వాటం బ్యాటరే. దీంతో బ్యాటింగ్ లైనప్‌లో కనీసం ముగ్గురు బ్యాటర్లు ఎడమ చేతి వాటం వారున్నారు. టెయిలెండర్లలో అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్‌లు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు. బంతితోనూ కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్‌లు ఎడమ చేతి బౌలర్లు కావటం విశేషం. దీంతో అటు బంతితో, ఇటు బ్యాట్‌తో కుడి-ఎడమ కాంబినేషన్ కుదురుతుంది. వ్యూహాత్మకంగా ప్రత్యర్థి జట్టును ఇరకాటంలో పడేందుకు ఈ కుడి-ఎడమ కాంబినేషన్ ఉపయుక్తంగా ఉంటుంది.
ఆల్‌రౌండర్లు అవసరం
వైట్‌బాల్ ఫార్మాట్లో, ప్రత్యేకించి టీ20 క్రికెట్లో స్పెషలిస్ట్ క్రికెటర్ల కంటే ఆల్‌రౌండర్లు ఎక్కువ మంది అవసరం. భారత క్రికెట్లో స్పెషలిస్ట్ క్రికెటర్లు (బ్యాటర్ లేదా బౌలర్) ఎక్కువగా కనిపిస్తే.. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి జట్లలో ఆల్‌రౌండర్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. ప్రధానంగా పేస్ ఆల్‌రౌండర్లు జట్టులో ఉంటే ఆ అనుకూలతే వేరు. హార్దిక్ పాండ్య జట్టులో సమతూకం తీసుకొస్తున్నాడు. హార్థిక్ మాదిరి మరో పేస్ ఆల్‌రౌండర్ భారత జట్టులో తుది జట్టు సమతూకం మరింత వైవిధ్యంగా ఉంటుంది. టీ20 క్రికెట్లో ఎదురుదాడి చేస్తూ, భయం లేకుండా బ్యాటింగ్ చేసేందుకు లోతైన బ్యాటింగ్ లైనప్ అవసరం. జట్టులో ఆల్‌రౌండర్లు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. 7, 8వ స్థానాల్లో సైతం దూకుడుగా ఆడగల బ్యాటర్లు అందుబాటులో ఉండగలరు. ప్రస్తుత కివీస్‌తో సిరీస్‌లో హార్దిక్ పాండ్య ఒక్కడే పేస్ ఆల్‌రౌండర్. వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడాలు స్పిన్ ఆల్రౌండర్లుగా జట్టులో ఉన్నారు. పేస్ ఆల్‌రౌండర్ కోసం భారత దేశవాళీ క్రికెట్లో (వెంకటేశ్ అయ్యర్ మాదిరి) అన్వేషించాలి.
పదునైన పేస్ బౌలర్లు
జట్టులో పదునైన పేసర్లు సైతం అత్యవసరం. స్వల్ప స్కోర్లను భారత్ నిలకడగా కాపాడుకోవటం లేదు. అదే పాకిస్థాన్ వంటి జట్లు బలమైన పేస్ బౌలింగ్‌తో స్వల్ప స్కోర్లను కాపాడుకుంటున్నాయి. భారత్ సైతం వేగంగా బంతులేస్తూ, పేస్ కలిగిన బౌలర్ల కోసం గట్టి ప్రయత్నం చేయాలి. కివీస్‌తో సిరీస్‌లో యువ స్పీడ్‌స్టర్ ఉమ్రాన్ మాలిక్‌కు చోటు దక్కింది. వేగంగా బంతులు వేయగల్గుతున్న ఉమ్రాన్ మాలిక్లో పేస్ కాస్త లోపించింది. బౌలింగ్ కోచ్ ఆ దిశగా దృష్టి సారిస్తే ఉమ్రాన్ మాలిక్ వచ్చే టీ20 ప్రపంచకప్ సమయానికి ప్రపంచ శ్రేణి పేసర్‌గా రూపుదిద్దుకోగలడు. అర్షదీప్ సింగ్ డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా మెరిశాడు, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్‌లను మేటి పేసర్లుగా తీర్చిదిద్దేందుకు సహాయక సిబ్బంది కృషి చేయాలి.
ప్రాక్టీస్ ప్రాక్టీస్
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమ్ ఇండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లో బిజీగా గడిపారు. రెండు రోజుల క్రితమే న్యూజిలాండ్‌లో అడుగుపెట్టిన టీమ్ ఇండియా క్రికెటర్లు..బుధవారం వెల్లింగ్టన్ స్టేడియంలో సుదీర్ఘంగా ప్రాక్టీస్ చేశారు. కెప్టెన్ హార్దిక్ పాండ్య, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్‌లు ప్రాక్టీస్‌లో సందడి చేశారు. తాత్కాలిక చీఫ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రాక్టీస్ సెషన్‌ను పర్యవేక్షించాడు. అంతకముందు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్తో కలిసి భారత కెప్టెన్ హార్దిక్ పాండ్య సిరీస్ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొ న్నాడు. శుక్రవారం తొలి టీ20 జరుగనుండగా.. నేడు సైతం భారత జట్టు కఠోరంగా ప్రాక్టీస్ సెషన్లో చెమటోడ్చనుంది.