Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత్, న్యూజిలాండ్ పొట్టి సిరీస్ అప్పుడే తుది అంకానికి చేరుకుంది. ఆతిథ్య న్యూజిలాండ్ సిరీస్‌ను సమం చేసేందుకు సిద్ధమవుతుండగా, టీమ్ ఇండియా సిరీస్ విజయమే లక్ష్యంగా కనిపిస్తోంది. మౌంట్ మౌంగానురులో భారత్ గెలిచినా, న్యూజిలాండ్ పరాజయం చవిచూసినా.. ఇరు జట్లలో సమాధానం దొరకని ప్రశ్నలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. నేపియర్ టీ20 మ్యాచ్‌ను అటు కివీస్, ఇటు భారత్ సమస్యల పరిష్కార కోణంలో చూసేందుకు ప్రయత్నిస్తున్నాయి. భారత్, న్యూజిలాండ్ మూడో టీ20 పోరు నేడు.
- కివీస్‌తో మూడో టీ20 నేడు
- 2-0 విజయంపై భారత్ గురి
- మధ్యాహ్నాం12 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో..
నవతెలంగాణ-నేపియర్
బ్యాటింగ్ గాడిలో పడేనా?! :
తొలి టీ20 వర్షార్పణం కాగా.. రెండో టీ20లో భారత్ 65 పరుగుల తేడాతో గెలుపొందింది. గణాంకాల పరంగా భారీ విజయం నమోదు చేసినా..భారత జట్టులో సమస్యలు సైతం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ నిష్క్రమణతో పొట్టి ఫార్మాట్లో బ్యాటింగ్ శైలి మార్పుపై విపరీత చర్చ నడిచింది. జట్టు మేనేజ్మెంట్ సైతం ఆ దిశగానే సాగుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. కానీ వాస్తవం అందుకు భిన్నంగా కనిపిస్తోంది. సహజసిద్ధంగా సంప్రదాయ బ్యాటర్లను ఎంచుకుని, వారి నుంచి దూకుడు ఆశించటం టీమ్ ఇండియాకు పరిపాటి అయిపోయింది!. సంజు శాంసన్ వంటి విధ్వంసకారుడు అందుబాటులో ఉండగా అతడిని బెంచ్‌కు పరిమితం చేశారు. రెండో టీ20లో సూర్యకుమార్ యాదవ్ 51 బంతుల్లో 111 పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు 69 బంతుల్లో 64 పరుగులే చేశారు. ఓపెనర్‌గా వచ్చిన రిషబ్ పంత్ ఇబ్బంది పడగా.. ఇషాన్ కిషన్ 36 పరుగుల కోసం 31 బంతులు ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ మెరుపులతో భారీ స్కోరు సాధ్యపడింది. నేడు బ్యాటింగ్ లైనప్‌కు గట్టి పరీక్ష. ఆరంభం నుంచే ఎదురుదాడి చేసే ప్రణాళికలను నేపియర్లోనైనా పట్టాలెక్కిస్తారేమో చూడాలి. ఇక బౌలింగ్ విభాగంలో ఉమ్రాన్ మాలిక్‌కు అవకాశం లభించటం కష్టమే. భువనేశ్వర్, అర్షదీప్, సిరాజ్‌లతో కూడిన పేస్ త్రయం తుది జట్టులో నిలువనుంది. చాహల్, వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడాలు స్పిన్ బాధ్యతలు చూసుకోనున్నారు.
విలియమ్సన్ లేకుండానే..! :
న్యూజిలాండ్ సైతం కుదురుకునేందుకు ఇబ్బందులు పడుతోంది. రెండో టీ20లో ఛేదనలో ఎక్కడా లక్ష్యం దిశగా సాగలేదు. మార్టిన్ గప్టిల్ స్థానంలో టాప్ ఆర్డర్లో స్థిరపడిన ఫిన్ అలెన్‌కు తోడు డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్‌లు రాణించాల్సి ఉంది. మెడికల్ అపాయింట్మెంట్ నేపథ్యంలో కేన్ విలియమ్సన్ నేడు మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. సీనియర్ పేసర్ టిమ్ సౌథీ నాయకత్వ పగ్గాలు అందుకోనున్నాడు. 2024 టీ20 ప్రపంచకప్ జట్టు కోసం చూస్తోన్న కివీస్‌కు టిమ్ సౌథీ ప్రత్యామ్నాయం సైతం అవసరం. విలియమ్సన్ స్థానంలో మార్క్ చాప్మాన్ నేడు తుది జట్టులోకి రానున్నాడు. డార్లీ మిచెల్, జేమ్స్ నీషమ్ నిలకడగా విఫలమవుతు న్నారు. ఈ ఇద్దరు మెరిస్తే న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ కాస్త గాడిలో పడినట్టు అవుతుంది. ఇశ్ సోధి, మిచెల్ శాంట్నర్‌లు స్పిన్ మ్యాజిక్కు సిద్ధమవుతున్నారు. సౌథీతో కలిసి ఫెర్గుసన్, మిల్నె పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.
పిచ్, వాతావరణం : నేపియర్ పిచ్ భారీ స్కోర్లకు పెట్టింది పేరు. ఇక్కడ ఇంగ్లాండ్ అత్యధికంగా 241 పరుగులు బాదింది. సాయంత్రం సమయంలో చిరుజల్లులు కురిసే అవకాశం కనిపిస్తోంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ.. వర్షం అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునేందుకు మొగ్గు చూపవచ్చు.
తుది జట్లు (అంచనా) :
న్యూజిలాండ్ : ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), మార్క్ చాప్మాన్, గ్లెన్ ఫిలిప్స్, డార్లీ మిచెల్, జేమ్స్ నీషమ్, మిచెల్ శాంట్నర్, టిమ్ సౌథీ (కెప్టెన్), ఇశ్ సోధి, ఆడం మిల్నె, లాకీ ఫెర్గుసన్.
భారత్ : ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్య (కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, యుజ్వెంద్ర చాహల్.