Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇప్పటివరకు టీవీ తెరలపైనే వీక్షించిన ఫార్ములా రేసు పోటీలను మన హైదరాబాద్‌లోనే ప్రత్యక్ష్యంగా వీక్షించే అనుభూతి పొందేందుకు రెండు రోజులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులకు ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) స్ట్రీట్ సర్క్యూట్ మిశ్రమ భావోద్వేగం మిగిల్చింది. ఐఆర్ఎల్ స్ట్రీట్ సర్క్యూట్లో ఫార్ములా 3 కార్ల రేసు కోసం అభిమానులు రెండు రోజులు ఎదురుచూసినా నిరాశే ఎదురైంది. చెన్నై డ్రైవర్‌కు ప్రమాదంతో ఫార్ములా 3 పోటీలను రద్దు చేశారు. దీంతో జెకెటైర్స్ నిర్వహించిన ఫార్ములా 4 రేసుతోనే సంతృప్తి చెందాల్సి వచ్చింది.
- అర్హత పోటీలో చెన్నై డ్రైవర్‌కు ప్రమాదం
- ఐఆర్ఎల్ స్ట్రీట్ సర్క్యూట్ రేసు రద్దు
- జెకెటైర్స్ ఫార్ములా 4 రేసుతో కాస్త ఊరట
నవతెలంగాణ-హైదరాబాద్ : ఇండియన్ రేసింగ్ లీగ్ స్ట్రీట్ సర్క్యూట్. అంతర్జాతీయ ఆటోమోబైల్ సమాఖ్య అధికారిక గుర్తింపు లభించిన ఫార్ములా 3 రేసు. గంటకు 250 కిమీ వేగంతో దూసుకెళ్లే వోల్ఫ్ రేసింగ్ జిబి08 థండర్ కార్లను ప్రత్యక్ష్యంగా చూసేందుకు ఎదురుచూసిన అభిమానులకు నిర్వాహకులు భంగపాటు మిగిల్చారు. తొలి రోజు ప్రాక్టీస్‌కు పరిమితమైన ఆరు జట్ల డ్రైవర్లు.. ఆదివారం రోజు పోటీలను మధ్యాహ్నాం తర్వాతే షురూ చేశారు. అర్హత పోటీలోనే అపశృతి చోటుచేసుకోవటంతో స్ట్రీట్ సర్క్యూట్ ఫార్ములా 3 రేసును రద్దు చేశారు. డిసెంబర్ 10-11న హైదరాబాద్‌లోనే జరగాల్సిన ఇండియన్ రేసింగ్ లీగ్ స్ట్రీట్ సర్క్యూట్ ఫైనల్స్‌ను ఇక్కడే నిర్వహిస్తారా? లేదా మద్రాస్‌కు తరలిస్తారా అనే అంశంపై నిర్వాహకులు స్పష్టత ఇవ్వలేదు.
చెన్నై డ్రైవర్‌కు ప్రమాదం : ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) స్ట్రీట్ సర్క్యూట్ షెడ్యూల్ ప్రకారం శని, ఆది వారాలు నిర్వహించాలి. హుస్సేన్‌సాగర్ తీరంలో 2.7 కిమీ నూతన ట్రాక్‌ను శనివారం ఉదయమే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎక్కువగా మలుపులు ఉన్న ట్రాక్‌పై అవగాహన లేకుండా రేసులోకి దిగేందుకు డ్రైవర్లు నిరాకరించారు. దీంతో తొలిరోజు కేవలం ప్రాక్టీస్‌కు పరిమితం అయ్యారు. ఆదివారం రోజు ఫార్ములా 3 రేసు నిర్వహిస్తామని నిర్వాహకులు తొలుత ప్రకటించారు. మధ్యాహ్నాం అనంతరం ఫార్ములా 3 రేసు అర్హత పోటీ నిర్వహించారు. ఆ రేసులో చెన్నై టర్బోరైడర్స్ మహిళా డ్రైవర్ నికోల్ హవార్డె ప్రమాదానికి గురైంది. గోవా ఏసెస్ కారుతో చెన్నై టర్బోరైడర్ కారు ఢకొీట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గురైనది చెన్నై టర్బోరైడర్కు చెందిన భారత డ్రైవర్ విష్ణు ప్రసాద్ అని కూడా వార్తలొచ్చాయి. చెన్నై టర్బోరైడర్స్ నుంచి ఈ విషయంలో అధికారికంగా ఎటువంటి వివరణ రాలేదు. ప్రమాదానికి గురైన డ్రైవర్‌కు అపోలో హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు.
రేసుకు నిరాకరణ? : అర్హత రేసులో చెన్నై టర్బోరైడర్స్, గోవా ఏసెస్ కార్లు ఢకొీన్నాయి. దీంతో ఇండియన్ రేసింగ్ లీగ్‌ను కొనసాగించటంపై ఆరు జట్ల యాజమాన్యాలతో ఐఆర్ఎల్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఎన్నో మలుపులు ఉన్న హైదరాబాద్ ట్రాక్‌లో ప్రత్యేకించి టర్న్ నం.14 వద్ద సమస్యలపై ఆరు జట్ల డ్రైవర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. అర్హత రేసు సహా స్ప్రింట్ రేసులో బరిలోకి దిగేందుకు డ్రైవర్లు నిరాకరించారు. దీంతో మరో దారి లేని పరిస్థితుల్లో ఇండియన్ రేసింగ్ లీగ్ స్ట్రీట్ సర్క్యూట్ ఫార్ములా 3 రేసును రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఫార్ములా 3 రేసు రద్దుతో, సాయంత్రం జరగాల్సిన మీడియా సమావేశాన్ని సైతం రద్దు చేశారు. ' ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా ఓ ప్రమాదం చోటు చేసుకుంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, ఎఫ్ఎంఎస్సీఐ, ఆర్పీఎల్ సాంకేతిక బృందం సూచనలతో రేసును వాయిదా వేస్తున్నాం. ప్రమాద ఘటనపై టెక్నికల్ కమిటీ విచారణ జరుపుతోంది' అని ఇండియన్ రేసింగ్ లీగ్ అధికారి ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు.
జెకె టైర్స్ రేసుతో ఊరట : ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) స్ట్రీట్ సర్క్యూట్‌కు మద్దతుగా సంఘీభావ రేసు నిర్వహించేందుకు జెకె టైర్స్ ఫార్ములా 4 కార్లు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. ఫార్ములా 3 పోటీలకు ముందు ఈ ఫార్ములా 4 పోటీలను నిర్వహించేందుకు షెడ్యూల్ చేశారు. ఫార్ములా 3 కార్లు రెండు రోజుల ఈవెంట్లో షెడ్డు నుంచి బయటకు రాకపోవటంతో.. ఇక స్ట్రీట్ సర్క్యూట్ కాస్త జెకె టైర్స్ ఎఫ్ఎంఎస్సీఐ నేషనల్ రేసింగ్ చాంపియన్షిప్స్గా మారింది. జెకె టైర్స్ ఫార్ములా 4 కార్లు మూడు రేసులు నిర్వహించింది. ఫార్ములా 3 రద్దు కావటంతో.. అభిమానులకు ఫార్ములా 4 రేసు వినోదం పంచాయి. జెకెటైర్స్ చీర్ లీడర్స్ సైతం వేగంగా దూసుకెళ్లే కార్లలో విన్యాసాలు చేస్తూ అలరించారు. ఆదివారం పోటీలను క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సహా మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు వీఐపీ గ్యాలరీ నుంచి వీక్షించారు.