Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రిస్టియానో రొనాల్డో సంచలన నిర్ణయం
మాంచెస్టర్ : ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా పరాజయం షాక్‌లో ఉన్న సాకర్ అభిమానులకు స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో మరో షాక్ ఇచ్చాడు. కెరీర్లో రెండోసారి మాంచెస్టర్ యునైటెడ్‌తో బంధానికి తెరదించాడు రొనాల్డో. గత వారం ఓ ఇంటర్వ్యూలో మాంచెస్టర్ యునైటెడ్‌పై రొనాల్డో విమర్శలు గుప్పించాడు. ప్రత్యేకించి మాంచెస్టర్ మేనేజర్‌పై తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చాడు. మాంచెస్టర్ యునైటెడ్‌లో తెరవెనుక బోగోతం బయటపెడతానని పెద్ద బాంబ్ పేల్చాడు. ఈ వ్యాఖ్యలతో రొనాల్డో, యునైటెడ్ బంధానికి బీటలు పడ్డాయని అర్థమైంది. తాజాగా, మాంచెస్టర్ యునైటెడ్, క్రిస్టియానో రొనాల్డోలు పరస్పర అంగీకారంతో కాంట్రాక్టును ముందుగానే తెగతెంపులు చేసుకుంటున్నామని ప్రకటించాయి. 'మాంచెస్టర్ యునైటెడ్‌తో సంప్రదింపుల అనంతరం పరస్పర అంగీకారంతో కాంట్రాక్టు ముందస్తు ముగింపునకు నిర్ణయించాం. మాంచెస్టర్ యునైటెడ్, అభిమానులను ప్రేమిస్తాను. ఇందులో ఎప్పటికీ ఎటువంటి మార్పు ఉండదు. సరికొత్త సవాల్ స్వీకరించేందుకు ఇది సరైన సమయం అనిపించింది' అని రొనాల్డో సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నాడు.
రొనాల్డోపై భారీ జరిమానా : ఇక మాంచెస్టర్ యునైటెడ్‌ను వీడిన రోజే క్రిస్టియానో రొనాల్డోకు ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఎఫ్ఏ) గట్టి షాక్ ఇచ్చింది. ఏప్రిల్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో ఓవర్టన్ చేతిలో మాంచెస్టర్ 0-1తో పరాజయం పాలైంది. ఓటమి అనంతరం ఓ బాలుడి చేతుల్లోంచి ఫోన్‌ను లాక్కున్న రొనాల్డో పగలగొట్టాడు. తన ప్రవర్తన పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేసిన రొనాల్డో.. ఆ బాలుడిని తర్వాతి మ్యాచ్‌కు ఆహ్వానించి క్షమాపణలు చెప్పాడు. కానీ 14 ఏండ్ల బాలుడి తల్లి రొనాల్డో క్షమాపణలను తిరస్కరించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఎఫ్ఏ విచారణ చేపట్టింది. రూ. 42 లక్షలు (50 వేల యూరోలు) జరిమానాతో పాటు ప్రీమియర్ లీగ్‌లో రెండు మ్యాచుల నిషేధం విధించింది.