Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మిస్టర్ 360 మరో మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. తనదైన మార్క్ షాట్లతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అజేయ శతకంతో కదం తొక్కిన సూర్యకుమార్ యాదవ్ రెండో టీ20లో భారత్‌కు ఘన విజయాన్ని అందించాడు. సూర్య ప్రతాపంతో తొలుత భారత్ 191 పరుగుల భారీ స్కోరు చేయగా.. ఛేదనలో న్యూజిలాండ్ 126 పరుగులకే కుప్పకూలింది. 65 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్ టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.
- అజేయ శతకంతో చెలరేగిన సూర్య
- కివీస్‌పై భారత్ ఘన విజయం
నవతెలంగాణ-మౌంట్ మౌంగానురు
భారత్ ఘన విజయం. 65 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఏకపక్ష విజయం. సూర్యకుమార్ యాదవ్ (111 నాటౌట్, 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లు) అజేయ శతకంతో చెలరేగాడు. తనకే సాధ్యమైన విలక్షణ షాట్లతో న్యూజిలాండ్ బౌలర్లపై విశ్వరూపం చూపించాడు. సూర్యకుమార్ యాదవ్ శతక షోకు ఇషాన్ కిషన్ (36, 31 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) సైతం రాణించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది. ఛేదనలో న్యూజిలాండ్ చేతులెత్తేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (61, 52 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీ సాధించినా మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా రాణించలేదు. దీపక్ హుడా (4/10), సిరాజ్ (2/24), చాహల్ (2/26) వికెట్ల వేటలో జోరందుకోగా.. 18.5 ఓవర్లలో 126 పరుగులకే న్యూజిలాండ్ కుప్పకూలింది. సూర్యకుమార్ యాదవ్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. చివరి మ్యాచ్ మంగళవారం నేపియర్‌లో జరుగనుంది.
సూర్య శతక జోరు : టాస్ నెగ్గిన న్యూజిలాండ్ తొలుత భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. ఇషాన్ కిషన్ (36, 31 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్)కు తోడు రిషబ్ పంత్ (6, 13 బంతుల్లో 1 ఫోర్) ఓపెనర్‌గా వచ్చాడు. బౌండరీతో మొదలుపెట్టిన పంత్ దూకుడు కొనసాగించలేకపోయాడు. ఇషాన్ కిషన్ వరుస బౌండరీలతో కదం తొక్కాడు. పవర్‌ప్లేలో కివీస్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. తడబడిన పంత్ వికెట్ల వెనకాల సౌథీ మెరుపు క్యాచ్‌కు నిష్క్రమించగా.. అక్కడ్నుంచి సూర్య షో మొదలైంది. 32 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన సూర్యకుమార్ యాదవ్.. ఆ తర్వాత మరో 50 పరుగులు చేసేందుకు 17 బంతులే ఆడాడు. 49 బంతుల్లోనే శతకబాదిన సూర్యకుమార్ యాదవ్ టీ20 కెరీర్లో రెండో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. ఆఫ్‌స్టంప్‌కు ఆవల పడిన బంతులను అలవోకగా లెగ్ సైడ్ సిక్సర్లు సంధించిన సూర్య.. అవే బంతులను హాఫ్ స్కూప్ షాట్లతో థర్డ్‌మ్యాన్ దిశగా బౌండరీ బాది అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇక శ్రేయస్ అయ్యర్ (13), హార్దిక్ పాండ్య (13)లు ఆశించిన ప్రదర్శన చేయలేదు. చివరి ఓవర్లో సూర్యకు అవకాశం దక్కలేదు. ఇదే సమయంలో హార్దిక్, హుడా,సుందర్ వికెట్లతో సౌథీ హ్యాట్రిక్ వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. కివీస్ బౌలర్లలో సౌథీ (3/34), ఫెర్గుసన్ (2/49)లు రాణించారు.
బౌలర్ల మెరుపుల్ : 192 పరుగుల ఛేదనలో న్యూజిలాండ్ చేతులెత్తేసింది. ఇన్నింగ్స్ రెండో బంతికే ప్రమాదకర ఫిన్ అలెన్ (0)ను అవుట్ చేసిన భువనేశ్వర్ కుమార్ భారత్‌కు బ్రేక్ ఇచ్చాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే (25, 22 బంతుల్లో 3 ఫోర్లు) సైతం దూకుడుగా ఆడలేకపోయాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (61, 52 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీ సాధించాడు. కానీ పరిస్థితులకు తగినట్టు ఆడటంలో కేన్ ఆడటంలో పూర్తిగా విఫలమయ్యాడు. గ్లెన్ ఫిలిప్స్ (12)ను చాహల్ వెనక్కి పంపటంతో మ్యాచ్ పూర్తిగా భారత్ చేతుల్లోకి వచ్చింది. స్పిన్నర్ దీపక్ హుడా నాలుగు వికెట్లతో కివీస్‌ను విలవిల్లాడించగా, చాహల్ రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఏ దశలో లక్ష్యం దిశగా దూసుకెళ్లని న్యూజిలాండ్ 18.5 ఓవర్లలోనే కుప్పకూలింది. 65 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది.
స్కోరు వివరాలు :
భారత్ ఇన్నింగ్స్ : ఇషాన్ కిషన్ (సి) సౌథీ (బి) సోధి 36, రిషబ్ పంత్ (సి) సౌథీ (బి) ఫెర్గుసన్ 6, సూర్యకుమార్ యాదవ్ నాటౌట్ 111, శ్రేయస్ అయ్యర్ (హిట్ వికెట్) ఫెర్గుసన్ 13, హార్దిక్ పాండ్య (సి) నీషమ్ (బి) సౌథీ 13, దీపక్ హుడా (సి) ఫెర్గుసన్ (బి) సౌథీ 0, వాషింగ్టన్ సుందర్ (సి) నీషమ్ (బి) సౌథీ 0, భువనేశ్వర్ కుమార్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 11, మొత్తం : (20 ఓవర్లలో 6 వికెట్లకు) 191.
వికెట్ల పతనం : 1-36, 2-69, 3-108, 4-190, 5-190, 6-190.
బౌలింగ్ : సౌథీ 4-0-34-3, మిల్నె 4-0-35-0, ఫెర్గుసన్ 4-0-49-2, నీషమ్ 1-0-9-0, నీషమ్ 1-0-9-0, సోధి 4-0-35-1, శాంట్నర్ 3-0-27-0.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ : అలెన్ (సి) అర్షదీప్ (బి) భువనేశ్వర్ 0, కాన్వే (సి) అర్షదీప్ (బి) వాషింగ్టన్ సుందర్ 25, విలియమ్సన్ (బి) సిరాజ్ 61, గ్లెన్ ఫిలిప్స్ (బి) చాహల్ 12, డార్లీ మిచెల్ (సి) శ్రేయస్ (బి) హుడా 10, నీషమ్ (సి) కిషన్ (బి) చాహల్ 0, మిచెల్ శాంట్నర్ (సి,బి) సిరాజ్ 2, మిల్నె (సి) అర్షదీప్ (బి) హుడా 6, సోధి (స్టంప్డ్) పంత్ (బి) హుడా 1, సౌథీ (సి) పంత్ (బి) హుడా 0, ఫెర్గుసన్ నాటౌటటÊ 1, ఎక్స్‌ట్రాలు : 8, మొత్తం : (18.5 ఓవర్లలో ఆలౌట్) 126.
వికెట్ల పతనం : 1-0, 2-56, 3-69, 4-88, 5-89, 6-99, 7-124, 8-125, 9-125, 10-126.
బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ 3-0-12-1, అర్షదీప్ సింగ్ 3-0-29-0, మహ్మద్ సిరాజ్ 4-1-24-2, వాషింగ్టన్ సుందర్ 2-0-24-1, యుజ్వెంద్ర చాహల్ 4-0-26-2, దీపక్ హుడా 2.5-0-10-4.